నేను – అన్నవరం

ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు నిమిత్తం మూడు పర్యాయాలు నేను అన్నవరం వెళ్ళేను. మ్రొక్కుబడులు ఉన్న పెళ్ళిళ్ళు, ఖర్చు తగ్గించుకోవాలనుకోనేవారు, రెండవ పెళ్లి, ముహూర్తం అక్కరలేని పెళ్ళిళ్ళు నిత్యం అక్కడ జరుగుతుంటాయి. గత ఏప్రియల్ లో ఒక పెళ్ళికి హాజరయి తిరుగు ప్రయాణంలో అన్నవరం స్టేషన్లో కూర్చొని నా అన్నవరం జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొన్నాను.

మాది విశాఖజిల్లా నక్కపల్లి మండలంలో చినదొడ్డిగల్లు అనే పల్లెటూరు. మాఊరి ఎలిమెంటరీ స్కూల్లో ఐదవ తరగతి పాసయిన తర్వాత ‘ఎంట్రన్స్ పరీక్ష’ రాసి, నక్కపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆరవ తరగతిలో (1960-61 సం.) జాయిన్ అయ్యాను. మా ఊరు నుండి నక్కపల్లికి నాలుగు కిలో మీటర్ల దూరం. వేరు వేరు తరగతులు చదివే పదిహేను మందిమి రోజూ ఉదయం ఎనిమిదిన్నరకు భోజనం కేరేజి, భుజాన్న పుస్తకాల సంచులతో కొంత మేర పుంత బాట లోను, తర్వాత హైవే మీద నడచి స్కూలుకు వెళ్లి తిరిగి సాయంత్రం ఆరున్నరకు ఇళ్లకు చేరేవాళ్ళం. ఆ రోజుల్లో అన్నితరగుతల విద్యార్ధులకు వార్షిక పరీక్షలు ఉండేవి. అప్పుడు ఉండే ‘డిటెన్షన్ సిస్టం’ వల్ల ఎవరైనా వార్షిక పరీక్షలో డింకీ కొడితే అదే తరగతి మళ్ళీ చదవాల్సి వచ్చేది. పరీక్షాఫలితాలు మే నెలలో వచ్చేవి. సాధారణంగా అందరం పాసయ్యేవాళ్ళం. పాసయిన తర్వాత అన్నవరం ప్రోగ్రాం పెట్టుకోనేవాళ్ళం. మాఊరి నుండి అన్నవరానికి 30 కిలోమీటర్ల దూరం. సైకిలుకి ఇద్దరం చొప్పున ఆరు సైకిళ్ళు అద్దెకు తీసుకొని ఉదయం ఐదు గంటలకు బయలుదేరి, దారిలో నామవరం దగ్గర ‘ఒడ్డుమెట్ట’ వినాయకుడిని దర్శించుకొని, తుని లో ఆగి కొబ్బరికాయలు, అరటిపళ్ళుకొని మళ్ళీ సైకిళ్ళు ఎక్కేవాళ్ళం. తేటగుంట తర్వాత ఎత్తుగా ఉండే అన్నవరం గండీ తగిలేది. అంతవరకు రోటేషన్ పద్దతిలో ఒకరుతర్వాత మరొకరం సైకిలు తోక్కే మేము గండీ దగ్గర మాత్రం వెనక కూర్చున్నవాడు కూడా పెడల్స్ మీద కాళ్ళు పెట్టి తొక్కి చెమటలు కక్కుకొంటూ గండీ ఎక్కి ఊపిరితీసుకోనేవాళ్ళం. తిరగు ప్రయాణం లో గండీ దిగేటప్పుడు చాలా హుషారుగా ఉండేది. రోడ్డు వాలుగా ఉండడం వల్లసైకిలు తొక్కకుండా మూడు మైళ్ళు యమస్పీడుతో పోయేది. ఆవిధంగా అన్నవరం చేరి సైకిళ్ళు ఏబడ్డీ కొట్టు దగ్గరో పెట్టేవారం.
