ఆవు వ్యధ

నేను చిన్నప్పుడు నాల్గవ తరగతి లో ఉండగా మాలో ఉండే సృజనాత్మకని , తెలుగు భాష మీద మాకుండే పట్టును తెలుసుకోవడానికి వ్యాస రచనను అభ్యాసం చేయించి, పరీక్షలలో కూడా వ్యాసాలు వ్రాయమనేవారు.
సాధారణం గా మా వ్యాసరచన అభ్యాసం ‘ఆవు ‘ తో మొదలయ్యేది .ఆవు సాదు జంతువు.దానికి నాలుగు కాళ్ళు ,రెండుకొమ్ములు,కళ్ళు,ముక్కు,తోక ఉండును.ఆవు గడ్డితిని నెమరు వేయును.ఆవు పాలు ఇచ్చును.అవి ఏంతో శ్రేష్టమైనవి.ఆవు గంగడోలును నిమిరిన సంతోషించును…… ఈవిధంగా వ్యాసం సాగేది
మేము పై తరగతులకు వెళ్ళిన కొద్దీ సినిమాలు, రేడియోలు, గ్రంధాలయాలు, ఇటువంటి వేరు వేరు అంశాలను ఇచ్చి వ్యాసాలు రాయమనేవారు. కాని మాలో ఒకడికి ఆవు వ్యాసం తప్ప వేరే అంశాలమీద వ్యాసం రాయడం రాక, ఏ వ్యాసం రాయమన్నా ,వాడి వ్యాసమంతా ఏదోవిధంగా ఆవుచుట్టూనే తిరుగుతూ ఉండేది. ఉదాహరణకి రేడియో గురించి వ్యాసం రాయమంటే , వాడు ‘ రేడియోలో ప్రతి రోజూ సాయంత్రం పాడి పంటల కార్యక్రమం వచ్చును. పాడిపంటల కార్యక్రమంలో ఆవులు గురించి చెప్పుదురు . ఆవు పెంపుడు జంతువు. దానికి నాలుగు కాళ్ళు .కళ్ళు,ముక్కు,చెవులు,పెద్ద శరీరం ,తోక ఉండును.తోకతో ఈగలు తోలుకోనును.తల్లి తర్వాత తల్లి వంటిది ఆవు.ఆవు పాలు ఎంతో శ్రేష్ఠమైనవి. అందుకే వేమన –గంగిగోవు పాలు గరిటెడైనను చాలు , కడివెడైననేమి ఖరము పాలు , అన్నారు “…….ఈవిధంగా ఆవు వ్యాసమే రిపీట్ అయ్యేది. అందువల్ల ఎటువంటి ప్రశ్నకైనా ఒకే విధమైన జవాబు రాసేవాడ్ని మా మాస్టార్లు ‘ఆవు వ్యాసం గాడి వా’ అని వెటకారం చేసేవారు.
అయితే ఈమధ్య తెలుగు పత్రికలు పెద్దగా పట్టించుకొకపోయినా,రోజూ ఇంగ్లీషు దిన,వార. పక్ష పత్రికలో ఆవు గురించి వ్యాసాలూ, వార్తలూ తెగ వస్తున్నాయి. కాని ఆ వ్యాసాలన్నీ చరిత్రకారులూ,మేధావులూ, ప్రముఖ జర్నలిస్టులూ ,రాజకీయవేత్తలూ రాస్తూ ఉండడం వల్ల జఠిలంగా ఉంటున్నాయి. అందువల్ల ఆ వార్తల కు కొంత నేటివిటీని జోడించి , నాకు తెలిసిన విషయాలతో మళ్ళీ ‘ఆవు వ్యాసం’ రాస్తున్నాను.

 

వర్తమాన సంఘటనలు
దేశాన్ని సుదీర్గకాలం ఏలిన కాంగ్రెస్ పార్టీ అవనీతి కుంభకోణాల్లో మునిగిపోవడం వల్ల 2014 పార్లమెంట్ ఎన్నికలలో దేశ ప్రజలు మోది నాయకత్వం లోని భారతీయ జనతా పార్టీ కి 282 సీట్లలో గెలిపించి పార్లమెంట్ పీఠాన్ని కట్టబెట్టేరు. అధికారం దక్కడం తో భాజప ,దాని మాత్రు సంస్థ యైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ల సిద్ధాంత లైన “హిందుత్వ” అంటే హిందూమత సంస్కృతిక జాతీయవాదం వ్యాప్తిచేయడం (టూకీగా సనాతన హిదూమతాన్ని పునరుద్దరించడం),అయోధ్య లో రామమందిరం నిర్మించడం , జమ్మ కాశ్మీర్ కు ప్రత్యెక రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుచేయడం,ఉమ్మడి పౌర స్మ్రుతిని ఏర్పాటు చేయడం.,కుహనా లౌకిక వాదానికి బదులు సర్వ ధర్మ సమభావం ప్రవేశపెట్టడం మొదలగు సిద్దాంతాలను , ఆచరణలోకి పెట్టాడానికి ఉత్సాహవంతులైన కొంతమంది భాజప, అరెసెస్స్,విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ కార్యకర్తలు రంగంలోకి దిగడం వల్ల అనేక వరస సంఘటనలు జరుగుతున్నాయి . వాటిలోకొన్ని:
1. గత అక్టోబర్ 29 న ఉత్తరప్రదేశ్ దాద్రి లోని బిస్రా గ్రామం లో ఆవు మాంసం తిని,ఇంట్లో నిలవ చేసాడనే వదంతులతో మహ్మద్ అఖ్లాక్ అనేవ్యక్తి ఇంటిమీద సుమారు 200 మంది దాడి చేసి ఇటుకలతో దారుణం గా కొట్టి చంపేరు.అతని 22 ఏళ్ల కొడుకునికూడా రాళ్ళతో కొట్టడం వల్ల తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.ఈ సంఘటన తో ఊళ్ళో ఉన్న 50 మంది ముస్లిం కుటుంబాల వారు భయం తో వణికి పోయారు..తమ ఇంట్లో ఫ్రిజ్ లో దాచింది ఆవుమాసం కాదని మటన్ అని అఖ్లాక్ కూతురు సాజిద తెలియజేయగా పోలీసులు ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకొని ఫోర్సెనిక్ పరీక్ష కు పంపగా అది బీఫ్ కాదని మటనేనని ఫోర్సెనిక్ పరీక్ష లో తేలింది.అయితే ఈ సంఘటన ముందునుండే ఆవులు మాయమవుతున్నాయనే ప్రచారం కొందరు మొదలు పెట్టేరు.అలాగే ఆవును చంపి దాని అవశేషాలను ట్రాన్స్ ఫారం దగ్గర పడేశారని వాట్స్ అప్ మెసేజ్ లు ద్వారా , స్థానిక గుడిలోని లౌడ్ స్పీకర్ ద్వారా ప్రచారం చేసారు. అందువల్ల ఇది ప్లాన్ ప్రకారం చేసినదేతప్ప యాదృచ్చిక సంఘటన కాదని తెలుస్తుంది.
దాద్రి ఘటనకు ముందే మే నెలలో, రాజస్తాన్ లోని బిర్లోకా గ్రామం లో 200 ఆవుల మృత కళేబరాలను మునిసిపాలిటీ వాళ్ళు అద్దెకు తీసుకొన్న ఒక పొలం లోకి చేర్చితే అబ్దుల్ గఫూర్ ఖురేషి అనే మాసం దుకాణం ముస్లిమే ఆ పని చేసాడని వాట్స్ అప్, పేస్ బుక్ లద్వారా పుకార్లు సృష్టించి అతడి దుకాణాన్ని ధ్వంశం చేసి, అతడిని కొట్టి చంపారు.
దాద్రి లో, మతం, ఆహారపు అలవాట్ల నెపం తో ఒక అమాయవ్యక్తిని నిర్దాక్షణ్యం గా కొట్టి చంపిన సంఘటనతో దేశం నివ్వెర పోయింది. మైనారిటీ ప్రజల మతమౌఢ్యం కంటే మెజారిటీ ప్రజల మతమౌఢ్యం ఎక్కువ ప్రమాదకరం. భారతదేశం లో కొందరి అభిప్రాయం ప్రకారం మెజారిటీ హిందువుల మనోభావాలను మైనారిటీలు గౌరవించాలి. కాని మైనారిటీల మనోభావాలను మెజారిటీ మతస్తులు గౌరవించక పోయినా పర్వాలేదు . దాద్రి ఘటనను పై చాలా కాలం ప్రధానమంత్రి మోది గారు వ్యూహాత్మక మౌనాన్ని పాటించి , బీహార్ ఎన్నికల సమయంలో మాత్రం ‘ఇది విచారించదగ్గ విషయమని, హిందువులు ముస్లింలు కలిసి పేదరికం మీద పోరాడాలని ‘ హితవుపలికారు.
2.పై సంఘటన తో స్పందిచి, బీఫ్ తినడం తమ ఆహార అలవాట్ల ఒకటని,బీఫ్ తినడం తప్పుగాదని కాశ్మీర్ ఇండిపెండెంట్ ఎం.ఎల్.ఏ షేక్ అబ్దుల్ రషీద్ కాశ్మీర్ లో బీఫ్ పార్టీని నిర్వహిస్తే , కాశ్మీర్ అసెంబ్లీ లో అసెంబ్లీ సాక్షి గా ఆ ఎం.ఎల్.ఎ మీద భా.జ.ప ఎమ్మెల్యే లు దాడి చేసి చిదకబాదేరు.ఆ పద్దతి లో భాజప ప్రజాస్వామ్య విలువలను కాపాడే భాద్యత భుజాన్న వేసుకోన్నది. డిల్లీ లో కేరళా హౌస్ వారు వడ్డించే భోజనం మెనూ లో ‘బీఫ్” కూడా ఉండడంతో డిల్లీ పోలీసులు దాడి చేస్తే ఇది రాజ్యాంగపు సమాఖ్య స్పూర్తికి విరుద్దమని కేరళా ముఖ్య మంత్రి ఖండించారు.
