ఎలమంచిలి చరిత్ర- విశేషాలు

DSC_0545

బడిగంటి సింహాద్రి రావు
లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్(రిటైర్డ్)
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
యలమంచిలి -5310

నామనవి

నేను యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలో లైబ్రేరియన్ గా పనిచేసినప్పుడు ’స్తానిక చరిత్ర ‘ గురించి కొంత సమాచారం సేకరించాను. దానిని ఐదు సంవత్సరాల క్రితం ‘ఎలమంచిలి చరిత్ర-విశేషాల ‘పేరుతో చిన్న వ్యాసం గా వ్రాసి దానిని తెలుగు వికీపిడియా లో ‘మావూరు’ శీర్షిక క్రింద పొందు పరిచాను.ఆ సమాచారాన్ని మరింత విస్తృత పరచి మీముందుంచుతున్నాను. ఎలమంచిలి పై ఇది సమగ్ర చరిత్ర కాదు. ఈ రచనకు కావలసిన కొన్ని గ్రంధాలను అందించిన డాక్టర్ మానేపల్లి సత్యనారాయణ అవగాహనగ్రంధాలయం ఎలమంచిలి గార్కి, దిమిలి ఉపసర్పంచ్ శ్రీ సేనాపతి నాగేశ్వరరావు గార్కి, యలమచిలి శాఖా గ్రందాలయాధికారి శ్రీ వి.ఆనందరావు గార్కి, చరిత్ర లెక్చరర్ శ్రీ టి.జయన్న గార్కి నా ధన్యవాదాలు. దీని లో ‘చరిత్ర’ కు సబందించిన చాప్టర్ లో ఎక్కువభాగాన్ని ప్రోఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ (చరిత్ర శాఖ-ఆంధ్రా యూనివర్సిటీ) గారు రచించిన ”పురాతన శైవక్షేత్రం-పంచదారల”(1988) నుండి గ్రహించాను. అందుకు వారికి నాప్రత్యేక కృతజ్ఞతలు.ఈ సమాచారాన్ని పుస్తకం గా వేసే ఉద్దేశం ఉన్నందువలన మీ అభిప్రాయాలను తెలియజేయ ప్రార్ధన .
బి.సింహాద్రిరావు
Mobile:9848954048
email:srbadiganti@gmail.com

విషయ సూచిక
1. ఉనికి
2. పట్టణ స్వరూపం
3. చరిత్ర
4. స్వాతంత్రోద్యమంలో ఎలమంచిలి
5. ఆర్దిక స్థితిగతులు
6. సమాజిక వర్గాలు
7. రాజకీయ పార్టీలు
8. విద్యా సంస్థలు
9. వైద్య సౌకర్యాలలు
10. రవాణా సౌకర్యాలు
11. దేవాలయాలు
12. చూడదగిన ప్రదేశాలు
13. చారిత్రిక గ్రామం- దిమిలి
14. ఈ ప్రాంతపు ప్రముఖులు
15. సమస్యలు

1. ఉనికి

ఎలమంచిలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు ఒక పట్టణము.

విశాఖపట్నం జిల్లా లో యలమంచిలి

vishakapatanam-district-map

విశాఖపట్నం జిల్లాలో యలమంచిలి మండలం (2011)

1

యలమంచిలి మండలానికి తూర్పున రాంబిల్లి మండలం,పడమర కోటఉరట్ల మండలం,ఉత్తరాన కసింకోట మండలం,దక్షిణాన ఎస్.రాయవరం మండలాలు ఉన్నాయి.
అక్షాంశ- రేఖాంశాలు : 17°20′N 82°31′E / 17.33, 82.52
కాలాంశం : భా.ప్రా.కా ( గ్రీ కా+ 5 : 30 )
ముఖ్య పట్టణము : యలమంచిలి (ఎలమంచిలి ) పిన్:531055 ఫోన్ కోడ్:08931
జిల్లా : విశాఖపట్నం
మండలం లో గ్రామాలు : 24 (2011 కు ముందు )
యలమంచిలి మునిసిపాలిటి అయినతర్వాత : 16
మండల జనాభా : 68,480 ( 2001 జనాభా లెక్కల ప్రకారం )
పురుషులు : 33817
స్త్రీలు : 34663
గ్రామ జనాభా : 28224 (2001)
పురుషులు : 14035
స్త్రీలు : 14189
యలమంచిలి మునిసిపాలిటీ జనాభా :46712(2011)
మండలం లో ఇతర గ్రామాల జనాభా: 24394(2011)
అక్షరాస్యతాశాతం : 54.8% (2011)
పురుషులు : 62.5%
స్త్రీలు : 47.3%
యలమంచిలి గ్రామపంచాయతీ స్థాపితము : 01.03.1886
యలమంచిలి మేజర్ పంచాయితీ సి-గ్రేడ్ మునిసిపాలిటీ గా మారిన తేది : 27.11.2011

2. పట్టణ స్వరూపం 

ఎలమంచిలి పట్టణము 17.33N, 82.52E అక్షాంశ రేఖాంశాలవద్ద ఉంది. సముద్ర తలం నుండి దీని సగటు ఎత్తు 7 మీటర్లు(26 ఆడుగులు). విశాఖపట్నం నుండి ఇది 64 కి.మీ. దూరంలో ఉంది. ఎలమంచిలి మీదుగా హౌరా-చెన్నై రైల్వేమార్గము మరియు జాతీయ రహదారి ఎన్. హెచ్ -16 (కలకత్తా-చెన్నై) పోవుచున్నవి.

శీతోష్ణస్థితులు: వాతావరణం వేసవిలో ఎక్కువ వేడిగాను శీతాకాలం లో చల్లగాను ఉంటుంది ఎండాకాలం(మార్చ నుండి మే) లో ఉష్ట్నోగ్రత 45 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు చేరుతుంది .ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం(డిసెంబర్ నుండి ఫిబ్రవరి)లో వాతావరణం చల్ల గా ఉండి ఉష్ట్నోగ్రతలు 18 డిగ్రీల నుండి 32 డిగ్రీల సెంటిగ్రేడ్లల మధ్య ఉంటుంది. వర్షాకాలం జూన్ నుండి నవంబర్ వరకు ఉంటుంది. నైరుతిరుతుపవనాల ప్రభావం జూన్ నుండి సెప్టెంబర్ వరకు, ఈశాన్య రుతుపవనాల ప్రభావం అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఉంటుంది.సంవత్సర సాధారణ వర్షపాతం 968 mm(38 సెం. మీ)గా నమోదు అవుతుంది.

ఎలమంచిలి పేరు: ఎలమంచిలి అసలు పేరు “ఎల్ల – మజలీ” అని ,పూర్వపు కళింగదేశానికి గోదావరి మండలపు ఆంధ్ర రాజ్యానికి సరిహద్దు అని, ఉభయ రాజ్యాలవారు పన్ను వసూలుకు ఎలమంచిలిని ఒక మజలీ కేంద్రం గా వాడుకొనుట వల్ల దానికి ఆ పేరు వచ్చినదని తెలుస్తున్నది. ”ఎల్ల” అంటే హద్దు , “మజలి” అంటే ప్రయాణం లో ఒక చోట తాత్కాలికం గా ఆగడం అని అర్ధం. తెలుగులో మొదటి యాత్రాగ్రంధమైన(travelouge) ఏనుగుల వీరాస్వామయ్య క్రి.శ 1831 లో రచించిన ‘కాశీయాత్ర’ గ్రంధం లో యలమంచిలి ని ఒక మజలీవూరు గా పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ మరియు కొన్ని ప్రభుత్వశాఖల లో ఊరి పేరు ‘ఎలమంచిలి’ (Ellamanchili) గాను,పోస్టల్ మరికొన్ని కార్యాలయాలో ‘యలమంచిలి ‘ (yellamanchili)గాను వ్యవహరించ బడుచున్నది

యలమంచిలి మునిసిపాలిటీ :తే. 28.12.2011 న యలమంచిలి పంచాయితీని ‘సి ‘ గ్రేడ్ మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యలమంచిలి పంచాయితీలో దగ్గరలో గల సోమలింగపాలెం, రామానాయుడిపల్లి, పెదపల్లి, ఎర్రవరం-25, తెరువుపల్లి, కట్టుపాలెం, కొక్కిరాపల్లి గ్రామాలను కలిపి యలమంచిలి మునిసిపాలిటీ గా ఏర్పాటు చేయబడింది. మునిసిపాలిటీ ప్రస్తుత(2011జ.లె ) జనాభా 47 వేలు. యలమంచిలి మేజర్ పంచాయితీ ని నగరపాలక సంస్థ గా మార్చినప్పటికి దీనిని పట్టణ ప్రాంతంగా గుర్తించుటకు తగిన అర్హతలైన వ్యవసాయేతర రంగాలలో కనీసం 75% మంది మగవారు పనిచేస్తూ ఉండడం, వ్యవసాయేతర పనుల నిమిత్తం చుట్టుప్రక్కల పేదలు వలస రావడం, మెరుగైన విద్యా, వైద్య,వాణిజ్య సౌకర్యాలు వంటివి లేవు. పురపాలక సంఘం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వ అధికారిగా మునిసిపల్ కమిషనర్ నియమించబడ్డారు. 2014 లో జరిగిన మునిసిపల్ ఎన్నికలో తొలి చైర్ పర్సన్ గా జిల్లా తెలుగు దేశం నాయకులు,విశాఖ డైరీ చైర్మన్ శ్రీ ఆడారి తులసీరావు గారి కుమార్త శ్రీమతి పిల్లా రమాకుమారి గారు ఎన్నికైనారు.
మండలంలోగ్రామాలు: ఏటికొప్పాక, కొత్తలి,పురుషోత్తపురం,కృష్ణంపాలెం,రుక్మిణిపురం,పోతిరెడ్డి పాలెం,జంపపాలెం,షేకలిపాలెం,తురంగలపాలెం,పులపర్తి,గూండ్రుబిల్లి,లక్కవరం,బయ్యవరం,పద్మనాభరాజుపేట, రేగుపాలెం, లైన్ కొత్తూరు.

3 .చారిత్రిక విశేషాలు:

యలమంచిలి ప్రాంతానికి తరతరాల నాగరికతను చాటిచెప్పే చరిత్ర ఉందని పురావస్తు సాక్ష్యాధారాల వల్ల తెలుస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా మునిసిపాలిటీలో ఒకటైన యలమంచలి ప్రాంతం చారిత్రిక మధ్యయుగాల్లో మత, సాంస్కృతిక ,రాజకీయ రంగాలన్నింటి లో ఈ ప్రాతం గణనీయమైన స్థానాన్ని ఆక్రమించింది . భౌగోళికంగా గోదావరి తీర ప్రాంతానికి కళింగసీమకి మధ్య నున్న ఈ ‘ఎలమంచి కళింగ’ విషయం చరిత్ర పూర్వయుగాలనుండి (pre-histoy period)వివిధ నాగరికతలకు ఆవాలమైనట్లు పురావస్తు సాక్ష్యాలు తెల్పుతున్నాయి. రాతి పనిముట్లతో ఆదిమ మానవుడు మృగాలను చంపి ఆకలి తీర్చుకొనే దశల నుండి బ్రిటీష్ పాలకులకు ఎదురునిల్చి స్వాతంత్రపోరాటం సాగించేటంత వరకు ఈ ప్ర్రాంత చరిత్ర వివిధ నాగరికతా సాంప్రదాయాలకు ఆలంబనగా నిలిచింది.
ఎలమంచిలి పట్టణానికి కొద్ది దూరంలో పశ్చిమంగా నున్న రెనూకొండ వద్ద, తూర్పున కల కొత్తూరుగెడ్డ ప్రాంతంలో జరిగిన అన్వేషణలో శిలాయుగం నాటి పనిముట్లు కొన్నిబయలుపడ్డాయి. యలమంచిలికి పంచదార్లగ్రామానికి నడుమన నవీన శిలాయుగం నాటి సాధనాలు, మట్టిపాత్రల శకలాలు దొరికాయి. వీటిలో కొన్నింటిని ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర-పురావస్తు శాఖ మ్యుజియంలో భద్రపరచారు.ఆదిమ మానవుని నాగరికత ఎలమంచిలి ప్రాంతం లో ఏమేరకు అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి ఈ పురావస్తు ఆధారాలు తోడ్పడతాయి.
చరిత్ర యుగాల్లోకి వస్తే, క్రీస్తు శాకారంభానికి పూర్వం ఈ ప్రాంత చరిత్ర ఈ విధంగా ఉండేదని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. మౌర్య చక్రవర్తి అశోకుడు జరిపిన కళింగ యుద్ధంలో కళింగదేశం లో అంతర్భాగమైన ఈ ప్రాతం కూడా వీరోచితమైన పాత్ర నిర్వహించి ఉండవచ్చును. ఆ యుద్ద ఫలితాల కారణంగానే కళింగ రాజుల చేతినుండి ఈ ప్రాంతంకూడా మౌర్యుల పాలనకు మారింది. ఆ తర్వాత ఆంధ్రశాతవాహనుల కాలం లో వారి ఏలుబడి క్రిందకు వచ్చింది. విశాఖ జిల్లా, శంకరం గ్రామం దగ్గర “బొజ్జన్నకొండ”వద్ద జరిపిన త్రవ్వకాలలో లభ్యమయిన నాణాలను,ఇతర ఆధారలను పరిశీలించి చూస్తె ఆయీ స్తలాల సామీప్యంలో నున్న ఎలమంచిలి ప్రాంతం కూడా ఆంద్ర శాతవాహనుల ఏలుబడిలో నున్నట్లు నిశ్శందేహంగా గుర్తించగలం. అప్పటివరకు ఈ ప్రాంతం లో జైనమతం వర్ధిల్లిందని, రేనూకొండ పరిసరాల్లోనున్న పెద్దపాడు, చింతలపాడు, సాలెపాడు మొదలైన “పాళ్ళు”ఈ ప్రాంతంలో ని జైనమతం ఉనికిని చాటుతున్నాయి. ప్రస్తుత కొక్కిరాపల్లిఅగ్రహారపు వెనుకనున్న ‘పాటిభూములు’ ఒక నాటి జైన అగ్రహారమని ఇక్కడ ప్రజలు చెప్పుకొనే మాట . కాని సక్రమమైన ఆధారాలు లభ్యం కానిదే ఈ ప్రదేశపు జైన మత ప్రాచుర్యాన్ని అంచనా వేయుట కష్టమైన విషయం. జైన మతపు ప్రభావం ఎలాఉన్నప్పటికీ శాతవాహనుల కాలం నుండి ఈ ప్రాంతపు నాలుగుచెరుగులా బౌద్ధమతం స్వైరవిహారం చేసింది. అనకాపల్లి దగ్గరలో కల బొజ్జన్న కొండ ,విశాఖపట్టణానికి ప్రక్కన గల బావికొండ,తొట్లకొండ ఆనాటి బౌద్ధానికి నేటి శిధిలరూపాలు .