అన్నవరం రాగానే కొంతమంది పంతుళ్ళు పంపా నదిలో పుణ్యస్నానం చేయిస్తామని వెంటబడేవాళ్ళు. మేము అక్కరలేదని చెప్పినా వదిలేవారు కారు. చివరకు మీకు తోచినంత ఇవ్వండనే భ్రాహ్మణుడికి బుక్ అయ్యేవాళ్ళం. అప్పటికి అన్నవరం రిజర్వాయర్ కట్టకపోవడం వల్ల ఎండిపోయిన పంపానది లో అక్కడక్కడ తీసిన చెలమల దగ్గర కూర్చోబెట్టి కర్రముక్క కట్టిన తాటాకు చేదతో మానెత్తిమీద నీళ్ళు పోస్తూ మంత్రాలు చదివిన, దక్షిణగా గోదానం, భూదానం, వస్త్రదానం, స్వర్ణదానం అని దండకం చదివి భయపెట్టి ఒక్కొక్కరి దగ్గర పావలా తక్కువలేకుండా లాగేవారు. ఇప్పటిలాగా కొండమీదకు బస్సులుగాని,ఆటోలుగానిలేవు.కొండ ఎత్తు తక్కువ.మెట్లు కూడా సింహాచలంకొండ మెట్ల లాగ నిట్టనిలువుగా ఉండక వంపులు తిరుగుతూ ఉండడంవల్ల శంకరాభరణం లో చంద్రమోహన్ రాజ్యలక్ష్మి లాగ ఆడుతూ పాడుతూ కొండ ఎక్కేవాళ్ళం. ఎక్కేటప్పుడు దేవుడి ప్రాంగణానికి దగ్గరగాఉన్న మెట్ల అరుగులపై కాస్సేపు మకాం వేసి, తెల్లవారుఝామున పెళ్ళయి పెళ్లి తర్వాత దర్శనం చేసుకొని, పెళ్లి అలకరణతో, అలసిపోయిన ముఖాలతో మెళ్ళో పసుపుబొత్తు, కర్పూరదండలు,వాడినమల్లెదండలవాసనలతో కొండ దిగుతున్నకొత్తజంటలనీ,వాళ్ళతో తోడుగా వచ్చే అందమైన అమ్మయల్నీచూస్తూ కాస్సేపు ఆనందించేవాళ్ళం.
మాబృందం లో కొందరు కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించుకొని స్నానాల అనంతరం సభ్యులందరం మొదటిఅంతస్తులో పూర్తిగా పూలతో అలంకరిచిబడి, లింగాకారరూపంలో నున్న సత్యదేవుని, పై అంతస్తులో నున్నమూల విరాట్టుని సందర్శించేవాళ్ళం. జనాలకి ఇప్పుడంత భక్తిలేకపోవడం వల్లనో, ఆదాయం లేకపోవడంవల్లనో భక్తుల రద్దీ అంతగా ఉండేదికాదు. దర్శన కార్యక్రమం మొత్తం పావు గంటలో ముగిసేది.గర్భగుడి ప్రక్కనఉన్న ఎండనుబట్టి టైము చూపించే ’సన్ డయల్’ ని పరిశీలించి, ముతకగోధుమరవ్వ,పాలు,పంచదార,నెయ్యలతోచేసి విస్తరాకులలోకట్టిన ప్రసాదంపొట్లాలు కొనుక్కొని తినేవాళ్ళం.కొందరు సత్యనారాయణమూర్తి తాళ్ళు అనబడే లేసుతో అల్లిన నల్లనిసిల్కు తాళ్లని కొని చేతి మణికట్టుకు కట్టుకొనేవారు.ఇప్పుడా తాళ్లని ఎవరూ కొనడం లేదు.కొద్దిసేపు కొండ మీద జరిగే సామూహికవివాహాలను, సత్యనారాయణ వ్రతాలను తిలకించి తాపీగా కొండ దిగేవాళ్ళం. ఒంటిగంటకు పంపానదికి వెళ్ళే దారిలో ఉండే హోటల్ కు వెళ్ళేవారం. పూర్తిభోజనం అర్ధరూపాయి గాని పదిఅణాలు గాని ఉండేది. ఆరోజుల్లో హోటల్లోటేబుల్ మీల్స్ చేయడం మాకు వింత అనుభూతి. అరిటాకులో రెండుపచ్చళ్ళు,రెండుకూరలు.