3. హర్యానా ,ఎస్సార్ లో ఒక దళితుని హత్యచేశారు. ఫరీదాబాద్ లో తగాదాల కారణం గా అగ్రవర్ణాలవారు ఒక దళితుని ఇంటికి నిప్పుపెట్టగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.ఆ సంఘటన పై కేంద్ర మంత్రి,,మాజీ సైన్యాధిపతి వి.కె. సింగ్ గారు ‘ఎవరైనా కుక్క మీద రాయి వేస్తె దానికి కేంద్ర ప్రభుత్వమే భాద్యత వహించాలా’ అని వ్యాఖ్యానించేరు. గోహనీ లో పోలీసు కస్టడీ లో 15 ఏళ్ల దళిత యువకుడు మరణింనించేడు , దళితుల మీద అత్యాచారాలు గతం లోనూజరిగాయి , ఇప్పుడూ దేశం లో రోజూ ఏదొక మూల జరుజగుతూనే ఉన్నాయి. కాకపోతే కాస్త పెరిగాయి.
4. గత సెప్టెంబర్ లో అభ్యుదయ రచయిత,కన్నడ మేధావి,సాహిత్య అకాడమి సభ్యుడు, పరిశోధకుడు అయిన ప్రోఫెసర్ ఎం.ఎం .కల్ బుర్గిని  ధర్వార్డ్ లో అతని ఇంటివద్ద గుర్తుతెలియని వ్యక్తులు పిస్టల్స్ తో కాల్చి చంపారు. ఈ హత్యతో దేశం లోని సాహిత్య అకాడమి అవార్డ్ పొందిన అనేక మంది కవులను, రచయితలు ‘ భావ ప్రకటనా స్వేచ్చ’ కు ప్రమాదం ఏర్పడిందని గగ్గోలు  పెడుతున్నారు.
5.ఆగష్టు లో హిందూ చాందసవాదానికి ,మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త, రచయిత, కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన గోవింద పనసారె ని,మహారాస్ట్ర ,కొల్హాపూర్ లో అతను భార్య తో కలిసి మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి కాల్చి చంపారు. అదేవిధం గా ఆగస్ట్ 20న పూనా లో మూఢనమ్మకాలకు వ్యతిరేకం ప్రచారం చేస్తున్న హేతువాది నరేంద్ర అచ్యుత్ డాభోల్కర్ హత్య చేయబడ్డారు. ఆ హత్యల విషయం లో ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు.
6.బొంబాయి దాడులకు కారకురాలు పాకిస్తాన్ , టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నందువల్ల , పాకిస్తాన్ మాజీ విదేశాంగ శాఖా మంత్రి కుర్శిద్ కసూరి వ్రాసిన పుస్తకాన్నిబొంబాయి లో మాజీ భారతరాయభారి సురేంద్ర కులకర్ణి ఆవిష్కరించడాన్ని చేయవద్దని శివసేన కార్యకర్తలు హెచ్చరించినా వినకపోవడం వల్ల సురేంద్ర కులకర్ణి ముఖానికి నల్లరంగు పూసారు.ముఖంమీదా,బట్టల మీదా నల్ల రంగుతోనే సురేంద్ర కులకర్ణి కసూరి తో కలిసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.అదేవిధం గా ప్రముఖ పాకిస్తానీ గజల్ గాయకుడు గులాం అలీ ని బొంబాయిలోచేయ తలపెట్టిన కచేరివల్ల అతని ప్రాణానికే ముప్పని హెచ్చరికలు రావడంతో ఆ కచ్చేరి రద్దయింది. పై చర్యలకు తామెంతో గర్విస్తున్నామని శివసేన పేర్కొన్నది.
7.విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు గుజరాత్ లో దావూడిబోహ్ర ముస్లింలను ఒకప్పుడు బ్రాహ్మణులే కాబట్టి వారిని తిరిగి ‘ఘర్ వాపసి’ ( స్వగృహానికి తిరిగి రావడం) పేరుతో పెద్ద ఎత్తున హిందూ మతమార్పిడి కార్యక్రమం చేపట్టారు..ఆస్కార్ అవార్డ్ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తల్లిదండ్రులు ఒకప్పుడు హిందువులే కావడంవల్ల వి.ఎచ్.పి, ఆయన్నికూడా ‘ఘర్ వాపసి’కి ఆహ్వానించింది..మరొక పక్క ముస్లిం మతపెద్దలు కొందరు, ఒక ఇరాన్ నిర్మాత మహ్మద్ ప్రవక్త మీద తీస్తున్న సినిమా వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటున్నాయని కాబట్టి ఏ.ఆర్.రెహమాన్ ఆ సినిమాకి సంగీతం అందించ వద్దని ‘ఫత్వా ‘ జారీ చేసారు. దానిపై “మసీదు మీద ఉన్న నమ్మకమే మ్యూజిక్ మీదకూడా ఉన్నదని “ఆయన బదలిచ్చేడు..
8.’ లవ్ జిహాది’ అంటే ముస్లిం అబ్బాయులు హిందూ అమ్మాయిల్ని ప్రేమించి పెళ్ళిచేసుకోవడం. .ఈ లవ్ జిహాది ని వ్యతిరేకిస్తూ హిందత్వ వాదులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు.ఎవరైనా హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని ప్రేమించి పెళ్లాడితే ఆ దంపతులకి నరకం చూపిస్తున్నారు.గత ఏడాది మీరట్ లోఒక అగ్రకుల అమ్మాయి , కలీం అనే ముస్లిం యువకుడిని ప్రేమించి అతడి ఇంటికి వెళితే అతడిపై రేప్ కేసు బనాయించి జైల్లో పెట్టించారు. కోర్టులో ఆ అమ్మాయి”తాను 22 ఏళ్ల మేజర్ని అని, అతడిని ప్రేమించి,అతడి ఇంటికి ఇష్టపూర్వకంగానే వెళ్లానని “ చెప్పింది..ఎట్టికేలకు సంవత్సరంన్నర తర్వాత అతనికి బెయిల్ దొరికింది.
ప్రేమ గుడ్డిదంటారు. ప్రేమకు కుల,మత,ప్రాంతీయ,భాషా భేదాలు అడ్డురావు.ఒకప్పుడు హిందూ మతం లో ఒక కులం వారు వేరొక కులం వాళ్ళను పెళ్ళాడం నిషిద్దం. అట్టి కులాంతర వివాహం చేసుకొన్న వాళ్లను సమాజం బహిష్కరించేది.. ప్రస్తుతం కులవ్యవస్థ యొక్క వేళ్ళు ఇంకా బలంగా పాతుకుపోతున్నా , కులాంతర వివాహాల పట్ల మాత్రం హిందూమతం కాస్త చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నది .
నాటి సినినటి షర్మిలా టాగూర్ మాజీ భాతర క్రికెట్ కెప్టెన్ పటౌడి నవాబ్ ని పెళ్లి చేసుకొన్నప్పుడు ‘లవ్ జిహాద్ వ్యతిరేక ‘ తలెత్తలేదు.కాని వాళ్ళ కొడుకు , నటుడు సైఫీ ఆలీఖాన్ – నటి కరీనా కపూర్ లు జంటై నపుడు కరీనా కపూర్ కు ఆ సమస్య ఎదురైంది. ప్రేమ అనేది ఇద్దరి మనస్సులకు సంబందించినదని, ప్రేమ  కు కులం,మతం,వృత్తుల తో సంబంధం లేదని ‘లవ్ జిహాద్ సిద్దాంతం ’ పట్ల తనకు నమ్మకం లేదని కరీనా కపూర్ తెలియజేసింది.
9.2014 లో బొంబాయి లో. ప్రధాని మోది గారి ఉపన్యాసం తో ప్రారంభమయిన 102 వ ‘జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో ‘ప్రాచీన కాలంలోనే భారతీయులు జెట్ విమానాలూ వాడారని ,గ్రహాంతర యానాలు చేసారని (రావణాసురుడు,యక్షులు,గంధర్వులూ విమానాలు వాడేరట), ఏనుగు తల తీసి మనుషుల మెండానికి అతికించేటువంటి ‘అడ్వాన్సుడు సర్జికల్ టెక్నాలజీ’ ప్రాచీన కాలంలోనే ఉండేదని కొంత మంది సంస్కృత పండితులు పరిశోధనా పత్రాలు సమర్పించే సరికి వాటిని విన్న మరికొందరు శాస్త్రవేత్తలు అక్కడే కళ్ళు తిరిగి పడిపోయి,తేరుకొని సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు పూర్తి కాకుండానే తట్టా,బుట్టా సర్దుకొని పారిపోయారు.
10. భాజపా ప్రభుత్వం అధికారలో వచ్చిన తర్వాత కొత్తగా ‘నేషనల్ హిస్టరీ కాంగ్రెస్ ‘లో నియమించబడిన సభ్యలు ,చరిత్ర కి వాస్తవాలు ఆధారం కాకుండా, చరిత్రలోని కొంతమంది వ్యక్తులను ఆకాశానికి ఎత్తుతూ ,’పుక్కిట పురాణాల కల్పనల’ ఆధారంగా చరిత్రకు కాషాయిరంగు పూసి కొత్త భాష్యాలు చెప్పుతుండడం తో ప్రఖ్యాత చరిత్రకారులకి మింగుడు పడక జుత్తుపీక్కొంటున్నారు.
11. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మాజీ మైసూర్ పాలకుడు టిప్పుసుల్తాన్ జయంతి ని కర్నాటక ప్రభుత్వం నిర్వహించకూడదు.టిప్పుసుల్తాన్ జయంతి కార్యక్రమం లో పాల్గొని టిప్పుసుల్తాన్ న్ని పొగిడిన జనపద్ అవార్డ్ గ్రహీత, ప్రముఖనటుడు,రచయత అయిన గిరీష్ కర్నాడ్ నిప్పుతో చెలగాటమాడుతూ, తన ప్రాణానికి ముప్పుని కొని తెచ్చుకొంటున్నాడు.. అదేసందర్బంలో జాతిపిత గాంధీజీ హత్య చేసినందుకు ఉరికంభం ఎక్కిన దేశభక్తుడు గాడ్సే యెక్క 66 వర్ధంతిని జరిపి ‘బలిదాన్ దివస్’ పేరుతో హిందూమహాసభ, గాడ్సే జీవిత వివరాలతో వెబ్ సైట్ ను ప్రారంబించి ,ఆయనకు గుడి కట్టే ప్రయత్నం చేయడం సంతోషకర విషయం.
12.ఆర్.ఎస్.ఎస్. నేత మోహన్ భగవత్ గారి వెల్లడించిన అభిప్రాయం ప్రకారం వివాహం అనేది స్త్రీ,పురుషుల మధ్య ఒక ఒప్పదం .అ వడంబడిక ప్రకారం స్ర్తీ గృహిణిగానే తన విదులు నెరవేర్చాలి తప్ప బయట ఉద్యోగాలు చేయకూడదు. భగవత్ గారి సూచన మేరకు స్త్రీలు వంట ఇంటి కుందేళ్ళు గా ఉండడం శ్రేయస్కరం. భగవత్ గారు  ఎస్.సి.,బి.సి కు కల్పిస్తున్న రిజర్వేషన్ల విధానాన్నికూడా సమీక్షించాలని కోరారు.