ఎలమంచిలి చుట్టుప్రక్కల కూడా నేటికీ అనేక బౌద్ధవిగ్రహాలు కనిపిస్తున్నాయి. కొక్కిరాపల్లి గ్రామ శివార్లలో హారతి,నాగిని విగ్రహాలు కనుక్కోబడ్డాయి. యలమంచిలికి 2 కి.మీ దగ్గర గల కొత్తూరు ధన దిబ్బల వద్ద ,శారదా నదీతీరం లో ‘పాండవుల గుహ’గా పిలవబడుతున్నప్రదేశం ఒకనాటి బౌద్ధస్తావరం. అక్కడ పర్వత సానువుల్లో నేటికి లభ్యమౌతున్న పెద్ద ఇటుకలు .’ఇక్కడ ఉన్న భౌద్దవిహారం ’ ,విగ్రహ శిధిలాలు, మట్టిపాత్రలు ఒకనాటి బౌద్ధ శ్రమణకుల సంస్కృతిని చాటే స్పష్టమైన ఆధారాలు. ఈనాడు ఈ ప్రదేశంచుట్టూ మొక్కలునాటి , కంచె వేసి ‘పాండవులు గుహ ’దగ్గరకు వెళ్ళుటకు మెట్లు నిర్మించి , భారతీయ పురావస్తు శాఖ వారు పరిరక్షిస్తున్నారు

యలమంచిలి కొత్తూరు ధనదిబ్బల వద్ద గల బౌద్ధవిహారం

IMG_20150923_081707

పాండవుల  గుహగా పిలవబడుతున్న బౌద్దగురువుల విశ్రాంతి మందిరం

IMG_20150923_080739

గుప్త వంశపు రాజుల్లో ప్రసిద్దిచెందిన సముద్రగుప్తుడు జరిపిన దక్షిణ ద్విగ్విజయ యాత్రలో యీ ప్రాంతం కూడా జయించబడి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.శ.1908 లో ప్రొఫెసర్ రియా అను శాస్త్రజ్ఞుడు బొజ్జన్న కొండ వద్ద జరిపిన త్రవ్వకాల లో సముద్రగుప్తుని ‘బంగారునాణెం’ లభ్యం కావడాన్ని బట్టి యీ ప్రదేశంతో పాటు ఎలమంచిలి కూడా ఆ గుప్త చక్రవర్తి దండయాత్ర తాకిడికి గురి అయినదే అని గ్రహించగలం. సముద్రగుప్తుని ప్రయాగశాసనం ఈ ప్రాంతమంతటనీ ‘దేవరాష్ట్రం’ గా పేర్కొన్నది.
దండి మహాకవి తన ‘దశకుమార చరిత్ర ‘చరిత్ర లో వర్ణించిన ‘ఆంధ్రనగరం’ విశాఖజిల్లా రాయవరం మండలం లో గల నేటి సర్వసిద్దియే కావచ్చునని స్థానికచరిత్ర కారులు కొందరు భావించారు.కాని దానికి ఎటువంటి ఆధారాలు లేనందువలన ఆ అభిప్రాయాన్ని సమర్దించడం సాధ్యం కాదు.
చారిత్రిక యుగాల్లో ఈ ప్రాంతంలో ప్రసిద్దికెక్కిన ప్రముఖ వాణిజ్య రేవుపట్నం ‘దివ్వెల’లేక ‘దివ్యల’ యే నేడు యలమంచిలికి నాలుగు కి.మీ. దూరంలో చిన్న గ్రామమైన దిమిలి. కళింగదేశాన్ని పాలించిన తూర్పచాళుక్యరాజుల శాసనాలలో ఎలమంచిలి కి రెండున్నర మైళ్ళదూరంలో ”దిమిలి” అనే ప్రాచీన ఓడరేవు కలదని, బంగాళాఖాతంలో ప్రయాణంచేసే ఓడల రాక పోకలకు గుర్తు తెలియడం కోసం ఇక్కడ పెద్ద దీప స్తంభాలు ఉండేవని, నౌకలకు సంకేతం సూచికంగా ఎత్తైన దీప స్తంబాలపై దివ్వెలనుపయోగించుటచే ఈప్రదేశానికి ‘దివ్వెల’ అను పేరు వచ్చిందని చరిత్ర ధ్రువపరుస్తోంది. రేవుపట్నానికి సంబందించిన చిహ్నాలన్నీ కాల గతిలో నశించి పోయినప్పటికీ ఆనాడు సముద్రయానానికి ముందు వ్యాపారులుచేత ఆరాధించబడే దైవం”రత్నాకరస్వామి” ఆలయం నేటికి దిమిలి సమీపాన గల తెరువుపల్లి గ్రామంలో ఉంది

ఈ విధంగా చరిత్రపుటల్లో వేరువేరు కాలాల్లో ఈప్రాంతం ప్రస్తావనకు వచ్చినప్పటికి దీనికొక ప్రాముఖ్యతను, విశిష్టతను చేకూర్చిన ఘనత ఆంధ్రదేశాన్నిసుదీర్గకాలం పాలించిన చాళుక్యువంశస్తులకే దక్కుతుంది. యలమంచిలికి సమీపంలో సుమారు 10 కి.మీ. దూరంలోనున్న’సర్వసిద్ది’ని తొలి వేంగీచాళుక్య రాజైన కుబ్జవిష్ణువర్ధనుని పేరిట అతని కుమారుడైన జయసింహవల్లభుడు క్రీ.శ 615-633 సం.లో నిర్మించి ఉంటాడని చరిత్రకారులు భావిస్తున్నారు. జయసింహవల్లభునికి ‘విషయసిద్ది’ మరియు ’సర్వసిద్ది’ అనే బిరుదులు కలవు. ఇతడే ఎలమంచిలి కి ఐదున్నర మైళ్ళ దూరాన్న నున్న కోటను జయించి దానికి తన బిరుదు ఇవ్వడంగాని లేదా అక్కడ కొత్త నగరాన్ని నిర్మిచి ఉండవచ్చు. సర్వసిద్ది బిరుడుగల జయసింహుని కాలం నుంచి వేంగీచాళుక్యులు ఈ ప్రాంతమంతా పాలించారు. దండి మహాకవి దశకుమార చరిత్రలో వర్ణించిన ‘ఆంధ్రనగరం’ నేటి సర్వసిద్ది అని చరిత్ర కారుల అభిప్రాయం. రాజ్యాధికారానికై తరచూ జరిగే అంతహకలహాలలో యలమంచిలి ఒక సురక్షిత స్థావరంగా రూపొందినది. వేంగీ సామ్రాజ్యాన్నికొద్దికాలం పాటు నిల్పుకొన్న కొక్కిలి విక్రమాదిత్యుడు దాయాదుల కలహాల్లో వేంగీ రాజ్యాన్ని పోగొట్టుకొని భౌగోళికంగా సురక్షిత ప్రదేశం కావడాన్ని బట్టి మధ్యమ కళింగలోని ఈ ఎలమంచిలి ప్రాంతానికితరలి వచ్చి తలదాచుకోవడం జరిగింది. అతని వారసులు ఈ ప్రాంతాన్ని నాలుగు తరాలపాటు పాలించినట్లు ముంజేరు తామ్రపత్ర శాసనాలు తెలుపుతున్నప్పటికి ఈ ప్రాంత చరిత్ర పై వారి ప్రభావం అంతగా కనబడుట లేదు. . కాని ప్రజలు చెప్పుకొనే వృత్తాంతాన్ని బట్టి ఎలమంచిలి ప్రక్కనే ఉన్న ‘కొక్కిరాపల్లి అగ్రహారం ‘ కొక్కిలి విక్రమాదిత్యునిచే నిర్మితమైనది అని గుర్తించగలం. ఇప్పటికి ఈ ప్రాంత గొల్లసుద్దులో కొక్కిలి రాజు ప్రస్తావన వినిపిస్తుంది. కళింగ పాలకులైన పూర్వగంగరాజులు ఈ కొక్కిలిరాజు వారసుల నుంచి ఈ ప్రాంతాన్ని స్వాధీన పరచుకోవడం, తిరిగి గుణగ విజయాదిత్యుని కాలంలో చాళుక్యరాజులు మరల యలమంచిలి సీమను ఆక్రమించుకొని ‘త్రికళింగాధిపతులమని’ ప్రకటించుకోవడం లాంటివి ఈప్రాంతపు అస్తిర రాజకీయ స్థితిని చూపే చారిత్రిక వాస్తవాలు. ప్రధమ చాళుక్యభీముని కసింకోట శాసనంలో ప్రస్తావించబడిన విషయాన్ని బట్టి క్రీ.శ. తొమ్మిది, పది శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని ‘ఎలమంచి కళింగదేశ’ ,’దేవ రాష్ట్రవిషయ’ లేక ’దేవరాష్ట్రం’ అని పిలిచేవారని తెలుస్తున్నది.. ఏడవ విజయాదిత్యుని శాసనం ఒకటి యలమంచిలి లోనే దొరకడం వల్ల వారిపాలన చివర వరకూ కొనసాగినట్లు తెలుస్తున్నది.

మహోజ్వల వేంగీచాళుక్యు సామ్రాజ్యం అంతరిచిన అనంతరం తెలుగునాట రాజకీయ పరిస్తితులలోర్పడిన అనేక మార్పుల ప్రభావం ఎలమంచిలి నగరం పై కూడా కానవస్తున్నాయి. ద్రాక్షారామం లో క్రీ.శ 1156 నాటి ఒక శాసనాన్ని బట్టి వెలనాటి ప్రభువులు దక్షిణ కాళింగాన్ని జయించేరు. వెలనాటి గొంకరాజు పక్షాన్న నిలిచి, వారికి మంత్రి గా నున్న నండూరి కొమ్మానామాత్యుడు యలమంచిలి ని రాజధాని కావించుకొని దక్షిణ కాళింగాన్ని పరిపాలించేడు. నండూరి కొమ్మనామాత్యుడు ఎలమంచిలి, చోడవరం, శ్రీకూర్మం తదితరి ప్రాంతాలలో 32 వైష్ణవాలయాలను నిర్మించినట్లు ‘కేయురబాహుచరిత్ర’ చెపుతోంది.
యలమంచిలి బస్సు స్టాండ్ దగ్గర ‘ కొమ్మయ్యగుండం’ అను పూడుకు పోయిన చెరువు వద్ద శిధిలావస్త లో నున్నకొమ్మనామాత్యుని విజయ మండపం