కందిపొడి, అప్పడం వేసేవారు. ఇన్నిఐటమ్లు మా ఇంటి భోజనం లో ఉండేవికావు. అన్నంవడ్డించి పలచని పప్పు, చెంచానెయ్య వేసేవారు. ఇంట్లో మా అమ్మ చేసే పప్పుచారు రుచివేరు ఇక్కడ సాంబారు రుచివేరు. అందువల్ల సాంబారుతో ఒక ముద్ద ఎక్కువ తిని, పెరుగుఅన్నం తర్వాత తాగినంత మజ్జిగ తాగి, తృప్తిగాబయటపడి మళ్ళీ సైకిళ్ళు ఎక్కి సాయంత్రం ఐదు గంటలకు తుని చేరేవాళ్ళం.  తునిలో వీర్రాజుటాకీస్ లోగాని సోమరాజుటాకీస్ లోగాని నేలటిక్కెట్టు కొని మొదటి ఆట సినిమా చూసి పాయకరావుపేట సూర్యమహల్ లో రెండవఆట చూసేవారం. తుని నుండి తాండవవంతెన వరకు అప్రమత్తం గా ఉండి రోడ్డుమీద పోలీసులెవరైనాఉన్నారేమోనని గమనిచేవారం. సైకిలుకి ఇద్దరెక్కినా, లైసెన్స్ బిళ్ళ లేకపోయియా, లైటులేకపోయినా డబ్బులు గుంజేవారు. ఇళ్లకు తెల్లవారు నాలుగు గంటలకు చేరి, మర్నాడు నుండి మేం రెండు గ్రూపులుగా విడిపోయి ఏఎన్ఆర్ నటనని విమర్శిస్తూ ఎన్టిఆర్ గ్రూపు, ఎన్ టి ఆర్ నటనని విమర్శిస్తూ ఏఎన్ఆర్ గ్రూపు వాదించుకొనే వారం.
ఈ ప్రక్రియ ఐదు సంవత్సరాలపాటు అంటే నేను ఆరు నుండి ఏడవతరగతి – పది నుండి ఎస్.ఎస్.ఎల్.సి లోకి వచ్చేవరకు నిరాటంకంగా కొనసాగింది. ఎస్.ఎస్, ఎల్.సి పరీక్షలముందు నాకు పరీక్షల్లో 500 మార్కులు వస్తే గుండు గీయించుకొంటానని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి మొక్కేసాను. నాకు 495 మార్కులు రావడం వల్ల దేవుడి మొక్కు తీర్చడానినికి సిద్దపడ్డాను. అప్పుడే నాకు గడ్డు సమస్య ఎదురైయింది.

* * *

ఆరోజుల్లో మా ఇల్లు ఎర్రజెండా కు కేంద్రంగా ఉండేది. ఆనాటి అవిభక్త కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకులైన ఎం.వి.భద్రం, వై.విజయకుమార్,కోడిగంటి గోవిందరావు, పి.వి.రమణ, డబ్బీరు నరసింహమూర్తి, కొమాకుల నారాయణమూర్తి మొదలగువారు పార్టీ కార్యకలాపాల నిమిత్తం తరచు మా ఇంటికి వచ్చేవారు. ఆనాడు పాయకరావుపేట నియోజకవర్గం నుండి సి.పి.ఐ. ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ మండే పిచ్చియ్య గారి కార్యాలయం మాఇంటి వీధి అరుగే! ఆ నేపధ్యం లో మేము సిద్ధాంతరీత్యా నాస్తికులం ఆచరణరీత్యా ఆస్తికులం. నేను నామొక్కు సంగతి వెళ్ళడించేసరికి, కష్టపడి చదవకుండా దేవుడికి మొక్కుకొంటే మార్కులు వచ్చేస్తాయా ? అని నా మొక్కులోని అసంబద్దతని, గుండు గీయించుకొంటె ఉండే నా అవతారాన్ని మా అన్నయ్య ఆట పట్టించసాగాడు.