13.ఆమధ్య ముస్లింలు గొడ్డు మాంసం తినడం మానేస్తేనే ఈ దేశం లో ఉండొచ్చని హర్హానా ముఖ్యమంత్రి ఖట్టర్ గారు సెలవిస్తే, తాజాగా అస్సాం గవర్నర్ పి.బి.ఆచార్య గారు’ హిందుస్తాన్ హిడువులకేనని’ కావలిస్తే ఈదేశం లో నివశించే ముస్లింలు పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ వెళ్లి పోవచ్చునని సెలవిచ్చారు.
అసహనం పట్ల నిరసనగా అవార్డుల వాఅపసు
భాజప అధికారం లోకి వచ్చిన తర్వాత మైనారిటీలు, హేతువాదులు, రచయతల పై జరుగుతున్న వరస హత్యలు లక్షలాది ప్రజలను భయభ్రాంతులు చేయడం తో పాటు రచయతలు,చరిత్ర కారులు, కళాకారులు, శాస్త్రవేత్తలు ,ఇతర ప్రజాస్వామ్య వాదులను కలవర పెట్టడంతో వారు….భారత దేశం లో భిన్నాభిప్రాయాలపట్ల, భిన్నమతాలపట్ల, భిన్నసంస్కృతులుపట్ల’ అసహనం ‘ పెరిగిందని ,మైనారిటీలలో అభద్రతాభావం పెరిగిందని,మెజారిటీ నమ్మకాలను గాని, వారు ఆచరించే పద్దతులను మైనారిటీల పై రుద్దడం అనైతికమని, భారతదేశాన్ని కూడా పాకిస్తాన్ లాగ మతనియంత్రుత్వ దేశం మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశం లో లౌకిక వాదం, సహనశీలతా, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించడానికి ప్రభుత్వం సరియైన చర్యలు చేపట్టడం లేదని, ఏం తినాలో, ఏం ఆలోచించాలో,ఏం చదవాలో, ఏం వ్రాయాలో ప్రభుత్వాలు నిర్దేశించగూడదని ఆరోపిస్తూ . … అందుకు నిరసన గా తమకు ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలను తిరిగి ఇచ్చివేయడం మొదలు పెట్టారు. ఈ అవార్డుల వాపసు పర్వం ఇంకా కొనసాగుతున్నది. ఆహింసా పద్దతులలో తమ ఆవేదన తెలిపే హక్కు మౌలిక మైనదని ,అందుకు విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ జలియన్ వాలాభాగ్ దురంతానికి కి నిరసనగా బ్రిటిష్ వారు తనకిచ్చిన’ నైట్ హూడ్’ బిరుదును తిరిగి ఇచ్చివేసిన ఉదాహరణను వారు పేర్కొంటున్నారు. వారు చెప్పే అంశాలు:
1 భారత దేశంలో అనాదిగా భిన్న జాతులు,మతాలూ,కులాలు,తెగలు,భాష, ఆచారాలు,నమ్మకాలు,సంస్కృతి ,రాజకీయతత్వాల, భావాల్లో భిన్నత్వం కనిపిస్తుంది,భిన్నత్వం ఉన్నప్పటికీ ఒకేవిధమైన జీవనవిధానం,ఒకే రకమైన జాతీయవారసత్వం ,నైతిక,మానసిక లక్షణాలు కలిగి ఉండడం వల్ల తామందరూ ఒకే జాతి గా భావించు కొంటున్నారు..అదే భిన్నత్వం లో ఏకత్వం. అదే భారత దేశ సౌందర్యం .
2.భారతీయ తాత్విక చింతనలో,జీవన విధానంలో ఐక్యతాభావం ప్రాతిపదికగా కనిపిస్తుంది.దేనినే మన రాజ్యంగ పీఠిక నొక్కి చెపుతుంది. భారతీయ పౌరులందరికీ సమాన సాంఘిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాన్ని,వాక్ స్వాతంత్రం, మత స్వేచ్చను,అంతస్తుల్లో అవకాశాలలో సమానత్వాన్ని సాధించదానికి ,వ్యక్తీ గౌరవాన్ని జాతి ఐక్యతను కాపాడుతూ ప్రజలలో సోదరభావాన్ని భావాన్ని పెంపోందించడానికి కృషి చేస్తామని రాజ్యాంగం పేర్కొంటున్నది.
3. భారతదేశం ప్రజాస్వామ్య ,లౌకిక దేశం. ప్రజాస్వాయం లో ప్రతి పౌరుడికి తన భావాలను వెళ్ళడించే స్వేచ్చ ఉంటుంది.అదే సందర్బంగా పౌరులుగా వారందరికీ సమాన గౌరవం కూడా ఉంటుంది.ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రశ్నించే మనస్తత్వాన్ని ,హేతువాద వైఖరినీ, శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందింప చేయడంతోపాటు ఆర్దికాభివృద్దిని సాధించేందుకు దోహదపడుతుంది.పేదరికం,సామాజిక ఆర్దిక అసమానతల ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.అందువలనే మనజాతి నిర్మాతలు దూరదృష్టి తో ఈ అంశాన్ని భారత రాజ్యాంగం లో పొందుపరిచారు.
4.శాంతి, సహనం, వాద-సంవాదాల వంటివన్నీ భారతీయుల సొత్తు.అశోకుడు ,అక్బర్ వంటి చక్రవర్తుల ప్రతి విషయాన్ని బహిరంగం గా ప్రజల మద్య చర్చించి ప్రజాభిప్రాయాలకు అనుగుణం గా నిర్ణయాలు తీసుకొనేవారు. భారతీయ వారసత్వంలో చర్చలు,బ్భిన్నభిప్రాయాలూ,సంశాయాల నివృత్తి , వాదోపవాదాలూ ద్వారానే వాస్తవాలను నిగ్గుతెల్చేవారు.
ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామమోహన రాయ్ ఒక సందర్బం లో మరణాన్ని గురిచి వాస్తవంగా ఎందుకు భయంకరమైనదిగా భావిస్తామంటే “మీరు మరణించిన రోజు ఎంత భయకరమైనదో ఆలోచిం చండి. ఇతరులు మాట్లాడూతూ ఉంటే వారితో తిరిగి  వాదించే అవకాశం మీకు ఉండదు కదా “ అని పేర్కొన్నారు ( 1).
అవార్డుల వాపసు పై ఎదురు దాడి
పై సంఘటనలను హోమ్ మినిస్టర్ రాజ్ నాద్ సింగ్ ఇవన్నీ చెదరుముదురు గా జరిగే ప్రాముఖ్యత లేని చిన్న సంఘటనలని ,వాటి శాంతి భద్రతల సమస్యలను ఆయా రాష్ట్రాలే చూసుకోవాలని కొట్టిపారేశారు. వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు గారు ,మోది నాయకత్వం లో భాజప అధికారం లోకి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ,కొన్ని పతిపక్ష పార్టీలు, కొంతమంది వ్యక్తులూ జీర్నించుకో లేకపోతున్నారని, వాళ్ళే ప్రజాతీర్పు పై ‘ అసహనం’ తో ప్రవర్తిసున్నారని, అవార్డులు వాపసు ఇస్తున్నవారంతా కుహనా లౌకిక వాదులూ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల తొత్తులని , వారు దేశ ప్రతిష్టను మంట గలుపుతున్నారని, మైనారిటీలపట్ల కాంగ్రెస్ పార్టీ భాగోతం ఎవకి తెలియదని వారిపై మండిపడుతున్నారు.
ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ‘గుజరాత్ అల్లర్ల (2002) జరిగిననాటి నుండి , సైద్ధాంతిక అసహనానికి బలి అవుతున్న మొదతటి వ్యక్తి మోదిగారే నని , ప్రతిపక్షాలవారు వండి వార్చిన ‘అసహనపు కధలన్నీ ’ కుత్రిమమైనవని, మోదీ గారి ‘అభివృద్ధి మంత్రాన్ని’ చూసి వ్యతిరేకులు అసహనాకి గురుఅవుతున్నారని, ప్రస్తుతం “అసహనం’ గురించి మాట్లాడే మేధావులు గతంలో వారు పెత్తనం చెలాయించే విధ్యా సంస్థలు,విశ్వవిధ్యాలయాలూ,సాంస్కృతిక సంస్థలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకుండా ‘అసహనం’ చూపేవారని చెపుతున్నారు. జైట్లీ గారి వ్యాఖ్యల మీద కొందరు ,సామాన్యుడి కంటే మేధావులు భిన్నం గా ఆలోచిస్తారని, వారి అందోళనని తేలిగ్గా కొట్టి పారేయడం సరికాదంటున్నారు.
కాని ప్రస్తుత ‘అసహన’ ఆందోళన లో పాల్గోనే వారిలో 95% మందికి ఎటువంటి రాజకీయ రంగు లేనివారేనని , ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ,ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్,జూబిన్ మెహతా ,నటు డు షారుక్ ఖాన్ మొదలగు వారంతా రాజకీయాలతో సంభందం లేనివారే . బలీహుడ్ సృజనాత్మక నటుడు అమీర్ ఖాన్ తన భార్య ” దేశం లో పెరుగుతున్న అసహనం నేపద్యం లో వేరే దేశానికి వెళ్లి పొతే ఎలా ఉంటుంది” అని అన్నదని ఒక ఇంటర్వ్యూ వెల్లడిస్తే ,అనుపమ ఖేర్ లాంటి ‘అసహన వాదులు’ ఆయన పై విరుచకు పడుతున్నారు.అమీర్ ఖాన్ చెంప చెళ్ళు మనిపించినవాడికి ,ఒక్కొక్క చెంపదెబ్బ కు లక్ష రూపాయల బహుమతి ప్రకటించింది శివసేన. అమీర్ ఖాన్ చెప్పిన విషయం లో తప్పేమున్నదని ,మమత బెనర్జీ, అరవింద కేజ్రివాల్ మొII వారు మరొక పక్క ఆయన్ని సమర్దిస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం
కేంద్ర ప్రభుత్వం లో భాగం గా ఉన్న కొన్ని సంస్థలు,వ్యక్తులు భారతీయ మిశ్రమ సంస్కృతి మీద,మౌలిక విలవల మేద దాడి చేస్తున్నాయని, దాంట్లో భాగం గానే అసహనాన్ని రెచ్చ కొడుతున్నాయని ,గొంతు చించుకొంటూ రాష్ట్రపతి భవన్ కి ఊరేగింపులు తీసే కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర అంత గొప్పగా ఏమీ లేదు.