img001
నేడు, ఎలమంచిలి ‘వేణుగోపాలస్వామి’ఆలయం, బస్సుస్టాండు ప్రక్కన ఉన్న ’కొమ్మయ్యగుండం’ అనే మంచినీటిచెరువు కొమ్మనామాత్యుడు నిర్మించినవే. కొమ్మయ్యగుండం వద్ద నేటికి చెక్కు చెదరక నున్నమండపంలో కుమారస్వామి ఆలయం ఉండేది. ఆరున్నర అడుగుల నిడివి గల అపురూపమైన శ్రీ కుమారస్వామి విగ్రహాన్ని పురావస్తు శాఖవారు తరలిస్తుంటే గ్రామస్తులు అడ్డుకొని ఆ విగ్రహాన్ని శ్రీ వీరభద్రస్వామి గుడి లో ప్రతిస్ఠాపించేరు.
మొత్తం మీద సింహాచలం నుండి గోదావరినది ఉత్తర తీరం వరకు గల దేశం పై ఆధిపత్యము కొరకు కళింగాధిపతులకు, వేంగీదేశ పాలకులకు తరచూ కలహాలు జరుగుతుండేవి. ఎవరికి వారే యలమంచిలి ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించేవారు.
అయితే ఎన్ని వంశాలు వచ్చి పోయినా ఎలమంచిలి నగరానికి రాజకీయంగా స్వయంప్రతిపత్తి 13 శతాబ్ది తొలిదశ వరకు ఏర్పడలేదు. ఈప్రాంతాన్ని సాంస్కృతికంగా , ఆర్దికంగా సుసంపన్నం చేసిన ఘనత ‘ఎలమంచిలి చాళుక్యరాజులకు’ దక్కుతుంది. వేంగీచాళుక్య వారసులమని చెప్పుకొనే ఈ వంశస్తులు ఎలమంచిలిని తమ ఇంటిపేరుగా మార్చుకొని క్రీ||శ|| 13వ శతాబ్ది ప్రారంభం నుండి 16వ శతాబ్ది ద్వితీయార్దం వరకు ఎలమంచిలి, సర్వసిద్ది ప్రాంతాలను పరిపాలించినట్లు పంచదార్ల, సింహాచల శాసనాలు, కావ్యాలంకార చూడామణి అనే గ్రంధం తెలియజేస్తున్నాయి. క్రీ.శ 1402 లో పంచదార్ల వద్ద జరిగిన యుద్ధంలో వీరు గంగరాజుల తోడ్పాటుతో తెలుగు చోడుల తోనూ, కొప్పుల పతులతో తలపడడం జరిగింది. తెలుగుచోళులు, వెలమ నాయకులు, కళింగ గజపతుల వత్తిడుల మద్య మాండలిక పాలకులుగా ఈ ప్రాంతంలో తమ ఆధిక్యతను కాపాడుకొంటూ ‘ఎలమంచిలి చాలుక్యరాజులు’ చూపిన నేర్పు ప్రశంనీయము. వరహానది నుండి సింహాచలం వరకు వీరి ఆధీనంలో ఉండేది.
ఈ పాలకుల్లో ఎర్రమనాయకుడు , ఉపేంద్రదేవ, విశ్వేశ్వరదేవ, నృసింహదేవులు ప్రముఖులు. వీరు తమ పేర్లు కలసివచ్చేలా ఊరిపేర్లు పెట్టడం విశేషం. కొప్పరాజునారయణుని పేర ‘కొప్పాక’ ఉపేంద్రుని పేర’ఉప్మాక’ ఎర్రమనాయకుడి పేర ’ఎర్రవరం’ అతని భార్య సింగమాంబ పేరిట సింగవరం ,హరినరేంద్రుని పేర ‘హరిపాలెం’ వెలిశాయి. వీరు తెలుగు భాషకు ఉన్నతమైన సేవలందించారు. తెలుగులో మొదటిసారిగా ఛందోగ్రంధాలను, శాస్త్రగ్రంధాలను అందించారు. దోనయామాత్య కవి’సస్యానంద’అనేగ్రంధాన్ని, విన్నకోట పెద్దయ ’కావ్యాలంకార చూడామణి’ అనే ఛందోగ్రంధాన్ని రచించి యలమంచిలి ప్రాంతానికి ఒక విశిష్టతను చేకూర్చారు. ఎలమంచిలి చాళుక్యుల ఆద్వర్యంలోనే పంచదార్ల వద్దనున్న ‘ధర్మలింగేశ్వరాలయం’అనే ప్రసిద్ద శైవక్షేత్రం వెలిసింది. 16వ శతాబ్ది చివరలో చింతపల్లి ముస్లింలతో జరిగిన దారుణ యుద్ధం లో చాళుక్యులు ఓడిపోవడంతో ఈప్రాంతం ముస్లిం రాజుల పాలనలోకొచ్చింది. యలమంచిలి చరిత్రకు సాక్షీభూతంగా పంచదార్ల ధర్మలింగేశ్వరఆలయం, యలమంచిలివీరభద్రస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాల గోడల్లోనిక్షిప్తమైన అనేక శాసనాలు నేటికి కానవస్తాయి.
యలమంచిలి దగ్గరనున్న సర్వసిద్దిని యాదవ రాజులు పాలించేవారని విశాఖపట్నం గెజిటీర్లు తెలియజేస్తున్నాయి. వేణుగోపాలస్వామిఆలయానికి సమీపాన ఉన్న వీరన్న కొండశిఖరం మీద పెద్ద రాతి ద్వారం ఒకటి ఉండేది.పిడుగుపాటుకు అది ధ్వంసంఅయినట్లు చెపుతారు. . స్థానికులు దానిని ‘యాదవరాజుల’ కథలలో చెప్పబడే కాటమరాజు చెల్లెలైన “నూకిపాప” మేడశిధిలాలు గా పేర్కొంటారు. కాటమరాజు గురించి చెప్పబడిన జానపద గాధలలో అతని కుమార్తె నూకిపాప ఒక దుష్టనక్షత్రాన్న పుట్టినందువలన ,ఆమె దుష్టజాతకం కారణంగా సంభవించబోయే అరిష్టాలను నివారించడానికి ఆమెను ఒక ఒంటి స్తంభం మేడ కట్టించి అందులో వుంచినట్టు కాటమరాజు కధలు తెల్పుతున్నాయి. కాని అక్కడ ఉన్న నంది విగ్రహపు శిథిలాన్ని, అక్కడ ఉండే గుండ్రాయి మీద చెక్కబడ్డ 11 వ శతాబ్దపు చాళుక్య విజయాదిత్యుని చే సమర్పించ బడిన దానాన్ని సూచించే శాసనాన్ని బట్టి, నంది శిదిలాన్నిబట్టి అది ఒక శివాలయం అని తెలుస్తోంది.కనుక ఆకొండ పై అనేక శిధిలాలను బట్టి అక్కడ ఒకనాడు ఉండే ముఖద్వారం ఒక శివాలయ ముఖద్వారమే తప్ప కొందరనుకొనే ‘నూకిపాప మేడ’ శిధిలం కానేకాదని కొందరు పరిశోధకులు

IMG_20151114_122546

భాస్తున్నారు.ఈమధ్య ఇక్కడ రెండు అడుగులపొడవుగల పురాతన వెంకటేశ్వరస్వామి విగ్రహం బయట పడినట్టు స్తానికులు చెపుతున్నారు. కాని ఆవిగ్రహం అక్కడ ఉండే రాళ్ళను పోలక నల్లజనపరాతి తో చేయబడి ఉన్నది. అందువల్ల దాని ప్రాచీనతను పురావస్తు శాఖవారు నిర్దారించ వలసి ఉన్నది.


ఐరోపా వారు భారతదేశానికి వచ్చిన తర్వాత 18వ శతాబ్దం లో జరిగిన ఫ్రెంచ్- ఆంగ్లేయ యుద్దాలలో ఫ్రెంచివారు ఓడిపోవడంతో విశాఖపట్నం జిల్లా ఈస్టిండియా కంపెనీ వశమయింది. డచ్ వారు నిర్మిచిన కట్టడాలు ఉండడంవల్ల వారి ఉనికి కూడా ఇక్కడ ఉన్నట్లు అర్ధమవుతోంది. . బ్రిటిష్ వారి సర్కార్ జిల్లాలో ఒకటైన విశాఖపట్నం జిల్లా, గంజాం నుండి తాండవనది(పాయకరావుపేట) వరకు విస్తరించి ఉండేది. అప్పటి విశాఖపట్నం జిల్లా లో నేడు యలమంచిలి తాలూకా గా పిలువబడుతున్న ప్రాంతమంతా నాడు సర్వసిద్ది తాలూకా గా పిలువ బడేది.

మొదటి ప్రపంచయుద్దం 1914 నుండి 1918 వరకు జరిగింది.యుద్దంలొ బ్రిటన్,ఫ్రాన్స్,అమెరికా,రష్యా,ఇటలీ,రుమెనియా లు మిత్రరాజ్యాల కూటమిగాను, జర్మని,ఆస్ట్రియా,హంగరీ,టర్కీ,బల్గెరియా మొదలగునవి కెంద్రరాజ్యల కూటమి గాను యుద్దం లొ పాల్గొన్నాయి.యుద్దం లొ కేంద్రరాజ్యాల కూతమి ఓడిపొయి,మిత్ర రాజ్యాల కూటమి గెలిచింది.యుద్దం లొ 90 లక్షలమంది చనిపొగా, 130 లక్షల్త మంది గాయపడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యం లో భాగం గా భారతీయ సైనికులు కూడ పాల్గొన్నారు. ఎలమంచిలి నుండి 202 మంది సైనికులు పాల్గొని వీరొచితంగా పోరాడారు.ల్అ

IMG_20150820_112204

మొదటి ప్రపంచయుద్ధం (1914 – 1919 ) లో యలమంచిలి గ్రామస్తులు 202 మంది పాల్గొన్నట్టు యలమచిలి తహసిల్దార్ కార్యాలయానికి అతికించి ఉన్న శిలాఫలకం తెలియ జేస్తున్నది.

విశాఖపట్నం జిల్లా ,నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ లోని అతిపెద్ద తాలూకా అయిన యలమంచిలి తాలూకాను 1970 లోయలమంచిలి మరియు నక్కపల్లి తాలూకాలు గాను మరల 1984 లోయలమంచిలి తాలూకాను యలమంచిలి, అచ్యుతాపురం ,రాంబిల్లి మరియు ఎస్. రాయవరం మండలాలు గా విభజించుట జరిగినది.

4. స్వాతంత్ర్యోద్యమంలో ఎలమంచిలి 

లిGandhiji

జాతి,మత,ప్రాంతీయ,భాషా భేదాలులేకుండా దేశ ప్రజలందరినీ ఇక్యపరచి అందులో పాల్గోనేటట్టు చేసిన ఏకైక ఉద్యమం భారత స్వాతంత్ర్యోద్యమం.1857 సిపాయల తిరుగుబాటు తొ ప్రారంభమైన జాతీయోద్యమం భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన ముందుకు సాగింది. భారత జాతీయ కాంగ్రెస్ సారధ్యం లో సాగిన ఉద్యమాన్ని మూడు దశలు గా విభజించవచ్చు. అవి 1885 నుండి 1905 వరకు మితవాద దశ – అంటే కాంగ్రెస్ పార్టీకి దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్ర నాద్ బెనర్జీ, గోవిందరనడే వంటి మితవాదులు నాయకత్వం వహించిన మొదటి దశ. 1905 నుంచి 1920 వరకు అతివాదదశ. బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, బిపించంద్రపాల్, అనీబిసెంట్ వంటివారు వాయకత్వంవహించి ‘హోంరూల్’ వంటి ఉద్యమాలతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం. మూడవది 1920 నుండి 1947వరకు జరిగిన దశను గాంధీజీ యుగం గా పిలుస్తాము.
గాంధీజీ అహింస, సత్యాగ్రహమనే ఆయుధాలతో 1920 లో సహాయనిరాకరణ ఉద్యమాన్ని, 1930 లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని(ఉప్పుసత్యాగ్రహం), 1942లో ‘క్విట్ఇండియా’ ఉద్యమానికి పిలుపువిచ్చారు.గాంధీజీ పిలుపు మేరకు వలస పాలననుండి దేశాన్ని విముక్తి చేసే ఉద్యమంలో పలువురు విశాఖ వాసులతో పాటు అనేకమంది యలమంచిలి ప్రాంతవాసులు కూడా వివిధ దశలలో స్వాతంత్రోద్యమంలో తుదివరకూ పాల్గొని తమ దేశభక్తి ని చాటు కొన్నారు. వారిలో స్త్రీలు కూడా ఉండడం విశేషం.

సహాయ నిరాకరణ ఉద్యమం:
గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమం(1920 ఆగస్ట్ 1) పట్ల ప్రేరితుడయిన విశాఖజిల్లా పాండ్రంగి గ్రామం లో జన్మిచిన అల్లూరి సీతారామరాజు (1897-1923) విశాఖ,తూర్పుగోదావరి జిల్లాలో మన్యం ప్రజలు దారుణం గా దోపిడీ అవుతున్న విధానాన్ని, బ్రిటిష్ వారి నిర్భంద అటవీ చట్టాలకు వ్యతిరేకం గా వారినికూడగట్టి, గెరిల్లా పోరాట తరహాలో పోలీస్ స్టేషన్ల పై సాయుధ దాడులను నిర్వహిస్తూ బ్రిటిష్ వారిని గడగడలాడించి వారితుపాకీ గుళ్ళకు నేలకొరిగిన విప్లవ జ్యోతి అల్లూరి.
ఇరువాడకు చెందిన పేరిచర్ల సూర్యనారాయణ (అగ్గిరాజు) అల్లూరి సీతారామరాజు అనుయాయునిగా మన్యం తిరుగుబాటులో పాల్గొని శేషజీవితం మాడుగుల మండలం ఎం.కోడూరులో గడిపి తుదిశ్వాస విడిచారు.
శాసనోల్లంఘనఉద్యమం :
గాంధీజీ , ప్రఖ్యాత( 1930 మార్చ్12) దండి యాత్ర పర్యవసావనంగా లక్షలాది బారతీయులు ఉప్పు చట్టాన్నివుల్లంఘిస్తూ ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. బందులు ,హర్తాళ్ళ, విదేశీ వస్తువుల బహిష్కరణ వంటి ఉద్యమాలతో దేశం ఆట్టుడుడికి పోయింది.ఎలమంచిలికి చెందినఅనేక మంది యువతీయువకులు ఉప్పుసత్యాగ్రహం లో చురుకుగా పాల్గొని లాటీదెబ్బలు తిని ,జైలు శిక్షల ననుభవించేరు. వారు:
శ్రీ మంతా అనంతరావు: మంతా సూరయ్య కుమారులు, దిమిలి వాస్తవ్యులు.
శ్రీ సేనాపతి అప్పలనాయుడు: ఆదెప్ప కుమాడుడు, దిమిలి వాస్తవ్యుడు
శ్రీ యళ్ళాయి అప్పల నరసింహం: లక్ష్మినారాయణ కుమారుడు. దిమిలి వాస్తవ్యులు.క్విట్ ఇండియా ఉద్యమం లో కూడా కారాగార నిర్భందితుడు .
శ్రీ కాలనాధభట్ల జగన్నాధ చైనులు: జోగారావుగారి కుమారుడు. సర్వసిద్ది నివాసి.1930,1932,1941ల లో జైలు జీవితాన్ని గడిపారు.
శ్రీమతి మిస్సుల లక్ష్మీ నరసమ్మ: దిమిలి నివాసి. మిస్సుల వీరవెంకట సత్యన్నారాయణ గారి భార్య. 6 నెలలు జైలు శిక్షననుభవించారు.
శ్రీమతి శిష్ట్లా లింగమ్మ: దిమిలి వాసి వెంకన్న గారిభార్య.6 నెలలు కారాగారవాసి.
శ్రీమతి కాలనాధభట్ల మహాలక్ష్మమ్మ: జోగారావు గారిభార్య. దిమిలి వాసి.
శ్రీమతి గాదె నారాయణమ్మ: మంగవరం వాసి. పేర్రాజు గారిభార్య. క్విట్ ఇండియా ఉగ్యమం లో కూడా పాలుపంచుకొన్నారు.
శ్రీ యళ్ళాయి నారాయణ రావు: సూర్యనారాయణ గారికుమారుడు. బెర్హంపూర్ కారాగార నిర్భం దితుడు.
శ్రీ సిగిరెడ్డి పోతన్న: దిమిలి వాసి సిగిరెడ్డి సన్యాసి గారికుమారుడు.
శ్రీ మారేమల్లి రామచంద్ర శాస్త్రి : శ్రీ రాములుగారి కుమారుడు.1930,1932లలో బెర్హంపూర్లో జైలు నిర్భందితుడు.
శ్రీ శిష్ట్లా రామదాసు: తామ్రపత్రగాహీత. క్విట్ ఇండియా ఉద్యమం లో కూడా పాల్గొన్నారు.
శ్రీ ఇంద్రగంటి కామేశ్వర రావు: పెనుగొల్లు నివాసి రామచంద్రుడు గారి కుమారుడు.
శ్రీ కాకర్లపూడి పాయక రావు: తామ్రపత్ర గ్రహీత సత్యవరానికి చెందిన కాకర్లపూడి పాయకరావు అండమాను జైలులో శిక్ష ననుభవించి అసువులు బాసిన అమరజీవి.