ఈమధ్య గుండుగీయించుకోవడం గురించి కొంత తెలుసుకోవాలని ప్రయత్నించేను. దీనిపై తాపీ ధర్మారావు, ఆరుద్ర వంటి పరిశోధకులు రాసిన ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు’ లాంటి గ్రంధాలేమి దొరకలేదు.కాని నాకు లభించిన సమాచారం మేరకు హిందూ, బౌద్ద, ముస్లింమతాలలో ఈ ‘గుండు’ ఆచారం కనబడుతుంది. బౌద్దసన్యాసులు శిరోముండనం తోపాటు గెడ్డాలు మీసాలు కూడా తీసేస్తారు. ముస్లింలు కొందరు గుండుగీయించుకుని మీసాలు తీసేస్తారు కాని గెడ్డం ఉంచుతారు. హిందూ మతం లో మాత్రం గుండుచేయించుకొనే కార్యక్రమం లో ఏకరూప సిద్ధాతంలేక వేరు వేరు సందర్భాలలో భిన్నవిధంగా ఉండి, గందరగోళంగా ఉంది.
హిందూమతం లో ఈకార్యక్రమం పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించడంతో మొదలవుతుంది. మనిషి బుద్ధిపూర్వకం గా చేసిన సమస్త పాప ఫలితాలు తలవెంట్రుకలకు చేరతాయట. అందువల్ల పుణ్యక్షేత్రాలలో ఆయా దేవుళ్ళకు తలనీలాలు సమర్పించడం వల్ల పాపాలన్నివదలి ఇకపై నీతివంతంగా ఉంటామని తెలియజేయడమే శిరోముండన లోని మర్మమట – ఈరకంగా గుండుగీయించు కోవడం ఒక పుణ్యకార్యక్రమం.
ఇక సనాతన హిందూధర్మం ప్రకారం అగ్రవర్ణాలవారు ద్విజులుగా మారే ఉపనయన సమయం లోను, తలిదండ్రులు చనిపోయినప్పుడు గుండుగీయించి చిన్న పిలక ఉంచుతారు. పూర్తిగా గుండుచేయించుకొంటే వైదిక ప్రక్రియలకు పనికిరారట. అలాగే బ్రాహ్మణవర్ణం లో భర్త చనిపోయిన విధవలకి క్షురకర్మ చేయించి, మంగళసూత్రాలు, గాజులు, బొట్టులాంటి వివాహ చిహ్నాలు తీసేసి ఇంటికే పరిమితం చేస్తారు – ఇది సనాతన ఆచారం.
పురాణాల్లో శ్రీకృష్ణుడు బలవంతంగా రుక్మిణిని ఎత్తుకెళ్ళేటప్పుడు అడ్డుకొన్న రుక్మిణి అన్న రుక్మిని ఓడించి రుక్మిణి ముఖం చూసి, చంపకుండా రుక్మికి గుండుగీయించి వదిలిపెడతాడు.అలాగే ఇప్పటికి కొన్ని గ్రామాలలో అగ్రవర్ణాలవారు కొన్నికారణాలమూలంగా దళితయువకులకు గుండు గీయిచి ఊరునుండి బహిష్కరిస్తారు – ఇది అవమాన కార్యక్రమం
ఈమధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలిత అక్రమాస్తుల కేసు సందర్భంగా కర్నాటక హైకోర్టు దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చినపుడు తీర్పుని వ్యతిరేకిస్తూ కొందరు అన్నా డి.ఎం.కె కార్యకర్తలు గుండుగీయించు కొన్నారు. మళ్ళీ హైకోర్టు నిర్దోషి గా పరిగణిస్తూ తీర్పుఇచ్చినపుడు సంతోషంతో కొందరు గుండుగీయించు కొన్నారు. – ఇందులో మొదటది నిరశన రెండోది హర్షణ.