1.1984 లో పంజాబ్ లో శిక్కు వేర్పాటువాదులు స్వర్ణదేవాలయాన్ని తమ స్తావరం గా మార్చడం తో నాటి ప్రధాని ఇందిరాగాంధి ‘ఆపరేషన్ బ్లూస్టార్’ నిర్వహించగా, అనంతం ఆమె భద్రతా సిబ్బంది లో నున్న ఇద్దరు శిక్కులు ఆమెను కాల్చి చంపారు.ఆఘటన తో , కొందరు కాంగ్రెస్ నేతల ప్రేరేపించడం తో డిల్లీ లో శి క్కుల పై జరిగిన దమనకాండలో,వాళ్ళ ఆస్తుల ద్వంశం తో పాటు 1300 మంది సిక్కులు చనిపోయారు.
2.ఐదుగురు పిల్లల తల్లి, 62 ఏళ్ల వయసున్న ముస్లిం మహిళ షా భానోకు , ఆమె భర్త ‘తలాక్’ చెప్పి విడాకులు ఇచ్చినపుడు, పిల్లల పోషణ నిమిత్తం భరణం కోరుతూ కేసు వేస్తే , సుప్రీం కోర్టు ఆమెకు జీవితాంతం ఆమె భర్త భరణం ఇవ్వాలని తీర్పు చెప్పింది., భరణం 90 రోజులు ఇస్తే చాలని,ఆ తీర్పు ముస్లిం మత చట్టాలకు విరుద్దమని ముస్లిం మత పెద్దలు వ్యతిరేకించారు.ఓటు బేంక్ రాజకీయాల కోసం ముస్లింలను సంతృప్తి పరుస్తూ నాటి ప్రధాని రాజేవ్ గాంధి పార్లమెంట్లో “మహిళల హక్కులు,ముస్లిం విడాకుల చట్టం -1986” పేరుతో ఒక చట్టాన్ని ఆమోదింపచేసారు. సుప్రేం కోర్టు తీర్పును నీరుకారుస్తూ,పై చట్టం, భరణం జీవితాంతం ఇవ్వనక్కరలేదని, వ్యక్తిగత ముస్లిమత చట్టం ప్రకారం 90 రోజులు ఇస్తే చాలని చెపుతుంది. షా భానో కేసు పై దేశం లో పెద్ద దుమారం లేచింది.
3. బిజేపి, ఆరెస్సెస్ వారు అయోధ్యలో బాబ్రి మసీదు కూలగొడుతుంటే , రొమ్ నగరం తగల బడిపోతుంటే రోమన్ చక్రవర్తి ఫిడేలు వాయించు కొన్నట్టు అదేసమయం లో నాటి ప్రధాని పి.వి. నరసింహారావు గారు పూజా మందిరం లో పూజ చేసుకొంటూ గడిపారట.
4. ప్రఖాత నవలా రచయత సాల్మన్ రషీద్ వ్రాసిన ‘డి సెటానిక్ వెర్సెస్ ‘ నవల ముస్లిం మతనమ్మకాలకు వ్యతిరేకమని, లండన్ లో నివసిస్తున్న అతనిని చంపమని ఇరాన్ ముస్లిం నేత, అయోతుల్లా ఖుమేని ఫత్వా జాచేస్తే అతని మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగేయి.ఇక్కడ ముస్లింలను బుజ్జగించడానికి రాజీవ్ గాంధి హయాము లో కాంగ్రెస్ ప్రభుత్వం మన దేశం లో కూడా ఆపుస్తకాన్ని నిషేదించింది. అదేవిదం గా బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ తాను రాసిన ‘లజ్జ’ నవల ముస్లిం లకు వ్యతిరకమని ఆ దేశం నుండి వెళ్ళ గొట్టాగా, ఆమె మనదేశం లో ఉండగా ఒక కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చినపుడు , మజ్లిస్ పార్టీ ఎం.ఎల్.ఏ ఖాద్రి ఆమెపై దాడి చేస్తే ,అతనిపై తీసుకొన్న చర్యలేమీలేవు.ముస్లిం చాందస వాదుల నుండి భయం వల్ల ఆమెకు మన దేశం ఆశ్రయం కల్పించలేమని చేతులెత్తేస్తే అమెరికా లో తల దాచుకొంటున్నది.
5. ఒక ప్రక్క సెక్యులర్ పార్టీ నని చెప్పుకొంటూ, కేరళ వంటి రాష్ట్రాలలో మత పార్టీలతో అంటకాగుతూ ,మైనారిటీల ఓట్ల కోసం పిల్లిమొగ్గలు వేస్తూ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీది కుహనా లౌకిక వాదమని వెంకయ్యనాయుడు గారు ఎద్దేవా చేస్తున్నారు.
పురాణాలలో ఆసహన కధలు
శాంతి,సహనం, సామరస్యం మొదలైనవన్నీ ప్రాచీనకాలం నుండీ వస్తున్న మన సాంప్రదాయాలని చేపున్నప్పటికి ,పురాణాలలో ‘అసహన’ కధలు కూడా కొన్ని కనబడుతున్నాయి.
మహాభారతం శాంతి పర్వం లో చార్వాకుని కధ : భారత యుద్ధం అంతా అయిపొయింది.పాండవులు గెలిచారు.ధర్మరాజు రాజలాంచనాలతో హస్తినాపురంలో ప్రవేశిస్తున్నాడు. యుద్ధం లో కౌరవులూ, పాండవులూ ఇద్దరూ సమానం గానే మోసాలు చేసారు.ఒకరు ఎక్కువ,మరొకరు తక్కువ లేదని ప్రజానీకం లో ఒక భాగం అనుకోసాగింది. అయితే బహిరంగంగా ధర్మరాజును ఎదిరించే సాహసం ఎవ్వరికీ లేదు.ఈ అసంతృప్తిని ఒక చార్వాక సన్యాసి అవకాశం గా తీసుకొని , ఊరేగింపుకు ఎదురుగాపోయి “ నీ పేరు ధర్మరాజు. ఏం రాజువయ్యా నువ్వు.నువ్వు పాపాల బైరవుడివి. నువ్వు చేసిందంతా అధర్మం. తండ్రినీ, అన్నదమ్ములనూ, గురువులనీ శంకాగింకా లేకుండా చంపేశారు’ అని బహిరంగంగా విమర్శించాడు.సిగ్గుతో ధర్మరాజు తల వంచుకొన్నాడు.ఈ మాటలకు బ్రాహ్మణులంతా నొచ్చుకొన్నారు. భయం తో తడబడి పోయారు.చార్వాక సన్యాసిని చూసి నిప్పులు కక్కారు. రాజభటులు ఆ వ్యక్తిని బంధించారు.ఇతడు ఒక రాక్షసుడు.కనుక చంపదగినవాడు. అని పురోహితులూ , మంత్రులూ తీర్పు చెప్పి అతడిని వధింఛారు. ప్రజలు నివ్వెరపోయారు. ఊరేగింపు ముందుకు సాగింది.
విష్ణు పురాణం లో వేనరాజు కధ : ఒకప్పుడు ఈ భూమండలానికి ‘ వేనుడు’ రాజుగా ఉండేవాడు. అతడికి వేదాలమీద నమ్మకం లేదు. బ్రాహ్మణులు, ఋషులూ యజ్ఞ, యాగాదులు నిర్వహించడానికి అంగీకరించడం లేదు. దేవతల పేరిట ఎటువంటి బలులనూ ఒప్పుకోలేదు..వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించ లేదు. భూలోక దేవతలైన భ్రాహ్మణులను గౌరవించ లేదు.మహా విష్ణుకు బదులు తననే పూజించని చెప్పేడు. అందువల్ల బ్రాహ్మణులంతా కలిసి మాకుమ్మడి గా (దాద్రి లో అఖ్లాక్ ను చంపినట్టుగా ) అతడిని చంపేరు.. కాని తర్వాత రాజు లేక పోవడం వల్ల అరాచకం ప్రభలింది.భ్రా హ్మణులకూ,మునులకూ రక్షణ కరువయింది. మళ్ళీ వేనుడు వారసుడైన ప్రిథుని రాజుగా చేసారు.(2). దీనినిబట్టి ‘అసహనం’ తో ఎదుట వాడి నోరు శాశ్వతం గా మూయించే పద్దతి ప్రాచీనమైనదే అని తెలుస్తున్నది.

గోమాత పవిత్రత

Kamadhenu.jpg
హిందూమతం లో మనుషులలో పవిత్రులు బ్రాహ్మణులు.వారు బ్రహ్మ ముఖం నుంచి జన్మించారు.వేదాలనూ,ఉపనిషత్తులనూ ఆపోశన పట్టి యజ్ఞ యాగాదులు చేయిచి దేవతను తృప్తి పరుస్తూ, భూలోకం లో రాజులకు ధర్మార్ద,కామ మొక్షాలను ఆయా కాలాలలోఎలా నివర్తించాలో తెలిపే భూలోక దేవుళ్ళు.
జంతువులలో పవిత్రమైనది ఆవు.ఎక్కువ సత్వ గణం కలది. ఆవును పూజించే ఆచారం సనాతనమైనది. గోమాత జననాన్నిగురిచి చాలా కధలున్నాయి అందులో మొదటది , దక్షప్రజాప్రతి ప్రాణి సృష్టి చేసిన తర్వాత కొంచం అమృతం త్రాగాడు.ఆతర్వాత అతని శ్వాశ ద్వారా సుగంధం వెలువడి అంతటా వ్యాపించింది.ఆశ్వ్వాస నుండి ఒక ఆవు జన్మించింది.సుగంధం ద్వారా జన్మించినందువల్ల దానికి సురభి అనే పేరు పెట్టారు.సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి.సురభిని గోవంశ మాతగా పరిగణిస్తారు.
రెండవది కామధేనువు కధ. కామదేనువునే సురభి అనిపిలుస్తారని తెలుస్తున్నది.కోరుకొన్న వరాలు ఇచ్చేది కామధేనువు.దేవతలు,రాక్షసులూ క్షీర సాగర మధనం లో పుట్టిన వాటిలో కామదేనువొకటి. ఇది సాధారణం గా వశిష్ట లేక జమదగ్ని మునుల ఆధీనం లో ఉంటుంది .దీనిని ఎత్తుకు పోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అనేకమంది అదృశ్య వీరులను సృష్టించి వారిని ఓడించేది. ఇది ఒకప్పుడు జమదగ్ని ఆశ్రమం లో నుండగా దాని దూడను కార్తవ్యవీరాజ్ఞుదు ఎత్తుకు పొతే జమదగ్ని కుమారుడు పరుశురాముడు 21 సార్లు క్షత్రియ వంశాలను నాసనం చేసాడు.