క్విట్ ఇండియా ఉద్యమం :
బ్రిటిష్ వారు రెండవ ప్రపంచ యుద్ధంలో తలమునకలుగా ఉండి వారికి తమదేశరక్షణే ప్రశ్నార్ధకంగా ఉన్నందువల్ల, స్వాతంత్ర సముపార్జజన కిదే తరుణమని ,బ్రిటిష్ వారితో చావో రేవో తేల్చుకొనేందుకు 1942 ఆగస్టు 8న భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రాత్మక ‘క్విట్ ఇండియా’ తీర్మానంచేసి దాని అమలుకు గాంధీజీ కి నాయకత్వ భాద్యత అప్పగించింది. బ్రిటిష్ వారి దమనకాండ నెదిరించే సందర్భం లో కొన్ని చోట్ల హింసాయుత సంఘటనలు చోటుచేసుకొన్నాయి.వేలాదిమంది నిర్భందించ బడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమంలోపాల్గొని కారాగార వాసాన్ని అనుభవించిన యలమంచిలి ప్రాంత స్వాతంత్రసమరయోధులుఅనేకమంది. వీరిలో కొందరు 1930 లో జరిగిన శాసనోల్లంఘనఉద్యమం లోపాల్గొన్నవారుకూడా ఉన్నారు.

శ్రీ యళ్ళాయి అప్పల నరసింహం: దిమిలి వాసి. ఉప్పు సత్యాగ్రహం లో కూడా కారాగార వాసాన్ని అనుభవించారు.
శ్రీ తోట చిట్టబ్బాయి ఉరఫ్ మరిడయ్య; గుంటపల్లి వాసి కొండలరాజు గారికుమారుడు.
శ్రీ శిష్ట్లా కామేశ్వరరావు; వెంకన్న గారికుమారుడు.దిమిలి వాసి.1942,1944లలో కారాగారి వాసి.
శ్రీ శిష్ట్లా లక్ష్మి నరసమ్మ: దిమిలి వాసి .స్వాతంత్ర సమరయోధుడుశ్రీ శిష్ట్లా పురుషోత్తం గారి భార్య.
శ్రీ గాదె నారాయణమ్మ: మంగవరం నివాసి. శాసనోల్లంఘన ఉద్యమం లో కూడా పాల్గొన్నారు.
శ్రీ మిస్సుల నారాయణ మోహన్ దాసు: మిస్సుల వీరవెంకట సత్యనారాయణ గారి భార్య.
శ్రీ శిష్ట్లా రామదాసు: ఉప్పు సత్యాగ్రహం లో కూడా జైలు నిర్భందితులు.
శ్రీ మిస్సుల చిరంజీవి: దిమిలికి చెందిన మిస్సుల చిరంజీవి జిల్లాలో మొదటి స్వాతంత్ర్యోద్యమ సత్యాగ్రహి. రాష్ట్రపతి వి.వి.గిరి, తెన్నేటి విశ్వనాథంలతో కలసి స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
శ్రీ డబ్బీరు శచీపతి రావు: దిమిలి వాస్తవ్యులు

IMG_20150905_135149

దిమిలి గ్రామం లో శిలాఫలకం పై నమోదు చేయబడ్డ స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు:

1)సర్వ శ్రీ కాలనాధభట్ల జగన్నాధ చయనులు,2) శ్రీ శిష్ట్లా పురుషోత్తం,3) శ్రీయల్లాయి అప్పలనరశింహం,4) శ్రీ సేనాపతి అప్పలనాయుడు,5) శ్రీ శిస్ట్లా రామదాసు,6) శ్రీ నేమాని సత్యనారాయణ,7) శ్రీ ఇంద్రగంటి కామేశ్వరరావు,8) శ్రీమతి శిష్ట్లా శ్యామసుందరమ్మ.9) శ్రీ చిట్రాజు సోమరాజు,10) శ్రీమతి గాదె నారాయణమ్మ,11) శ్రీ వడ్డాది సీతారామాంజనేయకవి
12) శ్రీ శిష్ట్లా కామేశ్వరరావు,13) నం. 626767 సిపాయి షేక్ మౌలా,14) నం. 1218563 L/NK డి.సూర్యనారాయణరావు,15) శ్రీ. యం. సూర్యనారాయణమూర్తి.

5. ఆర్దిక స్థితి గతులు

వ్యవసాయ రంగం :

Agriculture
మండలం లో 70% మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం మరియు పాడి పశువుల పెంపకం. మండలం పూర్తిగా వర్షాధారిత ప్రాంతం. సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం కారణంగా నైరుతి ఋతుపవనాల వల్ల 72% వర్షపాతం, ఈశాన్యరుతుపవనాల వల్ల 13% వర్షపాతాన్ని మండలం పొందుతున్నది. వార్షిక సరాసరి వర్షపాతం 1200 మి.మీగా నమోదు అవుతున్నది. నేలలు వదులుగా ఉండే ఎర్ర మట్టినేలలు. ఇసుక పాలు ఎక్కువ. నీరు ఇంకి పోయే స్వభావం కలవి. మె ట్ట భూములు ఎక్కువ. పంటపొలాల విస్తీర్ణం 6842 హెక్టార్లు. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా చిట్టడవి గా ఉండేది. ఇప్పటికి పెదపల్లి ప్రాంతం లో 365 హెక్టార్ల విస్తీర్ణం గల అడవి కలదు. వరి, చెరుకు ఇక్కడి ప్రధాన పంటలు. జనాభాలో 70% వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. .రైతాంగమంతా చిన్నకతాలు కలిగిన సన్నకారు రైతులే. వర్షాభావం, కూలీ రేట్లు పెరగడం,విత్తనాలు,క్రిమిసంహారక మందులు ఖరీదు పెరగడంవల్ల వ్యవసాయం గిట్టుబాటుకావటడంలేదు., ఈ ఊరు రైలు,రోడ్డు మార్గాలు కలిగి విశాఖపట్నానికి దగ్గరలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గిరాకీ పెరిగి అనేక గ్రామాలలో రియల్ ఎస్టేటు వ్యాపారం జోరుగా సాగుతున్నది. అందువల్ల ప్రతిసంవత్సరం కొన్నివందల ఎకరాల సాగు భూమి తరిగిపోతున్నది.
వ్యవసాయానికి చెరువులు, బావులు ఉపయోగిస్తారు. వర్షపాతం ఎక్కువగా ఉంటే యలమంచిలి ని ఆనుకొని 90 ఎకరాలు విస్తీర్ణం లో వ్యాపించి ఉన్న పెంజెరువు, పురుషోత్తమపురం గ్రామం వద్దకల తాళ్ళమ్మ చెరువు క్రింద ఉన్నపంట పొలాలకు సాగునీరు అందిస్తాయి. మండలం లో కొన్ని గ్రామాలను ఆనుకొని వరాహ, మేజర్ శారదా నదులు ప్రవహిస్తునప్పటికి అవి వర్షా కాలంలో మాత్రమే ప్రవహిస్తాయి. మేజర్ శారదయొక్క జంపపాలెం గ్రోయన్ వల్ల సోమలింగాపాలెం, కొత్తూరు పరిసర ఏడు గ్రామాలకు, వరాహనది వల్ల ఏటికొప్పాక పరిసర ఇదు గ్రామాలకు సాగు నీరు లభిస్తున్నది.పెదపల్లి లో శేషుగెడ్డకు చెక్ డ్యాం నిర్మించినప్పటికీ, డిజైన్ లోపం వల్ల అది నిరుపయోగమైంది. మండలం లో 10 సాగునీటి సంఘాలు వున్నాయి.

ఖరీఫ్ సీజన్‌లో పల్లపుభూములలో ఆహార పంటగా వరి పండిస్తారు. వాణిజ్యపంటగా చెరకు వేస్తారు. కొన్ని గ్రామాలలో పొగాకు పండిస్తారు. మెట్టభూముల్లో చోళ్ళు (రాగులు) గంటెలు, మినుములు, పెసలు, కందులు నువ్వులు, వేరుశనగ పంటలు వేస్తారు. మిరప, పంటలు అక్కడక్కడ కనిపిస్తాయి. వంగ, బీర,బెండ టమోటా, వంటి కూరగాయలను, తోటకూర, గోంగూర,పాలకూర కొత్తిమీర పెదపల్లి, గోకివాడ,కొక్కిరాపల్లి, మంత్రిపాలెంవంటి పరిసర గ్రామాలలో పండిస్తున్నారు. మామిడి,జీడిమామిడి,కొబ్బరి, అరటి తోటలు కూడా ఉన్నాయి మండలంలోని కొక్కిరాపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుత్వం వారి “నూనె గింజల” పరిశోధనాకేంద్రం ఉన్నది. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుభందమైన ఈ కేంద్రంలో నువ్వు విత్తనాల పై పరిశోధనలు జరుగుతున్నాయి.
రైతులకు వ్యవసాయం తర్వాత ప్రధాన ఆదాయ వనరు గేదెలు,ఆవుల పెంపకం ద్వారా పాల ఉత్పత్తి. విశాఖడైరీ వారి పాల సేకరణ కేంద్రాలు ప్రతిగామం లో ఉన్నాయి విశాఖడైరీ వారు పాల ఉత్పత్తిదారులకు ఆర్దిక సహాయం తో పాటు విధ్యా, వైద్య సౌకర్యాలను, ఇతర సంక్షేమకార్యక్రమాలను అమలుచేస్తూ, జిల్లాలోను, మండలంలోను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు ఆర్ధిక సహకారాన్ని అందిస్తునారు. చిన్నస్థాయి పౌల్ట్రీ పరిశ్రమలున్నాయి. తరచు సంభవించే వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలకు గ్యారంటీ లేదు. ఇక్కడ రైతాంగం గోదావరి నది పై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు (ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ )పై గంపెడాశ తో ఉన్నారు. పోలవరం ఎడమ కాలువ యలమంచిలి మీదుగా విశాఖపట్నం వెళుతున్నది. దివంగత ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి ‘జల యజ్ఞం’కార్యక్రమం లో పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోయినా ఎడమ కాలవ త్రవ్వడంపూర్తయింది. పోలవరంప్రాజెక్ట్ పూర్తయితే ఈ మండలమంతా సశ్యశ్యామలం అవుతుంది. పట్టణానికి త్రాగునీటి సమస్యకూడా తీరుతుంది. అంత వరకు దీనిని కరవు మండలం గానే పరిగణించాలి. యలమంచిలి లో ప్రతి గురువారం జరిగే సంత ,పశువుల సంతలు యలమంచిలి గ్రామీణ స్వభావాన్ని తెలియజేస్తున్నాయి.

పారిశ్రామిక రంగం :
మండలంలో చెప్పుకోతగిన పరిశ్రమలేవీ లేవు. మండలంలో ఏటి కొప్పాక గ్రామంలో సహకార చక్కెర కర్మాగారం 1933 సం.లో ఏర్పాటయింది. ఇది రాష్ట్రం లో సహకారరంగంలో ఏర్పడిన మొట్టమొదటి చక్కెర కర్మాగారం. రేగుపాలెం వద్ద 2009 లో సిమెంట్ కర్మాగారం ఏర్పాటయింది. యలమంచిలికి దగ్గరగా ఉన్న అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్ లో నిర్మించబడిన బ్రాండిక్స్ దుస్తుల కర్మాగారం, మరి కొన్ని పరిశ్రమలు, నక్కపల్లి సమీపాన గల హేటిరో డ్రగ్స్ కొంతమందికి ఉపాది కల్పిస్తున్నాయి. పట్టణంలో చిరువ్యాపారం మినహా వాణిజ్య పరమైన అభివృద్ధి ఏమిలేదు. ప్రక్కనే ఉన్నఅచ్యుతాపురం,నక్కపల్లి లు పారిశ్రామిక వాడలుగా శరవేగం తో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడ మాత్రంఎటువంటి పారిశ్రామిక అభివృద్ధిలేదు. విశాఖపట్నంలో పనిచేసే చిరుద్యోగులు,కొంతమంది పదవీవిరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు ,చుట్టుప్రక్కలనున్న మధ్య తరగతి రైతాగం, యలమంచిలిని తమ నివాస ప్రాంతంగాఎంచుకోవడం వల్ల గృహనిర్మాణ రంగం ముందంజ లోనున్నది.