ఇక నాసంగతికొస్తే నామార్కులుకి దేవుడికి ఉన్న సంబంధం నాక్కూడా అర్ధం కాకపోవడం వల్ల,మా అన్నయ్య వేళాకోళంతో నాకు పౌరషం వచ్చి నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టి, అప్పటి నుండి అన్నవరం వెళ్ళినా దేవుడికి ముఖం చాటేయ సాగాను.
ఈవిధం గా కొంతకాలం సాగిందిగాని నాకు పెళ్ళైన కొత్తలో మాప్రాంతపు సాంప్రదాయం ప్రకారం సత్యనారాయణ వ్రతం నిమిత్తం ఒక మెట్టు దిగక తప్పలేదు.నేను మాశ్రీమతి ని తీసుకొని అన్నవరం వెళ్లి వ్రతం టికెట్టుకొని బయట వ్రతంతాలూకు పూజాసామగ్రితో ఉన్న తాటాకుబుట్ట కొని ఒక వ్రతం హాల్లోకి ప్రవేశించాం. 40 మంది దంపతులను ఎదురు ఎదురుగా రెండు వరసలలో కూర్చోబెట్టి ఐదుగురు దంపతులకొక పురోహితుడు చొప్పున సూచనలిస్తూ ఎదురుగా కొద్దిగాబియ్యం పోసి వాటిపై నవగ్రహాల పేర్లు ముద్రించి ఉన్న పెద్దజేబురుమాలు లాంటి గుడ్డ పరిచి, దేవస్తానం వారు ఇచ్చిన సత్యనారాయణస్వామి వెండి రూపును మద్యపెట్టి ,అభిషేకంచేస్తూ మంత్రాలు చదువుతూ వక్కలతో తమలపాకుల వరసలుపేర్చి సకల దేవుళ్ళను పూజించడం జరిగింది. తదుపరి మరొక పూజారి మైకు పట్టుకొని సత్యనారాయణస్వామి వ్రతం కధ చెప్పడం మొదలెట్టాడు .

ఈకధనేను చాలా సార్లు విన్నాను. ఒక బీద బ్రాహ్మడు,సంతానంలేని ఒక వైశ్యుడు. సత్యనారాయణస్వామి వ్రతం చేసి భోగభాగ్యాలు పొందుతారు.ఈ వ్రతం కధలన్నీఒకేలాగ ఉన్నా వాటిలో త్రినాధ వ్రతంకధే నాకు ఇష్టం. అందులో త్రిమూర్తులు చెట్టెక్కి ఉంటారు. పూజాద్రవ్యాలలో గంజాయి ఉంటుంది. ఈవ్రతం సింగిల్ సిట్టింగ్ లో కాకుండా నాలుగు వారాలు చేయాలి. నా చిన్నప్పుడు మా చుట్టుప్రక్కల ఎవరిఇంట్లో త్రిమూర్తుల వ్రతం జరిగినా వాళ్లకు చడువురాక, కధ చదవడానికి నన్ను పిలిచేవారు. హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరిపెచ్చు, అరటిపళ్ళు, మర్రిఆకులో చలిమిడి వడపప్పు ఒక అణా నాకు ముట్టేవి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాల తర్వాత సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేయిస్తారు కాని త్రినాధ వ్రతం చేయించరు. సత్యనారాయణ వ్రతం లో భోక్త విష్ట్నువు కాని త్రినాధ వ్రతం లోబ్రహ్మ, విష్ట్న, మహేశ్వరులు ముగ్గుర దేవుళ్ళు ఉండే వ్రతానికి తక్కువ ప్రాధాన్యత కల్పించడంలో కొంత కుట్ర జరిగినట్టు తోస్తున్నది.