ఆవును పూజించడం వల్ల సకల సంపదలూ కలుగుతాయట . అగ్న్యపమాన సందర్భం లో ఒక మంత్రం ఇలా చెపుతున్నది.” ఓ ఆవులారా , పాలు,పెరుగు మొదలగు ఆహారాన్ని ఇస్తున్నారు.కాబట్టి మీరు అన్న స్వరూపులు.మీ అనుగ్రహం వల్ల మేము ఆహారాన్ని పొందుతాము.మీలో పది వీర్యాలున్నాయి.మీ సేవ మమ్మల్ని వీర్యవంతులను చేస్తుంది.మీరు బల రూపులు. మీ అనుగ్రహం వల్ల మేమూ బలరూపులవుతాము .మీ పాలు, వెయ్య మొదలగు వాటి ద్వారా ధన, ధాన్యాలు పొందుతాము.”
ఆవు సర్వదేవతలకూ ప్రతి రూపం : ఆవు నుంచి వెలువడే పాలు,పెరుగు, నెయ్య ఉచ్చ, పేడ లను పంచాగవ్యా లంటారు.ఆవు మూత్రం లో వానదేవుడు,పేడలో అగ్నిదేవుడూ,నేయ్య లో సూర్య భగ వానుడూ, పెరుగులో వాయు దేవుడూ పాలలో చంద్రుడూ ఉంటారట.ఈ పంచగవ్యాలలో పాలు,పెరుగు ,నెయ్యల యెక్క విశిష్టతను గురించి పెర్కొనాల్సిన పనిలేదు, వీటన్నింటిలోలోనూ ప్రాచీనులకు నెయ్య ముఖ్యమైనది. దేవతార్చనలూ, హోమాలూ నెయ్య ప్రధానమైన ఇంధనం..ఆయుర్వేద వైద్యంలో కూడా నెయ్య కు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పేడ హోమాల లో వాడే పిడకలకీ, వ్యవసాయ ఎరువుగానూ, ఇల్లు అలికి, కళ్ళాపి జల్లే ‘యాంటీ బాక్టీరియరల్ ’ పేస్టు గాను ఉపయోగపడుతున్నది.ఆవు మూత్రం లో గూడా చాలా ఔషద గుణాలు ఉన్నాయని రోజూ ఓ “పురిషెడు” పుచ్చుకొంటే సర్వ రోగాలూ మటుమాయ మవుతాయని ఆయుర్వేద వైద్యులు చెపుత్నారు, కాని అది అంతగా వాడుకలో ఉన్నట్టు లేదు. ఆవు ‘ముక్కోటి’ దేవతలు ప్రతిరూపం.అందువల్ల ఆవును పూజిస్తే అందరు దేవుళ్ళనూ పూజించి నట్టే నట.
విష్ణుమూర్తికి గోవులంటే ఇష్టం.అందుకే అతడిని గోవిందుడని, గోపాలుడని పిలుస్తారు..కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసే ముందు ఆవును ప్రవేశపెట్టి, ఉచ్చ,పేడ వేయిస్తే సకల దోషాలూ పోతాయిట. ఆవుని రోజూ భక్తి తో పూజించేవారు ముక్తిని సంపాదిస్తారు. ఇలా ఆవు పవిత్ర గురించి చాలా ఉదాహరణ లున్నాయి.కాని ఇటువంటి ఆవుకు గుడి కట్టి పూజించడానికి నోచుకోలేదు.వానరమైన అంజనేయుడికీ, కీటకమైన నాగేంద్రుడికీ, కాశీ లో కుక్కకీ (భైరవస్వామి) గుడులున్నాయి.జంతు శిరస్సుతో ఉండే వినాయకుడికీ, నరసింహస్వామి కీ గుడులు కోకొల్లలు.ముక్కోటి దేవతలకూ ప్రతిరూపం గా చెప్పబడే ఆవు కెందుకు గుడి కట్టలేదు ? బహుశా ఆవుదగ్గర కెళ్లి బొట్టు పెట్టి పూజించనా ప్రమాదం రాదు గాబట్టి.
డబ్బు వేదకాలం లో చెలామణీలో లేకపోవడం వల్లనేమో ,గోసంపదను ప్రధానమైన సంపదగాను, మారకపు వస్తువు గాను మన ప్రాచీనులు అనేక సందర్భాలలో పేర్కొన్నారు .” ఏ జగత్తులో గోసంపద తో సమానమైన సంపద చూడ లేమని ” చవ్యనమహర్షి ,నహుషుని తో చెప్పేడు.
“ ప్రాచీన కాలమున ఆర్యులకు గోవులే ప్రధాన ధనము.వారు పశుధనులు అని చెప్పవచ్చును.దక్షిణలు,అరణములు,కానుకలు వారు గోరూపమున ఇచ్చేవారు.గోవు వారికి ప్రత్యక్ష దైవము. వారు గోరక్షణ యందు చూపిన శ్రద్ధయు,గోవుల యెడ చూపుచుండిన భక్తియు అపారము.ఋగ్వేదమందలి గోవులను వర్ణించు ఋక్కులను పఠించినచొ వారు గోధనమును సం పాదించుట యందు చూపిన ఆదరాభిమానములు తేట తెల్ల మగును “(4).
ఆవులకూ బ్రాహ్మణులకూ అవినాభావ సంభందం
మన పురాణాలలో వాళ్ళ స్వార్ధం కోసం నోరున్న భ్రాహ్మణుడికీ నోరులేని ఆవుకి అవినాభావన సంభందం కల్పించేరు.ఆవుల దానాలూ,దక్షిణ లూ పుచుచుకొని ఆర్దికంగా లాభపడేది వీరే కాబట్టి చాలా కట్టు కధలల్లేరు. పంచ మహాపాతకాలలో , గోహత్య, భ్రహ్మ హత్య చేస్తే చాలా పాపం తగులుతుందట. పూజలు, పురస్కారాలూ చివరను చదివే ప్రవచన మొకటి ఇలా చెపుతున్నది
“ స్వస్తి ప్రజా భ్యః పరిపాల యన్తామ్
న్యాయేన మార్ణేణ మహీం మహిషాం
గోబ్రాహ్మణే భ్యః శుభమస్తు నిత్యం
లోకాం సమస్తాం సుఖినోభవన్తు “
అంటే – “ ప్రజలందరికీ క్షేమ ముగు గాక .పరిపాలించే రాజులు న్యాయ సమ్మతమైన మార్గం చేత భూమండలాన్ని పాలింతురు గాక. గోవులకూ , భ్రాహ్మణులకూ నిత్యం శుభం కలుగు గాక. లోకం లో సమస్తమూ సుఖంగా ఉండుగాక.”(5). ఇదీ వీళ్ళ వరస.
దానం సంగతికొస్తే, షోడశ దానాల్లో గోదాన మొకటి. ఒక ఆవుని దానం చేస్తే వెయ్య ఆవులు దానం చేసిన ‘ పుణ్యం’ వస్తుందట. యజ్ఞ యాగాదుల తర్వాత వాటిని చేయించిన బ్రాహ్మణులు దక్షిణలూ, దానాల రూపం లో భారీ గా వడకి రాజులను దరిద్రులుగా చేసేవారు. దక్షిణ గా ఒక రాజసూయ యాగం లో రాజు దగ్గర దానంగా 2,40,000 ఆవులను తీసుకొన్నట్టు ఆర్.ఎస్. శర్మ గారు తన ప్రచీన భారత దేశ చరిత్ర లో తెలియ జేస్తున్నారు. దానం ఇచ్చనవాడికి ఎంత పుణ్యం జమ అవుతుందో తెలియదు గాని పుచ్చు కొ న్నవాడికి పుష్కలం గా ‘పురుషార్ధం ‘ లభిస్తుంది.ఈ పురుషార్ధం ఒకప్పుడు ఒక వర్ణం వారికే దక్కేది. కాని ఈమధ్య ఇది పంపిణీ జరగడం గమనించేను.
నా మిత్రుడొకరు తనతండ్రి గారు పోయారని ,ఆయనకు సద్గతి కలిగించడం కోసం ఆయన పెద్ద కర్మ ఘనంగా విర్వర్తిం చాలను కొంటున్నానని ,అందువల్ల ఆ కర్మకాండ చేసే వ్యక్తిని కుదర్చ మని కోరాడు.పెళ్ళిళ్ళు చేవారు వేరు ,కర్మకాండలు చేసేవారు వేరు. నేనొక ఆసామీ ఫోన్ నంబర్ ఇచ్చి అతని తో మాట్లాడమన్నాను. కాని నేను సూచించిన వ్యక్తీ తో గాక మరోకాయన తో ఆ తంతు పూర్తి చేసాడు. నేను సూచించిన వ్యక్తితో ఎందుకు కర్మ చేయించలేదని మా మిత్రుడిని అడిగాను.నేను సూచించిన వ్యక్తి కర్మకాండ’ పేకేజీ’ రు. 45 వేలు చెప్పాడని అందులో ఆవు,దూడలను కొనడానికే 25 వేలు కర్చవుతుం డన్నా డని ,వేరొక వ్యక్తీ 25 వేల పెకేజీ కే ఒప్పుకొన్నాడని చెప్పాడు.అదెలా సాధ్య మయిందంటే , ఆవ్యక్తి తో ఒప్పదం ప్రకారం ఒక రైతు ఆవు,దూడలను నా స్నేహితుడికి నామ మాత్రపు రేటుకే అమ్మాడు..దాన కార్యక్రమం పూర్తయిన తర్వాత ,దానం పుచ్చుకొన్నవాడి ద్వారా ఆవు,దూడలు మళ్ళి రైతు కే చేరాయి.ఈ విధంగా ‘పురుషార్ధం’ లో కొంతమేర పంపకం జరుగుతున్నది !.