6.సామాజిక వర్గాలు

విశాఖపట్నం జిల్లాలో 2011మత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో హిందువులు 95.68%, ముస్లింలు 2%,క్రిస్టియన్లు 1.8% ఉన్నారు. మండలం లో కూడా అదే ప్రాతిపదికను ఉంటారు. క్రైస్తవులలో అత్యధికులు మతాంతరీకరణ చెందిన( బి.సి -సి వర్గపు )దళిత కైస్తావులే. మతం మారని దళితులే ఎక్కువగా ఆదివారం చర్చికి వెళుతుంటారు.. ఏసు క్రీస్తుని ఆరాదించే హిందూ కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ముస్లిం మతస్తులు సంఖ్య తక్కువ. వీరు యలమంచిలి తోపాటు రేగుపాలెం గ్రామం లో కొద్ది సంఖ్య లో నున్నారు, వీరంతా బి.సి –B, బి.సి –E వర్గానికి చెందిన సున్నీ ముస్లింలు .భారత దేశం లో హిందూమతం అనేది మతం గాకాక ఒక జీవన విధానం గా పరిగణింప బడుతున్నది.
కులాలు:
సాంప్రదాయక భారతీయ సమాజం యొక్కమూల స్తంభాలలో కులవ్యవస్థ ప్రధానమైనది. ఈ కులవ్యవవస్థకు మూలం వేదకాలం నాటిచాతుర్వర్ణ వ్యవస్థ. చాతుర్వర్ణ వ్యవస్థలోని బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర వర్ణాలు కాలక్రమంలో నాలుగు వేల కులాలుగా మారాయి. కులం యొక్క ముఖ్య లక్షణాలు (1)కులం పుట్టుకతో ఆపాదించ బడుతుంది (2)ఏ కులం వారు ఆ కులం వారినే వివాహం చేసుకోవాలి (3)ప్రతికులానికి ఒక వృత్తి కేటాయించ బడుతుంది. (4) వృత్తినిబట్టి అతని సామాజిక అంతస్తు ఏమిటో తెలుస్తుంది

caste-system-300x213
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎం.ఎన్.శ్రీనివాస్ అభిప్రాయం లో వివిధ కులాల మధ్య గల సంభందాలు శుచి-అశుచి(prurity and pollution) భావన మీద ఆధార పడిఉంటాయి. ఈశుచి –అశుచి అనే భావన ప్రధానంగా మతపరమైనది. గ్రామాల్లో జరిగే మతపరమైన ఉత్సవాల్లో ప్రతి కులానికి ఒక భాద్యత అప్పగిస్తారు. ఉదా: బ్రాహ్మణులు పూజారులు గాను, క్షత్రియులు ఉత్సవాల,దేవాలయాల నిర్వహణ,మంగలి మంగళ వాయిద్యాలు వాయిచడం,చాకలి దేవుడికి పల్లకీ మోయడం, కాగడా వెలిగించి పట్టు కోవడం వంటి విధులు వివిధకులాలు నిర్వహిస్తాయి.ఈ శుచి-అశుచి ఆధారంగానే కొన్ని కులాలు నిర్వహించే విధులు శుబ్రమైనవిగాను,కొన్ని వృత్తులు ఆశుబ్రమైనవిగాను భావిస్తారు. బ్రాహ్మణులు నిర్వహించే పూజారి వృత్తి శుచి అయినదిగాను,అస్పృశ్యులు నివహించే తోళ్ళు శుబ్రపరచడం, చెప్పులు కుట్టడం వంటి పనులు అపరిశుబ్రమైనవిగాను పరిగాణిస్తారు.ఈ కారణం చేత బ్రాహ్మణుల అంతస్తు ఉన్నతమైనది గాను, అస్పృశ్యుల అంతస్తు తక్కువగాను పరిణిస్తారు.
వివిధ కులాలవారు ఒకే గ్రామంలో వేరు వేరు ప్రాంతాలలో వివశి స్తుంటారు. అందుకు నిదర్శనం గా యలమంచిలి లో గవరపేట(తులసినగర్ ప్రాంతం), కుమ్మరవీధి,కోమటిపేట,గొల్లపేట(కాకివానివీధి)చాకలిపేట,యాతపేట,సాలిపేట(ధర్మవరం) హరిజనపేట(ఇందిరాగాంధి కాలనీ),మాదిగపేట(రిక్రియేషన్ క్లబ్ ఏరియా) మొదలగు పేర్లతో వీధులుండడం.
ఇక్కడ కుల రీత్యా ప్రధాన సామాజిక వర్గం కాపులు(తెలగా కాపులు).వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం,పాడిపరిశ్రమ. మండలం మరియు నియోజక వర్గపు స్థాయిలో మెజారిటీ శాతం కాపుకులస్తులే. వీరు ‘ఓ.సి’ కేటగిరి క్రిందకు వస్తారు యలమంచిలి నియోజక వర్గం నుండి గెలుపొందిన ఎం.ఎల్.ఏ లలో ఎక్కువ సార్లు సైతారుపేట, దిమిలి గ్రామాలకు చెందిన కాపు కులస్తులే గెలిచారు. మండలం లో కాపుల తర్వాత గవర కులస్తులు అదిక సంఖ్యలో నున్నారు. వీరు ‘బి.సి – డి’ కేటగిరి క్రిందకు వస్తారు . వీరు వ్యసాయం,పాడిపరిశ్రమల తోబాటు చెరకునుండి బెల్లం తయారీ లో నిపుణులు. గవర కులస్తులలో సంఘీభావం ఎక్కువ.ఎక్కడ ఉన్నా వీరు పరస్పరం సహకరించుకొంటారు. మండలం లోని వ్యవసాయ భూములు ఈ రెండుకులాల వారి యాజమాన్యంలో నున్నాయి. స్వాతంత్ర్యానంతరం భారతదేశం లో రాజకీయాల పై కుల ప్రభావం ఎక్కువగా ఉన్నది. సంఖ్యాబలం , భూయాజమాన్యం ,ఆర్దిక స్థితిగతుల వల్ల మండల, పట్టణ రాజకీయాలలో యీ రెండు సామాజిక వర్గాలే కీలక పాత్ర పోషిస్తుంటాయి. గవరలు ఎన్నికలో ఏపార్టీ తరఫున నిలబడినా తమ కుల అభ్యర్ధుల గెలుపుకే కృషి చేస్తుంటారు. గ్రామ పంచాయితీ గత ఆరు దశాబ్ధాలుగా వీరి ఆధీనం లోనే ఉన్నది.రెండు కులాల వారు వ్యవసాయ రంగం తోపాటు, స్థానిక వ్యాపార రంగం లో కూడా రాణిస్తున్నారు.కాపు కులాన్ని వెనుకబడి కులాలో చేర్చాలనే డిమాండ్ ఉన్నది.
అగ్రకులాలు: రాష్ట్రంలో అగ్రకులాలైన బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యల శాతం 3%, 1.2%, 2.7%, లు గా ఉన్నది. మండలంలోని అన్ని గ్రామలలోనూ అదే శాతంలో వీరు ఉండవచ్చు. జిల్లా లో యలమంచిలి ప్రాంతం నుండి స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులలో అధిక శాతం బ్రాహ్మణులే. ఒకప్పుడు జిల్లా రాజకీయాలలో వీరి వర్గం వారైన శ్రీ భాట్టం శ్రీరామూర్తి, శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ, గుత్తి సర్కార్ లు కొంత ప్రభావాన్ని చూపారు. ఒకప్పుడు వీరు ‘గ్రామ కరణాలు’ గా గ్రామరాజకీయాలలో కీలక పాత్ర పోషించినప్పటికి సంఖ్యాబలం తక్కువ కావడం , గ్రామ కరణాలు, మునసబుల వ్యవస్థరద్దు కావడం వంటి కారణాలవల్ల వీరికి కీలక రాజకీయ పదవులు దక్కడం లేదు. విద్యావంతులైన వీరు ఒకప్పుడు ఉద్యోగాల లో సింహ భాగస్తులుగా ఉండే వారు. పౌరోహిత్యం,అగ్ర వర్ణాల వారికి కర్మకాండలు జరిపించడం నుండి వంటబ్రాహ్మణులు గా పనిచేయడం వంటి అనేక వృత్తులు చేయగలిగిన సామర్ధ్యం కలిగిన వీరు ,అగ్రహారాలు అదృశ్యం కావడం ,విద్యాధికులు పట్టణాలకు వలసపోవడం,విధ్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ సౌకర్యంగల తక్కినకులాల వారి తో పోటీ పడడం వంటి కారణాల వల్ల తమ గత ప్రాభవాన్ని కోల్పోయేరు. అయినప్పటికి తక్కిన కులాలతో పోల్చితే ఉద్యోగాలో వీరి శాతం ఎక్కువే.”బ్రాహ్మణ వాదం” (Brahminism means the religious and social system of orthodox Hinduism,characterized by diversified Pantheism,the caste system and sacrifices and family ceremonies of Hindu tradition) భారతీయ సమాజంలో బలీయం గా ఉన్నది. పట్టణం లో బ్రాహ్మణసేవాసంఘం వారు వేద పాఠశాలను నిర్వహిస్తూ కొంతమంది బ్రాహ్మణ యువకులకు పురోహితులు గా శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.
క్షత్రియులు(రాజులు):ఒకనాడు రాజ్యాలను ఏలినా ప్రస్తుతం అల్ప సంఖ్యాకులు గా నున్నారు. రాంబిల్లి, ఏటికొప్పాక ,లింగారాజుపాలెం వంటి గ్రామాలలో వీరు ఆర్దికంగాను, రాజకీయంగాను ప్రభావాన్ని కలిగి యున్నారు.నియోజకవర్గం లో వీరి సంఖ్యాబలం తక్కువైనా రాంబిల్లి రాజులు స్థానిక ఎం.ఎల్.ఏ లుగా ఇప్పటికి నాలుగు పర్యాయాలు ఎన్నిక కావడం గమనార్హం. ఒకప్పుడు కోటఉరట్ల దగ్గర తంగేడు గ్రామస్తులైన శ్రీ సాగి సూర్యనారాయణ రాజు ఎం.ఎల్ ఏ,మరియు అటవీశాఖామంత్రి గాను ,శ్రీ సాగి సీతారామరాజు చాలాకాలం జిల్లాపరిషత్ చైర్మన్ గా జిల్లాలో రాజకీయాల లో ఒక వెలుగు వెలిగారు. ఇప్పటికి జిల్లా రాజకీయాలలో క్షత్రియులు కొంత ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నారు.
అగ్రవర్ణాలలో మూడవవర్గమైన వైశ్యలు(కోమటులు) అన్ని గ్రామాలలో నున్నారు.యలమంచిలి పరిసర గ్రామాలలో వీరు కిరాణా,వస్త్రవ్యాపారం,గృహోపకరణాలు, మందులదుకాణాలు మొదలగు వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నారు. సాంప్రదాయ వర్తకం స్థానం లో కార్పోరేట్ రంగం ప్రవేశించడం,ఇతర కులాల వారు కూడా వర్తక,వ్యాపారలలోనిమగ్నమవడం వంటి మార్పుల వల్ల వీరు ప్రత్యామ్న్యాయ ఉపాది వనరులపై ద్రుష్టి సారిస్తున్నారు..యలమంచిలి “ఆర్యవైశ్య సఘం’” వారు కన్యకాపరమేశ్వరి ఆలయ పునద్ధరణ ,శ్రీ వాసవీ కళ్యాణమండపం నిర్మాణం , యలమంచిలి మెయిన్ రోడ్డు ప్రక్కన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహ స్థాపన ,స్మశాన వాటిక ఆధునీకరణ మొదలగు కార్యక్రమములు చేపట్టి పట్టణ అభివృద్దికి తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.
యలమంచిలిలో ఇతర ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన రెడ్డి, కమ్మ కుటుంబాలు కొన్ని ఉన్నాయి.అగ్ర కులాలైన భ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య కులాలో చాలామందికి సరియైనఉపాది లేక , తమ ‘కుల గౌరవాన్ని’వదలుకొని కాయ,కష్టంతో కూడుకొన్న పనులు చేయడానికి ముందుకు రాక,ఎటువంటి ప్రభుత్వ పధకాలకు నోచుకోక, కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు.
బి.సి – ఏ వర్గం కులాలు: వెనుకబడిన కులాల సంగతికొస్తే ఇక్కడ బి. సి –ఏ వర్గానికి చెందిన చాకలి(రజక),మంగలి (నాయీ బ్రాహ్మిన్), యాత ,జంగమ, మేదర కులాలవారున్నారు.ఒకప్పుడు చాకలి వారు ఇతర అగ్ర ,వ్యవసాయ కులాల వారి మాసిన,మైల బట్టలు ఉతకడం, స్వయం పోషక ఫ్యూడల్ సమాజం లో భూయజమానులకు వ్యవసాయ పనుల్లో సహాయ పడడం, పెళ్ళిలలో పల్లకీలుమోయడం, భూస్వాములకు సేవ చేయడం, గ్రా మదేవత పండగల్లోమంగలి వారితోపాటు గరగలు మోయడం బలిపశువులను చంపడం ,దివిటీలుపట్టడం వంటి పనులు చేయడం వీరి ధర్మం. వీరి సేవల కు ప్రతిఫలం గా వ్యవసాయదారులు పంటనూర్పిడుల సమయంలో వీరికి కొన్ని బస్తాల ధాన్యం కొలిచి ఇచ్చేవారు.కాలక్రమంలో ధాన్యం ఇవ్వడానికి రైతాంగం ఇష్టపడకపోవడంతో అనేకమంది రజకులు ,పట్టణాలకు వలసపోయి అపార్ట్ మెంట్లలో కాపలాదారులు గాను , లాండ్రీలు పెట్టుకొని జీవిస్తున్నారు,
మంగలి వారి వృత్తి క్షురకర్మతోబాటు భూస్వాములకు వ్యవసాయపనులో స హాయపడడం, వాళ్ళకు వళ్ళు పట్టడం,స్నానాలు చేయించడం,పెళ్లిల్లో శుభలేఖలు తీసుకొనివెళ్లడం,బ్యాండు వాయించడం మొదలుగు పనులు చేసేవారు. చాకలి వారిలాగానే వీరికి కూడా ధాన్యం ముట్టేవి. చాకలి, మంగలులకు భూస్వాములనుండి కొద్దిపాటి భూములు కూడా బహుమతిగా దక్కేవి.వీరు లేకుండా ఎటువంటి శుభకార్యాలుజరిగేవి కావు.ఈ రెండు కులాలు ఒకప్రక్క దమనీయ ఆర్దిక దుస్తితిని ఎదుర్కొంటూ,అగ్రకులాలచేత చిన్నచూపు చూడబడుతూ,సమాజ పరిశుబ్రతకు పాటుపడేవారు.ప్రస్తతం ఈ కులాల యువతరం తమ కులవృత్తికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తునారు. మంగలి కులం వారు కొందరు దేవాలయాలో క్షురకారులు,వాయిజ్యకారులుగాను. ,కొందరు పట్టణాలలో ’హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్లు’ పెట్టుకొని జీవన యాత్ర సాగిస్తున్నారు.వీరికి రాష్ట్ర,జిల్లా స్థాయి లో ఎటువంటి రాజకీయ ప్రాతినిధ్యము లేదు. రిజర్వేషన్ లో వీరికి రావలసిన ఉద్యోగాలను శ్రీకాకుళం జిల్లా లో ఉన్నత స్థాయి లో నున్న కాళింగులు తన్నుకు పోతున్నారు.ఈ రెండు కులాలను షెడ్యూలు తరగతులు గా పరిగణించాలనే డిమాండ్ ఉన్నది.
యాత కులస్తుల ప్రధాన వృత్తి కల్లుగీత,మత్తు పానీయాల తయారీ. తాటిచెట్లు,ఈత చెట్లు తగ్గడం , కల్లుకంటే ఎక్కువమత్తునిచ్చేచౌకరకపు మద్యం విరివిగా లభిస్తున్నందువలన తాటి చెట్ల నుండి కల్లుగీచి అమ్మే ఈ గీత కార్మికులు బ్రతుకుతెరువుకు గండిపడింది. అలాగే తాటాకుతోను. వెదురు బద్దలతోను బుట్టలు, చాపలు, చేటలు అల్లే ‘మేదర’ కులస్తులు ప్లాస్టిక్ చాపలు, బుట్టలు,ఇతర పేకింగ్ సామగ్రి రావడంతో వీరూ వీధినపడ్డారు.
చేతిలో గంటవాయిస్తూ, శంఖం ఊడుకొంటూ ’హర హర మహాదేవ శంభో శంకర’ అంటూశివ నామ స్మరణ చేస్తూ, ఊరూరా తిరుగుతూ భిక్షాటన చేస్తూ, బ్రాహ్మణులకు తప్ప మిగతా కులాలో శైవమతస్తులకు కర్మకాండలు జరిపే ‘జంగమకులం’వారు తమ వృత్తిని పూర్తిగా విడిచిపెట్టేరు.
బి.సి –బి వర్గం కులాలు :