హాలులో వ్రతం కధ పూర్తయి,మాకు ప్రసాదం అందిన వెంటనే కండపుష్టిగా, గంభీరంగా ఉన్న మరొక పురోహితుడు రంగప్రవేశం చేసి మైకులో వ్రతం, వ్రతం తర్వాత బ్రాహ్మణునికి ఇచ్చే ‘దక్షిణ’ యొక్క ప్రాశస్త్యాన్నిగురించి అనర్గళంగా ఉపన్యసిస్తూఉంటే మామనస్సులోని కోరికలు తీరడంతోపాటు మేము ధన, కనక, వస్తు, వాహన, సమస్త భోగభాగ్యాలతో తులతూగుతున్నట్ట కలలుకంటూ మైమరచి ఉండగా వ్రతం చేయిచిన పురోహితుడు ప్రతిఒక్కడి దగ్గరుకు వచ్చి వాళ్ళ స్తోమత్తునిబట్టి నూటపదహార్ల నుండి వెయ్య నూటపదహార్లవరకు మాదగ్గర వడకి , కాళ్ళకిమొక్కించుకొని, ప్రత్యేక మార్గం ద్వారా మమ్మల్ని దర్సనం క్యూ మద్యలో కలిపేసారు. క్యూలో జనం పెద్దగా లేరు. భార్యతో దేవుడి ముందు నమస్కరిస్తూ నిలబడ్డాను. అర్చకుడు నాకన్నాముందు నిలబడి ఉన్నదంపతుల గోత్రనామం, పేర్లు అడిగి బుగ్గన కిళ్ళీతో, ఇదునిమషాలపాటు వాళ్ళకు అభిషేకమంత్రాలు చదివి శఠగోపంతో వాళ్ళను దీవించి వాళ్ళు వేసిన దక్షిణ తీసుకొని, వాళ్ళను ఆగమని స్వామివారికి అలంకరించి తీసేసిన గులాబీల దండ బహూకరించేడు. కానుకలు ఎవ్వరికి ఇవ్వరాదు, హుండీలో మాత్రమే వేయవలెను అనే బోర్డులు ఉన్నప్పటికీ నేను కూడా ఉత్సాహంతో శఠారి ఉన్న వెండిపళ్ళెం లో ముందుగానే దక్షిణవేయగానే దానిని లిప్తలో మొలకు ఉన్నపంచెలో దోపి మాగోత్రనామం, పేర్లు అడిగి, మా గోత్రనామం ద్వారా ‘కులం’ తెలిసిపోవడం వల్ల ఏకవాక్య ఆశీర్వచనంతో సరిపుచ్చేసేడు. నాపట్ల పూజారి చూపించిన వివక్షతకు అసంతృప్తి చెంది విచారించేను.భారతదేశ రాజకీయ వ్యవస్తనే కులం నడిపిస్తున్నపుడు పూజారిని తప్పుపట్ట పట్టనవసరం లేదనిపించింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తమ సామాజిక వర్గాన్ని ఇతరులు వెన్నక్కినెట్టేసి అన్నిరంగాలలో ముందుకు దూసుకు పోతున్నపుడు తమవారికి పూజారిగారు అంతకంటే మేలేమి చేయగలరు?

నేను అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్ కాలేజిలో బిఎస్సీ చదివేటపుడు, అన్ని సబ్జెట్టుల కంటే ఇంగ్లీష కష్టంగా ఉండేది. రెండుషేక్స్పియర్ డ్రామాలు (ఒక త్రాజడీ,ఒక కామెడి) మోడరన్ డ్రామా,మోడరన్ పోఎట్రీ, మిల్టన్ గారి ఓల్డ్ పోఎట్రీ రెండు ప్రోజులు ఇత్యాదులు మొత్తం 8 పాఠ్యపుస్తకాలు ఉండేవి. నేను డిగ్రీ చదివేరోజుల్లో మొదటి సంవత్సరం ఎటువంటి పరీక్షలు ఉండేవికావు. ఫస్ట్ఇయర్ ని రెస్ట్ ఇయర్ గా భావించి జాలీగా గడపడం వల్ల మొదటసారిగా ఇంగ్లీషు పేపర్ లో తప్పడం, నాకు ఉద్యోగం రావడం ఆలస్యంకావడం, ఇలా కాల గమనంలో నాకొచ్చే ఇతరత్రా కష్టాలన్నింటికి కారణం నేను సత్యనారాయణస్వామికి చేసిన అపచారమే నని మా అమ్మ గట్టిగా నమ్ముతూ ఉండేది. అందుకు పరిహారార్ధంగా మా మొదటి అమ్మాయికి నేను సూచించిన ‘వాణి’ పేరును ‘సత్యవాణి ‘ గా మార్చి నాబాకీని పరోక్షంగా చెల్లుబాటు చేసింది. అప్పటినుండి అన్నవరం దేవుడికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు.