చరిత్ర లో జంతుబలులు –గోమాంసం
ఆర్యులు క్రీ..పూ.1500 ముందే భారదేశం లోకి ప్రవేశించారు.వీరు ప్రధానం గా పశువుల కాపరులు. పాలు పెరుగులతో పాటు ఆహారం కోసం పశువులనుపయోగించే వారు. వీరు చేసిన యుద్దాలన్నీ పశువుల కోసమే. ఆ కాలంలోనే వీరు వ్రాసిన ఋగ్వేద మంత్రాలను పఠిస్తూ యజ్ఞాది క్రతువులను నిర్వహిస్తూ, ఆనాటి దేవతలైన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సోముడు మొదలగు వారిని పూజించి యజ్ఞ ఫలం గా సంతానాన్ని, పశువులను, అఆహారాన్ని,ఆరోగ్యాన్ని,సంపదను ప్రసాదించమని కోరేవారు.
యజ్ఞ గుండంలో సమిధలు వేసి అగ్నిని రాజేసిన తర్వాత పాలు,పెరుగు తేనె, కొత్త ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు,మొదలగు హవిస్సులు ,బియ్యపు పిండి తో చేసిన రొట్టె (పురోడాశము) ల పై ఆవు నేతిని పోస్తూ కొంత భాగాన్ని అగ్నికి ఆహుతి చేసి మిగిలిన దాన్ని తినేవారు. యజ్ఞ ప్రక్రియ విస్తరించిన కొద్దీ దేవతలను తృప్తి పరచడానికి మేక ,గొర్రె ,ఆవు,ఎద్దు, గుర్రం తదితర జంతువులను బలి ఇచ్చే వారు.దీనికి పరాకాష్ట గా మానవుడు ఉత్తమ పశువు కనుక దేవతలకు మనిషిని సహితం బలి ఇవ్వడం ఆచార మయింది. మను ధర్మశాస్త్రం ప్రకారం యజ్ఞంలో చేసే జంతు బలి , హింస క్రిందకు రాదు. బలి ఇవ్వబడిన జంతువులు ఉత్తమ జన్మలను పొందుతాయి.
యజ్ఞానంతరం మసాలాలు దట్టించి నేతితో కాల్చిన జంతు మాంసాన్ని అందరూ లొట్టలు వేసుకొని తిని, సోమరసం తాగేవారు..ఋషి యాజ్ఞవల్క్యుడు లేత ఆవు మాంసమంటే పడి చచ్చేవాడవి వ్రాయబడింది. ఈ ప్రక్రియ అశోకుని కాలం వరకూ కొనసాగింది.
క్రీ.పూ.600 సంII సమాజం లో వర్ణ వ్యవస్థ వేళ్ళూనుకొన్నది. వ్యవసాయం లో నాగలి ప్రవేశ పెట్టడం తో భూమి దున్నడానికి పశువుల అవసరం పెరిగింది. జంతు బలులు నిరసించ బడ్డాయి. అహింసా సిద్దాంతాలను ప్రచారం చేస్తూ,వర్ణ వ్యవస్థ పట్ల ఉదాసీనం గా ఉండే జైన,బౌద్ద మతాల పట్ల ప్రజలు మొగ్గు చూపడం తో, సమాజం పశు మాంసానికి దూరంగా జరిగింది. గొడ్డు మాంసం తినే అలవాటు అంటరాని వారికే పరిమితం చేయబడింది.
మళ్ళీ ముస్లింల దండయాత్రలతో బక్రీద్ మొదలగు పండగ దినాల్లో గోవధ మొదలయింది.కాని సుదీర్గ కాలం దేశాన్ని పరిపాలించిన మొఘులుల కాలం లో ఒక్క ఔరంగజీబు కాలం లో మినహా, బాబరు కాలం నుండి బహదూర్ షా వరకు, హిందుస్తాన్ ప్రజల ఆచారాలను గౌరవిస్తూ గోవధ నిషేదిచబడింది. మరాఠా రాజ్యాన్ని స్థాపించిన చత్రపతి శివాజీ గోవధ నిషేధం తో పాటు, భాహ్మణులకు పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధం గా పంజాబ్ ను పాలించిన సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ గోవధను నిషేదించాడు.
కాని గొడ్డు మాసం తినే అలవాటున్న బ్రిటిష్ రాక తో పరిస్తితి మారింది..బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ కలకత్తా పరిసర  ప్రాంతలలో అనేక గోవధ శాలలుకు అనుమతి ఇచ్చాడు.ఈ చర్య పట్ల వ్యతిరేకత ఎదురైయింది.భాతర ప్రధమ స్వాతంత్ర పోరాటం గా పేర్కొన బడుతున్న ‘సిపాయల తిరుగుబాటు’ కు ఒక కారణం , ఆవుకొవ్వు, పందికొవ్వు, పూసిన తూటాల పై పొరను నోటితో లాగి తుపాకీలో అమర్చడం.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1870 గోసంరక్షణ నిమిత్తం పంజాబ్ లో నాంధారి సిక్కులు ‘కుకా’ ఉద్యమాన్ని నడిపారు. తర్వాత స్వామి దయానంద సరస్వతి ,గోసంవర్దని సభలను నిర్వహించగా ,ఆర్య సమాజ్ వారు మన సంస్కృతిని సంస్కరించే ఉద్యమమం లో భాగం గా గోవధ వ్యతిరేక నినాదాన్ని చేపట్టారు.బాలగంగాధర తిలక్,మదన్ మోహన్ మాలవ్యా, బాబూ రాజేంద్ర ప్రసాద్ ,గాంధీజీ మొదలగువారు జాతీయ ఉద్యమం లో ప్రజలను సమీకరించడానికి భావోద్రేకాన్ని రేకెత్తించే అంశం గా గోవధ నిషేదాన్ని ఉగ్యమం లో చేర్చారు.
గోవధ నిషేద చట్టాలు
రాజ్యాంగ సభ చర్చల అనంతరం రాజ్యాంగపు ఆదేశిక సూత్రాల విభాగం లో (ప్రభుత్వానికి సూచలిచ్చేవి) 48 వ ఆర్టికల్ లో “ ప్రభుత్వం ,వ్యవసాయం, పశుగణాభివృద్ధి లను అభివృద్ధి చేయడానికి ఆధినిక శాస్త్రీయ పద్దతులను చేపట్టాలని ,అందుకు తగు చర్యలు తీసుకోవాలని,ఆ లక్ష్యాల సాధన కోసం తగిన చర్యలు గా ఆవు,దూడలను, పాలిచ్చే జంతువులు,వాటి సంతాన వధను నిషేదించాలని “ పేర్కొన్నది.ఇందులో ఆవు పవిత్ర గురించి చెప్పబడ నప్పటికీ, దీనిని సాకు గా తీసుకొని ‘పూర్తి గోవధ నిషేద చట్టం’ కోసం అనేక రాజ్యాంగ సవరణ ప్రయత్నాలు జరిగాయి.
1959 మహ్మద్ హనీఫ్ ఖురేషి మరియు బీహార్ ప్రభుత్వ కేసులో సుప్రీం కోర్ట్ ,భారత దేశం లో, ముస్లింలు,క్రైస్తవులు , షెడ్యూలు కులాల వారు ఆవు,బర్రె మాంసాలు తింటారని, ఆర్దికంగా కూడా వ్యసాయానికి పనికిరాని, వట్టిపోయిన పశువులను అట్టేపెట్టడం భారమేతప్పు,సమాజ శ్రేయస్సు కాదని అందువల్ల సంపూర్ణ నిషేద చట్టం వాంఛనీయం కాదని ,అభిప్రాయ పడింది.
కాని 2005 లో పై తీర్పుకు భిన్నంగా గుజరాత్ ప్రభుత్వం మరియు మిర్జాపూర్ మొలి కురేషి కస్సాబ్ జమాత్ ,ఇతరుల కేసులో గుజరాత్ ప్రభుత్వం యెక్క వ్యవసాయ పశువుల వధ నిషేద చట్టాన్ని పూర్తిగాసమర్దించింది. ఈ తీర్పు నాటి గుజరాత్  బి జె పి ప్రభత్వపు ముఖ్యమంత్రి మోది విజయం గా శ్లాగించబడింది.
పశుసంపదను కాపాడడం ,అభివృద్ధి పరచడం,వాటిని రోగాల నుండి రక్షించడం, పశువధ పైనిషేదాలను విధించే చాట్టాలు చేసే అదికారాన్ని ,రాజ్యాంగం ‘రాష్ట్ర జాబితా’ లోని 7 వ షెడ్యూలు 15 వ అంశంగా ,రాష్ట్రాలకు కట్టబెట్టింది. అందువల్ల గోవధ నిషేద చట్టాలు రాష్ట్రాలలో రకరకాలుగా ఉన్నాయి.
అ) గోవధ నిషేధం లేని రాష్ట్రాలు : మేఘాలయ ,త్రిపుర, మణిపూర్, అరుణాచల ప్రదేశ్, సిక్కిం మరియు మిజోరం
ఆ)పూర్తి నిషేధం ఉన్న రాష్ట్రాలు : జమ్మూ కాశ్మీర్, హిమాచల ప్రదేశ్ , హర్యానా, రాజస్థాన్ ,ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘర్ ,
ఇ)పాక్షిక నిషేధం ఉన్న రాష్ట్రాలు :ఆవులు,ఎద్దులు మొదలగునవి 10 లేక 15 సంవత్సరాలు నిండిన వని,అవి వ్యవసాయానికి గాని ,ఇతరత్రాగాని పనికి రావనే సర్టిఫికేట్ ద్వారా వధించ వచ్చు నని తెలిపే రాష్ట్రాలు ,అస్సాం, తమిళనాడు, గోవా, పశ్చిమ బెంగాల్, కేరళ
ఈ)పశు వధ నుండి ఆవులను మినహాహిస్తూ కొన్ని నిభందనల తో ఎద్దులు, ఇతర పశువులను వధించేందుకు అనుమతించే రాష్ట్రాలు: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా , ఒడిస్సా, బీహార్.

పై  చట్టాలనుఉల్లంఘించిన వారికి ఆయా రాష్ట్రాలలో ఉన్న చట్టాలను బట్టి రు,1000 నుండి 10,000 ల వరకు ఫైను గాని 6 నెలల నుండి 3 సం.ల వరకు జైలు శిక్ష గాని కోర్టులు విధించవచ్చు.

మన ఆహారపు అలవాట్లు
మధ్య శిలాయుగం లో మానవుడు పూర్తిగా వేటమీదే ఆధారపడి జీవించేడని ,నవీన శిలాయుగం లో వ్యవసాయం తో పాటు జంతువులను మచ్చిక చేసుకొని తన ఆహార అవసరాలను తీర్చుకొనే వాడని చరిత్ర చెపుతోంది.భారతీయ గిరిజన సముదాయాల లో వేట ఇప్పటికీ ప్రధాన వృత్తే. సాధారణంగా ఎక్కడ దొరికే ఆహారాన్ని బట్టే అక్కడ ప్రజల ఆహారపు అలవాట్లు ఉంటాయి. మన దేశంలో ,ఈశాన్య రాష్ట్రాలు ,కేరళ లో ఎక్కవమంది గొడ్డు మాంసం తింటారు.