artisans_village04
మహాకవి శ్రీశ్రీ తన ‘మహాప్రస్థానం’ ప్రతిజ్ఞ గేయం లో
“………………………….
త్రిలోకాలలో,త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని …”
చెపుతూ
“కమ్మరికొలిమీ, కుమ్మరి చక్రం ,
జాలరి పగ్గం, సాలెల మగ్గం ,
గొడ్డలి, రంపం ,కొడవలి, నాగలి,
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు –
…..”
గురించి ప్రస్తావించేడు,కాని పారిశ్రామీకరణ,ప్రపంచీకరణ,ప్రైవేటీకరణ,ఉదారీకరణల వల్ల చేతి వృత్తులన్నీఅంతరించే దశకు చేరుకోన్నాయి.
బి.సి-బి ,వారంతా రెక్కాడితేగాని డొక్కాడని చేతి వృత్తుల వారు.ఇక్కడ ప్రధానం గా పద్మశాలి, కంసాలి,కుమ్మరి,తెనుకలి,దూదేకుల వారున్నారు. భాతదేశం లో వ్యవసాయం తర్వాత ప్రధాన వృత్తి చేనేత లేక మగ్గం మీద పడుగు,పేకలతో బట్టలు నేయడం. మానువుని ప్రాధమిక అవసరాలైన తిండి,బట్ట,గృహవసతి లో బట్టలు వేసే కులం సాలి లేక పద్మశాలీలు. వీరు ఈ మండలం లో యలమంచిలి , ఏటికొప్పాక ,పులపర్తి,కృష్ణాపురం,రేగుపాలెం,కొత్తలి,పురుషోత్తపురం,,పెదపల్లి,సైకిళ్ళపాలెం,రామానాయుదిపాలెం,సోమలింగపాలెం,దిమిలి,మూలజంప,కొత్తూరు,మూలకొత్తూరు. లలో ఉన్నారు. యలమంచిలిలో’ చేనేత సహకార పరపతి సంఘం ’ ఉన్నది.
బ్రిటిష్ వారు భారతదేశం లోకి ప్రవేశించక పూర్వం ప్రపంచంలో ఇతరదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేసే దేశాలలో భారతదేం ప్రధానమైనది. బ్రిటిష్ వారు ప్రవేశించి,పారిశ్రామికవిప్లం మొదలైన తర్వాత ’మాంచెస్టర్’ లో మిల్లుల మీద తయారైన వస్త్రాలదిగుమతి ప్రారంభమైనది మొదలు ఇక్కడ చేనేత పరిశ్రమ వడుదుడుకులకు లోనవడం ప్రారంభమైనది. తర్వాత వస్త్రమిల్లులు భారతదేశం లోకి ప్రవేశించాయి.జాతీయోద్యమకాలం లో గాంధీజీ ‘స్వదేశీ ‘ఉద్యమ చిహ్నం గా ‘ఖాదీ ఉద్యమం’సాగింది.కాని స్వాతంత్ర్యానంతరం చేనేతరంగాన్ని బ్రతికించడానికి ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసినా, పైపై రక్షణపధకాలు ఎన్ని చేపట్టినా నేతన్న నేడు కొనఊపిరితో కొట్టిమిట్టాడుతున్నాడు.. వీవర్స్ కోపరేటివ్ సొసైటీ లన్నీ మూతపడ్డాయి.ఈ వృత్తి తో ఇల్లంతా కష్టపడ్డా ఒక పూటకూడా గడవకపోవడం తో మండలం లో ఈ వృత్తి వాళ్ళు తాపీమేస్త్రులు, వేరుశనగఉండలతయారీ మొదలగు పనులతో బ్రతుకు తెరువులకోసం పోరాడుతున్నారు.
ఇక్కడ ఉన్న మరొక బిసి కులం కంసాలి లేక విశ్వబ్రాహ్మణులు. వీరిలో వ్యవసాయదారులకు అవసమైన నాగలి,కాడి,ఎడ్లబండ్లు,ఇళ్ళనిర్మాణానికి కావలసిన తలుపులు,ద్వారబందాలు, కిటికీలు మరియు మంచాలు,కుర్చీలు ఇతర కర్ర సామగ్రిని చేసేవారిని ‘వడ్రంగి’ అని, బంగారం,వెండి తో ఆభరణాలను చేసేవారిని “స్వర్ణ కారులులు” అని, ఇనుముతో కొడవ ళ్ళు,గొడ్డళ్ళు,పలుగు,పార,బండికట్లు, ఎద్దులకు నాడాలు చేసే వారిని ‘కమ్మరి’ అని ఇత్తడి,రాగి,కంచులోహాలతో పాత్రలు చేసేవారిని ‘కంచరి’ అని పిలుస్తారు.వ్యవసాయ రంగం లో ట్రాక్టర్లు వంటి యంత్ర పరికరాలు ప్రవేశించడం తో వడ్రంగులు ఎక్కువగా గృహనిర్మాణ రంగం,మరియు ఫర్నిచర్ తయారి వైపు మళ్ళారు .వీరి శారీరిక శ్రమను తగ్గిస్తూ, పాత పనిముట్ల స్థానం లో చిన్న చిన్న యంత్రాలు వచ్చాయి.రడీమేడ్ బంగారు,వెండి ఆభరణాలు దుకాణాల వల్ల స్వర్ణకారుల గిరాకీ తగ్గింది.విశ్వబ్రాహ్మణులు సంస్కృతీకరణ చెందినా(అంటే క్రింద కులాలవారు బ్రాహ్మణలను అనుకరిస్తూ వారి ఆచారాలైన ఉపనయనం చేసుకోవడం,గాయత్రి మంత్రం జపించడం,మాంసాహారాన్ని విసర్జిచడం వంటి ప్రక్రియలు ఆచరించడం) ,వారి సామాజిక అంతస్తు లో ఎట్టి మార్పు రాలేదు.
కుమ్మరి కులం వారు బంకమట్టి సేకరించి పిసికి ‘సారె’ పై ఉంచి కర్రతో సారే త్రిప్పుతూ రకరకాలైన మట్టిపాత్రలు, కుండలు చేసి ‘వామి’లో కాల్చి సంతలలో అమ్మేవారు. పెళ్ళిళ్ళలో వీరుచేసి ,రంగులుఅద్దిన “అరివేణి” కుండలు ప్రత్యెక ఆకర్షణగా ఉండేవి.అల్యూమినియం,స్టీలు పాత్రల రాకతో వీరి వృత్తి అంతరిచిపోయే వృత్తులలో చేరింది.
గానుగలో నువ్వులు పోసి ఎద్దును గానుగ చుట్టూ త్రిప్పుతూ నువ్వుల నుండి నూనెను ఆడే ‘తెనుకల ‘వృత్తి పూర్తిగా కనుమరుగైయింది.
పూర్వం హిందువులు గా ఉండి,తర్వాత ఇస్లాం మతాన్నిస్వీకరించి,కమానుతో దూదిని ఏకి పరుపులు,తలదిండ్లు తయారు చేసే దూదేకులసాయబులు , స్పాంజి పరుపుల రాకతో వీరు టైలరింగ్,ఇతరవృత్తుల లోకి మారేరు.
బి.సి-సి కులాలవారు షెడ్యూలు కులాలనుండి క్రైస్తవమతం లోకి మారినవారు.వీరి సామాజిక స్థితి షెడ్యూలు కులావారికంటే భిన్నంగా ఉండదు.
బి.సి-డి కేటగరీ కులాలు: గవర,యాదవ,కొప్పులవెలమ,తూర్పుకాపు,శిష్టికరణం కులాలు ఉనాయి. గొల్ల లేక యాదవకులం వారు గణనీయ సంఖ్య లో అన్నిగ్రామాలో నున్నన్నారు. కొద్దిపాటి మెట్ట వ్యవసాయం కలిగి,గొర్రెలు,మేకలపెంపకం,కట్టెలుకొట్టడం చేస్తారు.ఒకప్పుడు యలమంచిలిలో అన్ని ప్రభుత్వకార్యాలయాలో నాల్గవ తరగతి ఉగ్యోగస్తులుగా వీరే ఉండేవారు. వీరు పర్వ దినాలలోను, గ్రామపండుగలలోనూ జానపద గీతాలు ఆలపించడం ‘తప్పెటగుళ్ళు ‘ వాయిస్తూ బృంద నృత్యం చేసే కళాకారులు.
వ్యవసాయదారులైన కొప్పులవెలమకులం వారు, జిల్లా లో అధికసంఖ్య లోనుండి జిల్లా రాజకీయాలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికి ఈ మండలం లో వారి సంఖ్య తక్కువ.
ఎప్పుడో ఒడిస్సారాష్ట్రం నుండి దిమిలి గ్రామానికి వలస వచ్చిన శిష్టకరణం వారు ,చుట్టుప్రక్కల గ్రామాలకు వ్యాపించిన వీరి కుటుంబాలు 100 వరకు ఉంటాయి.. ‘శిష్టకరణం’వారు విద్యావంతులు. వీరు ఉపాధ్యాయ , ఇతర వృత్తులలో స్థిరపడ్డారు.
దేశ జనాభా లో ఆర్ధికంగ వెనుకబడిన కులాల వారు 54% ఉన్నారని ‘మండల్ కమిషన్’(1979) పేర్కొన్నది.కాని వెనుకబడిన తరగల వారిలో ఉండే అనైక్యత వల్ల,జిల్లాలో ఆర్దికబలం, అంగబలం ఉన్న మూడు, నాలుగు కులాలవారే ‘ఓటుబ్యాంకు’ రాజకీయాలలో లబ్దిపొదుతున్నారు. రాష్ట్ర శాసన సభలో మెజారిటీ బి.సి కులాల వారికి ఎటువంటి ప్రాతినిధ్యము లేదు.స్థానిక సంస్థలలో వీరికి రిజర్వేషన్ కల్పించబడినప్పటికి దానివల్ల ఒనగూడినదేమి లేదు. విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కలిపించబడినప్పటికి ఈ రంగాలన్నీ ’ప్రవేటీకరణ ‘జరుగుతున్నందు వలన వీరికి కలిగే ప్రయోజనం శూన్యం.