* * *
నేను ఏప్రియల్ లో కొండమీద ‘హరిహర సదన్’ అనేవసతి గృహం వద్ద జరిగిన ఒక పెద్దింటి పెళ్ళికి హాజరయ్యాను. ఆ వసతిగృహాన్ని చూసి ఆశ్చర్యపోయాను. నాలుగు అంతస్తులల్లో, అన్నిసౌకర్యాలు ఉన్న 135 గదులతో, విశాలమైన కారుపార్కింగ్ స్తలంతో గుడిని మించి ఉన్నది. దగ్గరలోనే ప్రకాష్ సదన్, విష్ణు సదన్ అనేమరికొన్ని పెద్దవసతి గృహాలు ఉన్నాయి. పెళ్లి, భోజనాలు మధ్యాహ్నం 12 గంటలకు ముగిసాయి. అంధ విశ్వాసాలు, ఛాందసఆచారాలు కూడిన విశాల మైన భారతీయ సమాజం లో ఉంటూ ఆ ప్రభావం నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదు. బుర్రకు పడుతున్న బూజును శ్రీ గోగినేని బాబు లాంటివారు వదలకొడుతున్నందు వలన దైవదర్శన ఆలోచన చేయలేదు. నేను ఎక్కవలసిన ట్రైను సాయింత్రం మూడుకు గాని రాదు. అందువల్ల కొండమీద తిరుగుతూ వచ్చిన మార్పులు బేరీజు వేసాను.

గతం లో కొండమీదకి మెట్లెక్కే వెళ్లేవారం. వాహనాల రాకపోకలు తక్కువ. వాహనాలు రావడానికి, పోవడానికి ఒకేరోడ్డు ఉండేది. ఇప్పుడు వాహనాలు ఎక్కే దారి వేరు, దిగే దారివేరు.ఆటోలతో పాటు దేవస్తానం బస్సులు స్టేషన్ నుండి కొండమీదకి ప్రతీ ఇదు నిమషాలకొకటి తిరుగుతున్నాయి. కొండ ఎక్కడానికి ఆటో చార్జి పది రూపాయలే. మెట్లెక్కి వెళ్ళేవారు తగ్గడంతో మెట్లమీద అడుక్కొనే భిక్షగాళ్ళ ఆదాయం తగ్గింది. కొండమీద సత్రాల, కాటేజీల సంఖ్య పెరిగింది. గుడికి పడమర వైపు పెద్ద గోపురం నిర్మించబడింది. రాతి ‘సన్ డయల్’ స్తానం లోచుట్టూ రైలింగ్ తో మార్బుల్ సన్ డయల్ ఆకర్షణీయంగా ఉంది. జైపూర్ జంతర్ మంతర్ ఖగోళపరిశోధనాశాలలో సన్ డయల్ అర్ధంకాదు గాని ఇక్కడ సన్ డయల్ టైము సూత్రం తేలికగా అర్దమవుతుంది. కొండమీద పచ్చదనం పెరిగింది కాని తురాయి చెట్లు తగ్గాయి. ప్రకృతి చికత్సాలయం లోచౌక అద్దె గదులు, అనుబందం గా జిమ్ము, యోగా హాలుతో సౌకర్యవంతంగా ఉంది.. ‘గోకులం’అనే గోశాల వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నది.అందులోని ఆవుదూడలకు ఎటువంటి ఆహారపదార్దాలు పెట్టి వాటిని అనారోగ్యంపాలు చేయవద్దని బోర్డుపెట్టి, అక్కడ కాపలావారు వారిస్తున్నప్పటకి, అక్కడ పేడ, రొచ్చు కంపులను భరిస్తూ ప్రదక్షణలు చేస్తూ, గోమాతలకు అరటిపళ్ళు, కొబ్బరిపెచ్చులు తినిపించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.నిత్యాన్నదానం కార్యక్రమం మందకొడిగా సాగుతున్నది.