వేదకాలం నాటి మన రుషులు అన్నిరకాల మాంసాలనీ ఇష్టంగా తినేవారు.అధితులకు ఆవుని కాని మేకను గాని కోసి వడ్డించే వారు. ఇల్వలుడనేవాడు , అగత్య మహర్షిని విందు భోజనాకి పిలిచి మేకను కోసి మాంసం వడ్డిస్తే, పీకల దాకా (మేక రూపం లోనున్న వాతాపి అనే రాక్షసుడినట ) శుబ్రంగా తిని ‘వాతాపి జీర్ణం” అని జీర్ణం చేసుకొన్నాడు. అదేవిధంగా రాజర్షి విశ్వామిత్రుడు ఆకలి బాధకు తట్టుకో లేక కుక్క మాంసం కోసం కక్కుర్తి పడ్డాడు (6). త్రేతా ద్వాపర యుగాల మద్య మహా కరువు సంభవించింది. భూలోకమంతా పీనుగుల పెంట అయింది.విశ్వామిత్రుడు ఆకలితో అల్లాడి పోయి ఒక మాలపల్లి చేరాడు.అక్కడ ఒక ఇంటి దగ్గర అప్పుడే చంపి చర్మం  వొలిచి ఆరేసిన కుక్క మాంసం చూసాడు. ప్రాణం కాపాడుకోడానికి దొంగ తనమైనా ధర్మమే అవుతుందని ,అర్ధరాత్రి ఆ మాంసం దొంగిలింఛ బోయాడు. చండాలుడు లేచి ఎవరు నువ్వు చంపేస్తానన్నాడు. విశ్వామిత్రుడు భయపడి తన పేరు చెప్పగానే ,చండాలుడు మహాత్మా ,మీకిది తగునా అంటాడు.విశ్వామిత్రుడి సిగ్గుపడి,ప్రాణం నిలబెట్టు కోడానికి, పాపమైనా కుక్క మాంసం దొంగిలిస్తున్నానంటాడు.కుక్క మాంసం తిని నీ ధర్మాన్ని ఎందుకు పోగొట్టుకొంటావని మాలవాడడిగితే , బొందెలో ప్రాణం నిలుపు కోవడమే అన్నింటికన్నా ధర్మం అంటాడు. నీచుల దగ్గర దానం పుచ్చుకొంటే మీరూ నీచులవుతారని చెప్పి కుక్క మాంసాన్ని ఇస్తాడు. ఆ కుక్క మాంసం తిని విశ్వామిత్రుడు ప్రాణాన్ని కాపాడుకొంటాడు.
ఇలా రకరకాల మాంసాలు ఒకప్పుడు తిన్నప్పటికీ, కాల క్రమేణా చేసే వృత్తి, తినే ఆహారంయెక్క శుచి- అశుచి ( purity and pollution  ) లను బట్టి వర్ణ వ్యవస్థ ఏర్పడింది. పాల పదార్ధాలు శాఖాహారం తిని , పూజారి వృత్తి చేసే వారు శుచి కరమైనవారు.వీరు సమాజ క్రమ శ్రేణి లో ఉన్నత అంతస్తు ఏర్పాటు చేసుకొన్నారు.. గుడ్డు,మాంసం, పంది మాసం, గొడ్డు మాంసం తినడం , బట్టలుతకడం,తోళ్ళను శుబ్రపరచడం మొదలగునవి అశుచి కరమైన మైల తో కూడుకొన్నఆహారాన్ని తినే అలవాట్లున్న , నీచమైన వృత్తుల వాళ్ళు శూద్రులు, అంటరాని వాళ్ళు , సమాజిక శ్రేణి లో అట్టడుగు వారు.. అందువల్ల బ్రాహ్మణులలో ఎక్కువ శాతం శాఖాహారులు గా మారారు. అయినా సరస్వత్ బ్రాహ్మణులు,కాశ్మీర్ బ్రాహ్మణులు, బెంగాల్ బ్రాహ్మణులు మాత్రం మాంసాహారాన్నిఇప్పటికీ వదులుకో లేదు.
భారత దేశం లో భిన్న ఆహారపు అలవాట్లున్నాయి.ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. ప్రస్తుతం దేశం లో ముస్లింలు, క్రైస్తవులు ,దళితులుకు, ‘బీఫ్’ తినే అల వాటున్నది. కోడి,మేక,గొర్రె మాంసాలతో పోలిస్తే చవకైనది. సరియైన పోశాకాహారం లభించక చనిపోయే పిల్లల్లో దళిత పిల్లలే అధికం. అందువల్ల కొందరి అలవాటుని మత కోణం లో చూసి వారి మీద దాడి చేసి చంపడం అమానుషం.
ఈ ఘటన పై అనేకమంది స్పందిస్తున్నారు.సుప్రేం కోర్ట్ మాజీ న్యాయమార్తి మార్కందేయ కట్జూ ,ఆవు అన్ని జంతువుల లాంటిదేనని,ప్రపంచ వ్యాపితం గా అనేక మంది గొడ్డు మాంసం తింటారని, దాంట్లో తప్పేమున్నదని, తాను ఇదివరలో తిన్నానని, భవిష్యత్తు లో కూడా తింటానని చెప్పారు. అతని మీద కేసు నమోదయింది. అదేవిధంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక సందర్బం లో ‘తానింత వరకు గోమాంసాన్ని తినలేదు, ఒకవేళ తినాలనిపిస్తే తింటానని”అన్నారు.దానిపై భాజప నాయకుడు శివమొగ్గ పురపాలక సంఘ మాజీ అధ్యక్షుడు ఎన్ ఎన్ .చెన్నబసవప్ప , గోమాంసం తింటే తల నరికేస్తానని సిద్దరామయ్యను హెచ్చరించాడు… ఇదీ మన ‘అసహన వాదుల’ వరస.
ఆర్దిక రంగం లో ఆవు

cow photo.jpg
ప్రధాని మోది 2014 పార్లమెంట్ ఎన్నికలలో గోమాతను ఒక ప్రచార అస్త్రం గా వాడు కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ రంగం లోనూ అభివృద్ధి సాధించ లేదు గాని ‘గాయిమా’ ను చంపడం ద్వారా గొడ్డు మాంసపు ఉత్పత్తి,ఎగుమతులలో లో విప్లవాన్ని సృష్టించిందని విస్తృతంగా ప్రచారం చేసారు. కాని వాస్తవాలు వేరుగా ఉన్నాయి.
భారతదేశం లో 19 కోట్ల ఆవులు,ఎద్దులు ఉండగా 10.9 కోట్ల గేదలూ,దున్నపోతులూ ఉనాయి.అవి మొత్తం భారతదేశ జనాభాలో 25% గా ఉన్నాయి.ప్రపంచలో ఉన్న గేదేలలో మన దేశం 58% కలిగి ఉన్నది. దేశం అధిక జనాభా తో ఇప్పటికే కిక్కిరిసి పోయి ఉండగా, పనికి రాని పశువులను రోడ్ల మీదకు తోలి వదిలించు కోవడం వల్ల మరింత కిక్కిరిసి పోతుంది .
భారతదేశపు గేదె మాంసానికి విదేశాలో మంచి గిరాకీ ఉన్నది. మనదేశం నుండి 2014-15 లో 24 లక్షల టన్నుల గేదె మాసం ఎగుమతి అయింది. ఇది ప్రపంచ దేశాల గేదె మాంసం ఎగుమతిలో 23.5 శాతం. తద్వారా రు. 30,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించింది.అది విదేశీ మారక ద్రవ్య ఆర్జనలో 1 శాతం.
అంతేకాదు.మనం ఉత్పత్తి చేసే గొడ్డు మాసం లో దేశీయంగా తినడానికి, ఇతర అవసరాలకు ఉపయోగించేది 30% మాత్రమే. దేశం లో కేవలం 5% మంది మాత్రమే గొడ్డు మాసం తింటారు. మిగతాది విదేశాలకు ఎగుమతి అవుతుంది, ఆహారపదార్ధాలు , సబ్బులు, మందుల పై పూతకు ,టూత్ పేస్ట్ తయారీ, ఫోటోగ్రఫి లలో వాడే ‘జేలేటిన్’ లేక పశుకొవ్వు ఉత్పత్తికి, టెన్నిస్ రాకెట్లు,అగ్ని మాపక నిరోదం లో వాడే స్ప్రే , ఆపరేషన్ తర్వాత కుట్లు వేసే దారాలు, మనం ధరించే తోలు జాకెట్లు, బెల్టులు, బూట్లు, ఎముకులపొడి పంచదార శుద్ధికి, కొమ్ములు బొమ్మలు తయారేకీ ,తోకతో  బ్రష్లు ఇలా రక రకాల అవసరాలకోసం గొడ్డు మాంసాన్నీ, వాటి భాగాలనూ ఉపయోగిస్తారు.

పాల ఉత్పత్తి తోబాటు ,వ్యవాయ పనులకు ఉపయోగపడుతూ పశువులు రైతులకు నిలకడైన ఆదాయాన్ని ఇస్తాయి. సాధారణం గా రైతు ఆవు లేక ఎద్దులను రు.25,000 నుండి 50,000 కొని రెండేళ్ళ తర్వాత అమ్మినా అదే ధర పొందుతాడు.ఎక్కువకాలం ఉంచుకొని అవి పూర్తి వట్టి పోయినా,అనారోగ్యం పాలయి వ్యవసాయ పనులకు ఉపయోగ పడకపోయినా, వాటిని పశువుల సంత కు తోలి రు.10 నుండి 20 వేలకు పశు మాంసం వ్యాపారులకు అమ్మి, ఇలా తిరిగి వచ్చిన 40% పెట్టుబడి లో మిగతాది వేసి కొత్త పశువులు కొనుక్కొంటాడు. కాని గొవధ నిషేదం వల్ల ముసలి ఆవు,ఎద్దుల వ్యాపారం పూర్తిగా స్తంభించి పోవడం తో రైతాంగం నష్ట పోతుంది.