షెడ్యూలు తరగతులకు చెందిన కులాలు:

SCS

యలమంచిలి మండలంలో మాల,మాదిగ ,రెల్లి వారున్నారు. మండల జనాభా లో వీరి శాతం 9.2%.(2011).హిందూ కులవ్యవస్థ లోకి రాని పంచములుగాను, అంటరానివారుగాను హిందూ సమాజం నుండి వెలివేయబడిన వారే షెడ్యూలు కులాలవారు. వీరిని దేవాలయాలలోనికి ప్రవేశించనీయకపోవ డం,బావులు,చెరువులలో నీళ్ళు తెచ్చుకొనీయకపొవడం,వేరే కప్పులలో కాఫీ,టీ లివ్వయడం వంటి దురాచారాలను పాటించేవారు.చాకలి,మంగలి సేవలు కూడా వీరికి దూరం.ప్రస్తుతం వీరిని దళితులుగా వ్యవరిస్తున్నారు. గ్రామీణ జీవితంలో అనేక సేవలు అందిచడం తోపాటు , చనిపోయిన జంతుకళేబరాలు తీసికెళ్ళి వాటి మాంసాన్ని తినడం.కాటికాపరులు గా వ్యహరిచడం,వ్యవసాదారుల దగ్గర పాలికాపు (పాలేరు)లు గా అర్ధ బానిస జీవితం గడపడం, గ్రామ బారికలు గా వ్యవహరించడం,మరణించినవారి శవయాత్రలో డప్పులు వాయించడం, ఆకలి బాధకు తట్టుకోలేక రైతుల ఇళ్లకు వెళ్లి అన్నం అడుక్కోవడం వీరి వృత్తి. ఉత్తరాంద్రలో మాదిగలకంటే మాలలు అధికం. మాదిగలు తోళ్ళను శుబ్రపరచి చెప్పులు కుడతారు.రెల్లి వారు పండ్లు,కూరగాయలు అమ్మడం తో పాటు పారిశుధ్య పనులు చేస్త్తారు. దళితులు కాల క్రమంలో పాలేరు వృత్తి నుండి దినసరి వేతన కూలీలు గాను ప్రస్తుతం అనేక మంది పట్టణాలకు వలస పోయి అసంఘటిరంగ పట్టణ కూలీలు పనిచేస్తున్నారు.
అంటరానితనాన్ని రూపుమాపడానికి గాంధీజీ దళితులను ‘హరిజనులని’నామకరణ చేసారు. భారతదేశం లో అస్పృశ్యుల దుర్భల జీవితాలను బాగుచేసేందుకు కృషి చేసిన వారిలో అగ్రగణ్యుడు డా.బి. ఆర్ .అంబేద్కర్. ఈ మహనీయుని పోరాటం ఫలితంగానే షెడ్యూలు కులాల వారికి చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.వీరి ఆర్దిక స్థితిగతులను పెంచడానికి విద్య,ఉద్యోగాలతోబాటు ,భూమి కూడా ఇవ్వాలని అంబేద్కర్ కోరారు.స్వాతంత్ర్యాననంతరం ప్రభుత్వాలు వీరి అభ్యున్నతికి అనేక పధకాలు అమలు జరిపినా, వీరి సామాజిక ,ఆర్ధిక పరిస్థిత ఇంకా అట్టడుగునే ఉంది. ప్రస్తుతం దళితులకు దళితులే నాయకత్వం వహిస్తూ వారిని చైతన్యవంతులు గా చేస్తున్నారు.
విధ్య,రవాణా ,సమాచార, సాంకేతిక వ్యవస్థల లో వచ్చిన మార్పులు,ఆధునిక భావాల వల్ల బాహ్యంగా అంటరానితం తగ్గింది.పాత వృత్తుల స్తానం లో అందరూ చేయగలిగే కొత్త వృత్తులు ప్రవేశించాయి. కాని గ్రామీణభారతం లో దళితుల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉన్నది.
భారతదేశ సర్వతోముఖాభివృద్దికి పెట్టుబడిదారివిధానం,కులతత్వమే(ప్రతికులం వారు ఇతర కులాల కంటే తమ కులం వారికే ఆర్దిక,రాజకీయ,సామాజిక రంగాల లో మేలు జరగాలనే ధోరణి ) ప్రధాన ఆటంకాలని అంబేద్కర్ పేర్కొన్నారు. “‘ కులతత్వం’ కుల సంఘాలు,ఆధునిక సమాచార వ్యవస్థ లవల్ల సజీవగానే ఉన్నదికాని బలహీన పడడంలేదు. కులాంతర వివాహాలు, ఆహారనియమాలు పాటించకపోవడం వంటి కారణాలవల్ల ,కులభావం అంతరిచే దశకు చేరుకొన్నదని విద్యావంతులు,పట్టణవాసులు భావిస్తున్నప్పటికి వారిలోనే కులతత్వ ధోరణులు ఆశ్చర్యకర రీతులలో బయట పడతాయని ఎం.ఎన్. శ్రీనివాస్ పేర్కొన్నారు”.

7.రాజకీయ పార్టీలు

TDP
CPM

ప్రజాస్వామ్యానికి రాజకీయ పక్షాలు ఊపిరి వంటివి. ప్రజలను చైతన్య వంతం చేయడంలోను, ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవడంలో సహాయపడానికి , ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయాలను చర్చించడానికి ,పజల ఇబ్బందులను,వారికి జరుగుతున్నఅన్యాయాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు రావడానికి రాజకీయపక్షాలు ముఖ్య సాధనాలు.
యలమంచిలి అసెంబ్లీ నియోజక వర్గం లో అచ్యుతాపురం, రాంబిల్లి, యలమంచిలి మండలాలు,ఎస్..రాయవరం మండలం లోని కొన్ని గ్రామాలు ఉన్నాయి.యలమంచిలి నియోజకవర్గ రాజకీయాలను పరిశీలించే ముందు క్లుప్తం రాష్ట్ర రాజకీయాల అవలోకన.
స్వాతంత్ర్యానంతరం 1952 డిసెంబర్ 15 వ తేదిన ప్రత్యెక ఆంద్రరాష్ట్రం కోరుతూ 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు అశువులు బాసారు.1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ప్రత్యెక తొలి భాషాప్రయుక్త రాష్ట్రం గా ఆంద్రరాష్ట్రం అవతరించింది. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్య మంత్రిగా పదవీస్వీకారం చేసారు. 1955 మార్చి లో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్-కృషికర్ లోక్ పార్టీ ఐక్యసంఘటన విజయం సాధించింది. 1956 నవంబర్ 1తేదిన నైజాం జిల్లాలు ఆంద్రరాష్ట్రం లో ఐక్యమై ఆంధ్రపదేశ్ గా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీ నీలం సంజీవరెడ్డి తొలి ముఖమంత్రి అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ: జాతీయోద్యమ ఆదర్శాలను గౌరవించడం,పంచవర్ష ప్రణాలికలు, ప్రజాస్వామ్య సామ్యవాద విధానాలు,భూసంస్కరణలు,బ్యాంకుల జాతీయకరణ, గరీభీహటావో,ఎసి,ఎస్.,ఎస్.టి.
వారిఅభివృద్ది ప్రత్యెక పధకాలు వంటి అనేక అభ్యుదయ విధానాలవల్ల వివిధ వర్గాల వారు కాంగ్రెస్ పార్టీని బలపరిచారు.
1956 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ , తెలుగు దేశం ఆవిర్భావం వరకు మూడు దశాబ్దాల పాటు అవిచ్చిన్నంగా పాలించింది. అధికారం లో ఉన్నంత కాలం ముఖ్యమైన పదవుల కోసం అంతర్గత ముఠా రాజకీయాలతో సతమతంయ్యేది.మొదట్లో పట్టాభి-ప్రకాశం వర్గం,తర్వాత సంజీవరెడ్డి -కాసు భ్రహ్మానందరెడ్డి వర్గం,1960 దశకం లో మర్రి చెన్నారెడ్డి-భ్రహ్మానంద రెడ్డి వర్గం పోటీపడేవి.జలగం వెంగళ రావు తర్వాత అనేక మంది ముఖ్య మంత్రులను అధిస్ఠానం మార్చింది.

రైతులకు ఉచిత విద్యుత్తు వంటి వాగ్దానాలతో,ఇతర పార్టీల తో పొత్తులు పెట్టుకని,రైతులకు ఉచిత విద్యుత్తు వంటి వాగ్దానలోతో శ్రీ రాజశేకర రెడ్డి నాయకత్వం లో 2004 ఎన్నికలో తెలుగు దేశం పై కాంగ్రెస్ విజయం సాధించింది. రాజశేఖర రెడ్డి జనాకర్షణ, జలయజ్ఞం వంటి కార్యక్రమాల వల్ల 2009 ఎన్నికలలో గెలిచినా ,రాజశేఖ ర రెడ్డి మరణం, ఆంద్రుల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా విభజన వంటి కారణాల వల్ల 2014 ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా తుడుచుపెట్టుకు పోయింది
యలమంచిలి నియోజవర్గం లో కూడా 1955 నుండి 1983 వరకు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక్కడనుండి శ్రీ వీసం సన్యాసి నాయుడు(సైతారుపేట) కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గా 1962.1978 ల లోగెలిచి శ్రీ కోట్ల విజయ భాస్కర రెడ్డి మంత్రివర్గం లో సహకారశాఖా మంత్రి గా పనిచేసారు. కొఠారు రాంబాబు,ఆకెళ్ళ శ్రీహరి పంతులు (యలమంచిలి) బొద్దపు శ్రీరాములు(పెదపల్లి) మొదలగు నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉండే వారు. తెలుగుదేశం పార్టీ పట్ల అసంతృప్తి, వై.ఎస్.రాజశేకర రెడ్డి ప్రభంజం వల్ల 2004,2009 ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి యు. వి.రమణమార్తి రాజు(కన్నబాబు) గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది.

తెలుగుదేశం:   తెలుగుదేశం ఆవిర్భావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక మెయిలు రాయి.కాంగ్రెస్ పార్టీ తరచుగా ముఖ్యమంత్రులను మార్చడం వంటి కారణాల వల్ల 1982 మార్చిలో ఎన్.టి.రామారావు’తెలుగువారి ఆత్మగౌరవం’నిలబెట్టడం కోసం తెలుగు దేశం పేరు తో ప్రాంతీయ పార్టీని స్థాపించి 1983 జనవరిలో జరిగిన ఎన్నికలలో అఖండ విజయాన్ని సాధించారు.గెలిచిన తర్వాత రెండు రూపాయలకు కిలో బియ్యం, మునసబు – కరణాల వ్యవస్థ రద్దు, మండల వ్యవస్థ ఏర్పాటు సారా నిషేధం, అణగారిన వర్గాల అభివృద్దికి డి,ఆర్.డి.ఏ, ఐ,టి,డి,ఏ వంటి సంస్థల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేసారు. 1989 ఎన్నికలలో తెలుదేశం పై అసంతృప్తి వల్ల మళ్ళీ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా ముఖ్య మంత్రుల మార్పిడి యధావిదిగా సాగింది.

1994 ఎన్నికలలో కాంగ్రెస్ పరాభవనం చెంది, ఎన్.టి.ఆర్ ముఖ్య మంత్రి అయ్యారు కాని,కుటుంబ కలహాల వల్ల 1995 లో ఎన్.టి.ఆర్ ని పదవీచ్యుతిని చేసి అతని అల్లుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అయ్యారు.1999,జనవరి లో ఎన్.టి.రామారావుగారు మరణించగా అదే సంవత్సరం లో జరిగిన ఎన్నికల లో చంద్రబాబు నాయుడు నాయకత్వం లో టి.డి.పి అధికారం లోకి వచ్చింది.చంద్రబాబునాయుడు అదినేత అయిన తర్వాత పార్టీ యంత్రాగాన్ని పూర్తిగా తన నియంత్రణ లోనికి తెచ్చుకొని ,జన్మభూమి,ఎలక్ట్రానిక్ పాలన,డ్వాక్రా వంటి పధకాలు చేబట్టి ప్రజలో పలుకుబడి ని సాధించాడు.
2004, 2009 ఎన్నికలో శ్రీ వై.ఎస్.రాజశేకర రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడినా
తెలంగాణా విభజన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికలో సమర్ధుడైన శ్రీ చంద్రబాబు నాయకత్వం లో రాష్ట్రం పురోభివృద్ది సాధించగలదనే నమ్మకం తో ఆంద్రాప్రజలు తెలుదేశానికే అధికారం కట్టబెట్టారు.
నియోజక వర్గం లో తెలుగు దేశం ఆవిర్భావం నుండి ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది.1993 ఎన్నికలో టి.డి.పి పక్షాన్న శ్రీ కె.కె.వి.ఎస్.రాజు గెలిచి నాదెండ్ల భాస్కర రావు వర్గం వైపు ఫిరాయించాగా,శ్రీ పప్పల చలపతి రావు 1985.1989.1994,1999 లలోవరసగా విజయం సాదించి రికార్డ్ సృష్టించారు.2004,2009 ఎన్నికలో పరాజయం పొందినా 2014 ఎన్నికలలో టి.డి.పి అభ్యర్ధి గా స్థానికేతరుడైన శ్రీ పంచకర్ల రమేష్ బాబు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పై విజయం సాధించారు. శ్రీ పప్పల చలపతి రావు, విశాఖ డైరీ చైర్మన్ శ్రీ ఆడారి తులసీ రావు,శ్రీ లాలం భాస్కర రావు,యలమంచిలి మునిసిపల్ చైర్మన్ శ్రీమతి పిళ్ళా రమాకుమారి వంటి నాయకులు,కార్యకర్తలతో ఈ పార్టీ గట్టి పునాదిని కలిగిఉన్నది.

కమ్యూనిస్టు పార్టీలు:సామ్యవాద సిద్ధాంతాలు, దున్నేవానిదే భూమి వంటి రైతాంగ పోరాటాలు, నిబద్దత కలిగిన కార్యకర్తలు తో 1960 దశకం వరకు కాంగ్రెస్ పార్టీ విధానాలకు ప్రత్యామ్నాయం గా కమ్యూనిస్ట్ ఉద్యమం కేరళ ,బెంగాల్ ల వలె, ఆంధ్రప్రదేశ్ లో బలీయమైన శక్తి గా ఉండేది. 1955,1955 ఎన్నికలలో యలమంచిలి నియోజక వర్గం లో కూడా ద్వితీయ పార్టీ గా నిలిచింది. కాని కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పంచ వర్ష ప్రణాలికలు, మిశ్రమ ఆర్ధిక విధానాలు,1964 లో కమ్యూనిస్ట్ ఉద్యమం సి.పి.ఐ.,సి.పి.ఎం పార్టీలు చీలిపోవడం వంటి కారణాల కమ్యూనిస్ట్ పార్టీలకు అండగా నిలిచిన ప్రజలు క్రమం గా కాంగ్రెస్,తెలుగుదేశం ల వైపు మొగ్గడం వల్ల కమ్యూనిస్టుల ప్రాభల్యం క్రమంగా క్షీణించింది.
యలమంచిలిలో గండిబోయన అప్పరావు,సేనాపతి రాములు,కొటారు రాంబాబు,పుల్లా నారాయణరావు, పిళ్ళా ఎరుకునాయుడు, సాధనాల నాగేశ్వర రావు, చందనాల నారాయణ ,దొడ్డి రమణ, దొడ్డి గౌరీసు, పడాల వీరభద్రుడు, కొసనం పైడికొండ దిమిలి లో సిగిరెడ్డి సీతం నాయుడు,పలకా రమణ,శిష్ట్లా వెంకటరావు,కటుబోలులోడబ్బీరునరసింహమూర్తి,కుమ్మారాపల్లిలో పోత సన్యాసిదేముడు, చోచ్చుపట్ల నాగరాజు మొదలగు కార్యకర్తలుండే వారు. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం నామ మాత్రంగా కూడాలేదు.
భారతీయ జనతా పార్టీ: 1931 సం.లో జనసంఘ్ పార్టీ యొక్క నూతన రూపమే భారతీయ జనతా పార్టీ .హిందుత్వ మరియు సంస్క్రుతిక జాతీయవాదం ,అయోధ్య లో రామమందిర నిర్మాణం వంటివి ఈ పార్టీ విధానాలు.పార్టీ నిర్మాణానికి యలమంచిలి లో శ్రీ భరిణికాన రామారావు కృషి చేసారు.ఇప్పుడు కూడా కొందరు అంకిత భావంఉన్న కార్యకర్తలున్నారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ : 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రి గా పనిచేసిన శ్రీ వై.ఎస్ రాజ శేఖర రెడ్డి మరణాంతరం ఆయన ఆయన ఆశయాలు కోసం ,ఆయన కుమారుడు శ్రీ వై.జగన్మోహన రెడ్డి స్థాపించి ఈ పార్టీ 2014 ఎన్నికలలో కొద్ది స్థానాలో మాత్రమే విజయం సాదించ గలిగింది.నియోజకవర్గం లో ఈ పార్టీ ప్రగడ నాగేశ్వరరావు,బోదేపు గోవిందు,బొద్దపు ఎర్రయ్య దొర, బెజవాడ నాగేశ్వర రావు మొ. కార్యకర్త లున్నారు.