కొండ దిగువున రిజర్వాయర్ ని ఆనుకొని మంచి పార్కుఅభివృద్ధి చేసారు. అందులో పిల్లల విభాగం కూడా ఉంది. పార్కు దగ్గర రిజర్వాయర్ లో స్నానాలు చేయడానికి వీలుగా మెట్లుకట్టారు. అక్కడ ఒక ప్రవేటు రిసార్ట్ వెలిసింది. డిసెంబర్ నెలలో అన్నవరం వచ్చినపుడు పంపారిజర్వాయర్ పాపికొండల మద్య గోదావరి లాగ నిండుగా తళతళ కనువిందుగా ఉండగా ఇప్పుడు ఎండిపోయి వెలవెలబోతూ కళావిహీనంగా ఉంది. అప్పుడు లారీలన్నీ గుడి ముందుగా పోవడంవల్ల లారీల వాళ్ళుమెట్ల దగ్గర ఆపి కొబ్బరికాయలు కొట్టి ప్రసాదంకొనుక్కొనేవారు. ఇప్పుడు లారీలన్నీ బైపాస్ రోడ్డుమీదుగా పోవడం వల్ల ముఖ ద్వారప్రాంగణం లో కొబ్బరిపెచ్చుల గుట్ట సైజు తగ్గింది. ఊరిలో మార్పులేదుగాని ఊళ్ళో హోటళ్ళ ,లాడ్జిలు, ప్రైవేటు కళ్యాణమండపాలు దండిగా పెరిగాయి.. ఆర్ టి సి కాంప్లెక్స్ పరిశుబ్రంగా ఉంది.

ఆటోలో స్టేషన్ కి చేరుకొన్నాను. గతంలో బస్సులు,ఆటోలు రైల్వేగేటు దాటి బుకింగ్ కౌంటర్ వైపు ఆగేవి. ఇప్పుడు పొడవైన మూడు ఫ్లాట్ ఫారాలను కలుపుతూ బయట గ్రౌండ్ లోకి నేరుగాదిగేటట్టు ఓవర్ బ్రిడ్జి కట్టడంవల్ల అక్కడే దిగి స్టేషన్ లోకి అడుగుపెట్టాను. స్టేషన్ లో సుమారుగా అన్ని ఎక్సప్రెస్ ట్రైనులు ఆగుతున్నాయి. స్టేషన్ అంతా ప్రయాణీకులతో సందడిగాఉంది. కాస్సేపటికి విజయవాడ వైపు వెళ్ళే రత్నాచల్, ప్రశాంతి ఎక్స్ ప్రేస్ లు వచ్చాయి. గాలీవాన వెలిసినట్లు స్టేషన్అంతా ఖాళీ అయింది. నేను యలమంచిలి వెళ్ళడానికి సింహాద్రి ఎక్స్ ప్రెస్ కు టిక్కెట్టు కొని కూర్చొని గతాన్ని ఆలోకించేను.
ట్రైన్ రాగేనే ఎక్కికూర్చున్నాను .ట్రైన్అన్నవరం లో అగినంత సేపు, కంపార్ట్ మెంట్లో కొందరు గుడివైపు తిరిగి కూర్చొనే దణ్ణాలు పెడుతున్నారు. కొందరు లెంపలు వేసుకొంటున్నారు. నేను ఇంటికి చేరాను. మావీధిలో ఎవరు తిరుపతి వెళ్ళినా లడ్డూ ప్రసాదం, షిరిడి వెళ్లినవారు పంచదారగుళికలు-కోవాబిళ్ళలు, శబర్ మలై వెళ్లినవారు బెల్లంపాకం వంటి ప్రసాదం అందరి ఇళ్లకు పంచడం అలవాటు. ఆసాంప్రదాయాన్ని పాటించడానికి నేను తెచ్చిన ప్రసాదం తీసుకొని మా ఆవిడ వీధిలోకి వెళ్ళింది.