ఒకొక్క పశువు కు రోజుకు 60 నుండి 70 లీటర్ల నీళ్ళు, 30 నుండి 40 కిలోల గడ్డి కావాలి.ఆ విధంగా రోజుకు రు.100 /- ఖర్చుగా చూసినా సంవత్సరానికి రు.36.000/- ఖర్చవుతుంది. ఆలెక్కన దేశం లో వట్టిపోయిన 12 లక్షల ఆవులకు సంవత్సరానికి .4,677 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.
మన దేశం లో 25 లక్షల మంది తోళ్ళ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు.వారంతా షెడ్యూలు కులాల వారే. వీరంతా వీధిన పడ్డారు.గోమాంస అందోళన వల్ల అవి ఆవుతోళ్ళు కాకపోయినా ,ఆవుతోళ్ళని ఆరోపిస్తూ దాడులు జరగవచ్చుననే భయం తో గుత్తేదారులు కొనదానికి, లారీలవాళ్ళు రవాణా చేయడానికి ముందుకు రావడం లేదు..అందోళన మొదలయ్యాక కాన్పూర్ కు రోజూ తోళ్ళతో వచ్చే లారీల సంఖ్య 15 నుండి 3 కు పడిపోయింది. దేశీయ తోళ్ళ పరిశ్రమ కుదేలవుతున్నందు వల్ల ‘ మేక్ ఇన్ ఇండియా ‘ తోలు వస్తువులకు బదులు విదేశీయ తోలు ఉత్పత్తులను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్,ఆంధ్రప్రదేశ్ ,పజాబ్ లలో కోట్ల రూపాయల పెట్టుబడితో 24 గొడ్డుమాంస శుద్ది పరిశ్రమలున్నాయి. అందులో 13 పూర్తిగా విదేశీ ఎగుమతి కోసం ఏర్పాతయినవే. ఆ యంత్ర సామగ్రికి తుప్పు పట్టే పరిస్తితి ఏర్పడింది.
అదే సందర్భం లో మన పశుగణం , పట్టణాలలోని వాహనాలు కలిగించే వాతావరణ కాలుష్యం కంటే ఎక్కువ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఆవులు,గేదలు,మేకలు,గొర్రెలు,గుర్రాలు,ఒంటెలు విడుదల చేసే వ్యర్ధాల నుండి వెలువడే ‘మిథేన్ ‘ వాయువు (గ్రీన్ హౌస్ గేస్) వాతావరణం లోకి చేరుతుంది.ఇది బొగ్గు పులుసు వాయువు కంటే 21 సార్లు ఎక్కువ ఉష్ణతాపాన్ని పెంచుతుంది.భారతదేశ పాడి పరిశ్ర మ విడుదల చేసే గ్రెన్ హౌస్ గేస్ 14.32 మిలియన్ల టన్నులు కాగా అది ప్రపంచ పాడిపరిశ్రమ విడుదల చేసే గ్రీన్ హౌస్ గేస్ లో 15% వాటా గా ఉన్నది.
గోవధ నిషేధం గురించి అందోళన చేసే కాషాయి దళం వారు, నిషేధం వల్ల వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలు, ఆర్దిక వ్యవస్థకు ఎదురయ్యే సవాళ్ళ గురించి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తూ ప్రజల సెంటిమెంట్ ను తమ ప్రయోజనాలకి వాడుకోవడం వల్ల దేశ ప్రయోజనాలు  దీర్ఘ కాలం లో  దెబ్బతిన్నా , తాత్కాలిక రాజకేయ లబ్ది పొందడమే వారి ధ్యేయం.

ఎన్నికల ప్రచార బరి లో కి గోమాతBJP Postar - Copy.jpg

ప్రధాని మోది 2014 పార్లమెంట్ ఎన్నికలో ,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డబ్బు సంపాదన కోసం గోమాత తో వ్యాపారం చేస్తున్నదని ( దేశాన్ని అభివృద్ధి చేయస పోయినా ,గులాబీ రంగు విప్లవం మాత్రం సాదించింది – అంటే రాయతీలు కల్పిస్తూ పెద్ద ఎత్తున గోమాంసం విదేశాలకు ఎగుమతి చేయడం) అని చేసిన ప్రచారం మంచి ఫలితాన్నే ఇచ్చింది.
గతనెలలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో, గోమాంసం మీద జరుగుతున్న గొడవ వల్ల లాభపడే ఉద్దేశం తో ,ఎన్నికలో గెలిస్తే గోవధ నిషేద చట్టాన్ని తెస్తామనే వాగ్దానం తోబాటు ,ఎన్నికల ఆఖరు దశలో ఒక స్త్రీ ఆవును కాగలించు కొని విచారిస్తూ” గోమాతను పవిత్రం గా భావించే వారికే మీరు ఓటేయండి. గోమాతను అవమాన పరిచే వారికి కాదు” అనే నినాదంతో గోడ పత్రికను విడుదల చేసారు. కాని దాని వల్ల ఆశించిన ఫలితం రాలేదు.

*********
ఆవు వ్యధ
గొడ్ల పాకలో గుంజకు పలుపు తాడుతో కట్టిన మా ఆవు దగ్గరకు వెళ్లాను.కూర్చొని నెమ్మదిగా నెమరు వేస్తున్నది. సాధారణం గా నా అలికిడికి ,నా రాకను గమనిచినట్టు కళ్ళు తెరిచి నాకేసి చూసి చెవులు ఆడించేది. ఈ సారి ఎందుకో చెవులు ఊపలేదు. పైగా దాని ముఖం విచారం గా ఉన్నట్టు తోస్తున్నది.
నేను కూడా అన్ని జంతువుల లాంటి దాననే.నేను పవిత్రమైన దానినని నువ్వు నమ్ముతుంటే నన్ను పూజించుకో. ఎవరూ కాదనరు. కాని నాపేరు తో ఇతరుల మీద దాడులెందుకు? వారిని చంపడమెందుకు? గోహత్య మహా పాతకం అనుకొంటే ,ఆపాపం నన్ను చంపిన వాడికే గాని నీకు కాదుగదా. ప్రస్తుతం మతం పేరు తో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రపంచాన్ని గడగడ వణికిస్తుంటే ఇక్కడ నువ్వు వాళ్ళకేమీ తీసిపోని విధం గా ప్రవర్తించాలను కొంటున్నావా?
నీ కుటిల రాజకీయ లాభం కోసం ఎన్నికల ప్రచారం లోకి నన్ను లాగడ మెందుకు. మొన్న బీహార్ ఎన్నికలో నీ పార్టీ చిత్తుగా ఓడిపోయినప్పుడు నామీద ఎటువంటి జోకులు పేలాయో గమనించేవా. ఒకడు ‘ఆవులు పాలివ్వగలవు గాని ఓట్లివ్వ లే’ వన్నాడు . మరొకడు, ఆవులకు ఓట్లిచ్చి పోలింగు బూతుల్లోకి రానివ్వక పోవడం వల్ల బిజెపి ఓడిపోయిందన్నాడు. ఇలా నలుగురిచేతా అభాసు పాలు చేయించడం నీకు భావ్యమేనా. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో నా గురించి నానా రభసా జరుగుతున్నది. దేశం లో “సత్యమేవ జయతే…. అహింసో పరమో ధర్మః “ అనేది పాత సిద్ధాతం “ అసత్యమేవ జయతే … హింసో పరమో ధర్మః “ అనేది కొత్త సిద్ధాంత మంటున్నారు. మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు’ మనం ఊడ్చాల్సింది వీధుల్లో చెత్తను గాదు , మన బుర్రల్లో చెత్త’ నంటున్నారు.
నీకు నామీద నిజంగా పూజ్య భావం ఉంటే నన్ను చివదాకా పోషించి ,నేను చనిపోయిన తర్వాత సంస్కారం గూడా చెయ్యగలవా. మనుష్యులకే దిక్కులేని ఈ కాలం లో అవసరం తీరిన తర్వాత మా గురించి పట్టించుకొనే నాధుడెవ్వడు. అందరిలాగే నువ్వూ, నేను పూర్తిగా వట్టి పోయిన తర్వాత సంతకు తోలి కబేళా కొట్టుకు అమ్మేస్తావు. కసాయి కొట్టుకు అమ్మడం పాపమనుకొంటే వీధిలోకి గెంటి వదిలించు కొంటావు.అప్పుడు నా పరిస్థితి ఏమిటి.గడ్డి మేద్దామని ఎవరి పొలం లోకైనా జోరబడితే బడిత పూజ చేస్తారు. అందువల్ల నేను వీధులలో తిరుగుతూ మునిసిపాలిటీ చెత్త కుప్పలో పడేసిన కుళ్ళి పోయిన కూరగాయలు, పులిస్తరాకులు, పాలితిన్ సంచులు తింటూ ఆకలితోనూ ,రోగాలతోనూ చావాల్సిందే గదా.
అంతే కాకుండా నేను దిక్కుమాలిన కుక్క చావు చస్తే’ మునిసిపాలిటీ వాళ్ళు నా కళేబరాన్ని ఎక్కడో దూరం గాపారేస్తారు.ఒకప్పుడైతే నా కళేబరాన్ని రాబందులు ,నక్కలు పీక్కొని తినేవి.అవికూడా అంతరించే దశ చేరడం వల్ల , నన్ను కాకులు తప్ప మరేవీ ముట్టవు. అప్పుడు నేను దుర్గంధం వెదజల్లుతూ ,వారాలు తరబడి కుళ్ళాలి.
అంతకంటే నన్ను కబేళాకు పంపడమే మేలు కదా. ‘ పరోపకారార్దమ్ ఇదం శరీరమ్ ’ అన్నారు పెద్దలు. నా మాంసం  కొందరి ఆకలి తీరుస్తుంది . నా చర్మం, అవయవాలు కొంత మేరకు ఉపయోగపడతాయి.అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైన దంటారు. అటువంటి మానవుడు నా మాంసం  తింటే నాకూ ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుందేమో.
“ ఆలోచించు “ అని కన్నీళ్లు పెట్టు కొంటున్నట్టున్నాయి మా ఆవు కళ్ళు.
—————————————————————————————
References
1. Amartya Sen –The Argumentative Indian. Penguin Books
2. త్రిపురనేని రా మస్వామి చౌదరి – ఖూనీ
4.ఎస్.బి. రఘునాదాచార్య – ఆర్ష విజ్ఞానము. తిరుమల తిరుపత దేవస్తానం వారి ప్రచురుణలు
5. ఆచార్య పుల్లెల రామచంద్రుడు –హిందూ మతం .జయలక్ష్మీ పుబ్లికేషన్ .హైదరాబాద్
6.మహాభారతం – శాంతి పర్వం