ఇంతవరకు జరిగిన ఎన్నికలలో , రాష్ట్రం లో ఏ పార్టీ గాలి బలం గా వీస్తే, ఇంచుమించుగా యలమంచలి నియోజకవర్గం లో కూడా కొద్ది తేడాలతో అదే ధోరణి ప్రతిబింబిస్తున్నది
1952 నుండి 2014 వరకు జరిగిన ఎన్నికలో విజేతల – పరాజితులు
సం. గెలిచిన అభ్యర్ధి పార్టీ పొందిన ఓట్లు

ఓడిన అభ్యర్ది పార్టీ పొందిన ఓట్లు
1952 పప్పల బాపు నాయుడు. కృషికార్ లోక్ పార్టీ 39010-  ఎం.ఎన్ .మూర్తి కాంగ్రెస్ 11547
1955 సి.వి.ఎన్.రాజు ఇండి. 13636-  కె.రామజోగి సి.పి.ఐ 9948
1962 వీసం సన్యాసి నాయుడు కాంగ్రెస్ 14995 -వెలగా వీరభద్ర రావు సి.పి.ఐ 11367
1967 నగిరెడ్డి సత్యనారాయణ ఇండి. 22994- వి. సన్యాసి నాయుడు కాంగ్రెస్ 20639
1972 కె.వి.కాకర్లపూడి ఇండి. 31938 వి.- సన్యాసి నాయుడు కాంగ్రెస్ 25390
1978 వి. సన్యాసి నాయుడు కాంగ్రెస్ 37969- నగిరెడ్డి సత్యనారాయణ జనతా పార్టీ 29302
1983 కె.కె.వి.ఎస్.రాజు టి.డి.పి 38707- వి. సన్యాసి నాయుడు కాంగ్రెస్ 30879
1985 పప్పల చలపతి రావు టి.డి.పి 44597 వి.సన్యాసి నాయుడు కాంగ్రెస్ 34677
1989 పప్పల చలపతి రావు టి.డి.పి 40286- వి.సన్యాసి నాయుడు ఇండి. 28032
1994 పప్పల చలపతి రావు టి.డి.పి 57793- ఎన్.ప్రభాకర రావు కాంగ్రెస్ 33547
1999 పప్పల చలపతి రావు టి.డి.పి 52583 -యు.వి.రమణమూర్తి రాజు కాంగ్రెస్ 45529
2004 ఉప్పలపాటి వెంకట రమణ మూర్తి రాజు కాంగ్రెస్ 58418- గొంతిన వెంకట నాగేశ్వర రావు టి.డి.పి 48956
2009 ఉప్పలపాటి వెంకట రమణ మూర్తి రాజు కాంగ్రెస్ 53960 -గొంతిన నాగేశ్వరరావుపి.ఆర్.పి..43870
-ఎల్.భాస్కర రావు టి.డి.పి 39525
2014 పంచకర్ల రమేష్ బాబు టి.డి.పి 80563 -ప్రగడ నాగేశ్వర రావు వై.ఎస్.ఆర్.సి.పి 72188

2019 ఉప్పలపాటివెంకట రమణ మూర్తి రాజువై.ఎస్.ఆర్.సి.పి 70128 పంచకర్ల రమేష్ బాబు టి.డి.పి 66378

8. విద్యాసంస్థలు

College
విద్య -వైద్య సౌకర్యాలు యలమంచిలి లో అంతంత మాత్రమే.ఇక్కడ నాలుగు డిగ్రీ కలాశాలున్నాయి.నాటి ఎం.ఎల్ .ఏ.శ్రీ పప్పల చలపతి రావు గారి కృషి వలన ప్రభుత్వ ఆధ్వర్యంలో 1987 లో ‘శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల’ స్థాపించబడింది. ఈ కళాశాలో బి.ఏ.,బి.కాం.,బి.ఎస్సీ కోర్సులు నిర్వహించబడుచున్నాయి. బి.ఎస్సే లో మేధమేటిక్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ,కంప్యూటర్ సైన్స్,బోటనీ,జూఆలజీ విభాగాలున్నాయి.ఈ కళాశాలకు 2015 లో యు.జి.సి.జాతీయ ప్రమాణాల సంస్థ ‘నాక్’ వారి ‘ఏ ‘ గ్రేడ్ దక్కడం విశేషం.ఇదిగాక పట్టణం లో పూర్ణ సాయి వివేకానంద ,కొణతాల ,గీతాజలి డిగ్రీ కళాశాలు ,మధు బి.యిడి,డి.యిడి కళాశాలున్నాయి.ప్రభుత్వ డిగ్రీ కళాశాలో డా.బి.ఆర్ .అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఉన్నది.
ఇక్కడ కార్పోరేట్ జూనియర్ కాలేజీలు లేవు.ఇక్కడఉండే ప్రభుత్వ హైయ్యర్ సెకండరీ పాఠశాలను 1969 లో ప్రభుత్వజూనియర్ గా కాలేజి మార్పు చేసారు. ఇదికాక పూర్ణసాయి ,కొణతాల,గీతాంజలి,ఉషోదయ, వాగ్దేవి జూనియర్ కాలేజిలున్నాయి.
హైస్కూల్ స్థాయిలో ప్రభుత్వ బాలుర (స్థాపితం 1927),బాలికల (స్థాపితం 1959) ఉన్నత పాటశాల లతో పాటు జిల్లాపరిషత్ వారి ఉన్నత పాతశాలు-2, సెయింట్ మేరి,జూడ్స్,మథర్ సాయి,గౌరి ఉన్నత పాటశాలలు,చైతన్య,రవీంద్ర భారతి,కృష్ణవేణి టెక్నో స్కూళ్ళు ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత పాటశాల జిల్లాలో హాకీ క్రీడకు ప్రసిద్దిచెండినది. అనేక మంది జాతీయ హాకీ క్రీడాకారులను తయారు చేసింది.

గ్రంధాలయాల

cmes_library
ఆరుద్ర విజ్ఞానమందిరం (శాఖా గ్రంధాలయం )
యలమంచిలి లో జిల్లాగ్రంధాలయ సంస్థ వారి గ్రేడ్ I పౌర గ్రంధాలయం 1954లో ఏర్పాటయింది.1994 గ్రంధాలయ సంస్థ వారు, తాహిసిల్దార్ కార్యాలయానికి వెళ్ళే మార్గం లో అన్ని సౌకర్యాలు ఉన్న శాశ్విత భవనాన్నినిర్మించి ,ఈ జిల్లవాడైన కవి,విమర్శకుడు శ్రీ ఆరుద్ర గారిపేరు పెట్టేరు. గ్రంధాలయం లో ఆంగ్ల.తెలుగు భాషలలో సుమారు 26,000 పుస్తకాలున్నాయి.అందులో ఆరువేల వరకు రెఫరెన్స్ గ్రంధాలున్నాయి. దిన,వార,మాస పత్రికలు 52 వస్తాయి.ప్రతి రోజూ పిల్లల నుండి పెద్దవారి వరకు 200 మంది వరకు గ్రంధాలయాన్ని సందర్శిస్తారు.గ్రూప్ I, గ్రూప్ II మొదలగు పోటీ పరీక్షల తయారీకి కావలసిన పుస్తకాలన్నీ ఉన్నాయి.దాతలు అందచేసిన కుర్చీలు,ఫేన్లు,చక్కటి ఫర్నిచర్ సావధానంగా కూర్చొని చదువుకొనే విధంగా లైబ్రరీ ని , కవుల ప్రముఖుల చిత్ర పటాలతో రీడింగ్ రూమ్ ని తీర్చిదిద్దేరు. లైబ్రరీ హాలుకు మహాకవి శ్రీ.శ్రీ పఠన మందిరం గా నామకరణ చేసారు. లైబ్రరీ కి కంప్యూ టర్,జెరాక్ష్ మేషేన్ ఉన్నాయి.ఇద్దరు సిబ్బందితో ,పట్టణం లో సాహీతీ,విజ్ఞాన సమావేశాలకు చక్కటి వేదికగా గ్రంధాలయం సేవలనందిస్తున్నది.
అవగాహన-గ్రంధాలయం:
అభ్యుదయ భావాలు,శాస్ర్తీయకమ్యూనిజంల పై ప్రజలలోఅవగాహన కలిగించే ఉద్దేశం తొ కవి, కధారచయత,సాహితీ విమర్శకులు డాక్టర్ మానేపల్లి సత్యనారాయణ గారు 1978 లో శ్రీకాకుళం లో ‘అవగాహన’ పేరుతో ఒక ప్రగతిశీల వేదికను ఒక గ్రంధాలయాన్ని ఏర్పాటుచేసి సాహిత్య సంచికలును ప్రచురిస్తూ,ప్రఖ్యాత రచయతల తొ సాహిత్య గోష్టులు,సభలు,సమావేశాలు విర్వహించేవారు..వీరు పదవీ విరమణ అనంతరం ఎలమంచిలి యానాద్రి కాలనీ లో స్వంత నిధులతో భవనం నిర్మించి ’అవగాహన’ పేరుతో ఒక గ్రంధాలయాన్ని,ఏర్పాటుచేశారు. ఇందులో బారత రామాయనాణలతోపాటు అభ్యుదయ సాహిత్యం,స్త్రీవాద,దళిత సాహిత్యం,మార్క్సిజం మీద సుమారు పదివేల గ్రంధాలున్నాయి.గ్రంధాలయం లో సమావేశాలు నిర్వహించుకోనేందుకు వీలుగా సెమినార్ హాల్ ఉన్నది.

న్యాయ సంస్థలు :యలమంచిలి న్యాయస్థానానికి నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది. 1860 సం.నికి పూర్వం ఎస్. రాయవరం లో ఏర్పాటుచేయబడిన కోర్ట్ 1879 సం. లో యలమంచిలి కి మార్చబడింది. కోర్ట్ శతాబ్ధిఉత్సవాలు 1981 లో నిర్వహించబడ్డాయి. ఒకప్పుడు ఊరంతా వకీళ్ళ, కక్షిదారులు, కన్యాశుల్కం నాటకం లో రామప్పపంతులు వంటి కోర్టు పక్షులతో సందడి గా ఉండేది. గతానికి గుర్తుగా ఇప్పటికి ఒక వీధి పేరు కోర్ట్ పేట మరొక వీధిపేరు కోర్టు ప్యూనుల పేటగా పిలవబడుతున్నాయి. కోర్టు లో సీనియర్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ (పి.డి.ఎం),క్రిమినల్ జడ్జ్ , అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (ఏ.డి.ఎం) బెంచెలు ఉన్నవి

9. వైద్య సౌకర్యాలు 

Medical

ఇక్కడ ప్రాధమిక వైద్య చికిత్స తప్ప ఎటువంటి వైద్య సౌకర్యాలు లేవు.నిపుణుల వైద్య చికిత్స నిమిత్తం ఇక్కడి ప్రజలు విశాఖపట్నం మీద ఆధారపడతారు.. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం 1988 లో 22 పడకల హాస్పటల్ గాను,తర్వాత 30 పడకల హాస్పటల్ గాను మార్చబడింది.ఇందులో నలుగురు వైద్యులు,ఒక ప్రసూతి డాక్టర్, దంత వైద్యుడు,కంటి పరీక్షా నిపుణుడు ఉండాలి .కాని ఎల్లప్పుడూ సిబ్బంది కొరత ఉంటుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంతోపాటు,రామవర నర్సింగ్ హోమ్,అరుణా నర్సింగ్ హోమ్.విజయా హాస్పటల్, సౌభాగ్య హాస్పటల్,వెంకటేశ్వర హాస్పటల్ మొదలుగునవి ఉన్నాయి. నాలుగు దంత వైద్యశాలలు,ఎల్.వి.ప్రసాద్ నేత్ర పరీక్షాకేంద్రం మొదలగునవి ఉన్నాయి.

10.రవాణా వ్యవస్త:

IMG_20150923_085918 (1)
కలకత్తా నుండి చెన్నై పోవునాలుగు లైన్ల జాతీయ రహదారి(ఎన్.హెచ్ -16) మరియు కలకత్తా నుండి చెన్నై పోవురెండు లైన్ల రైలు మార్గము యలమంచిలి మీదుగా పోవుట వలన ఈ వూరికి చక్కటి రవాణా సౌకర్యము ఉన్నది. ఎలమంచిలి స్టేషన్ లో అన్ని పాసెంజర్ ట్రైన్ల తోబాటు హౌరా- సికందరాబాద్(ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ) ,టాటా నగర్ -ధన్బాద్ – అలెప్పి(బొకారో ఎక్స్ ప్రెస్ ), భువనేశ్వర్-సికిందరాబాద్ (విశాఖ ఎక్స్ ప్రెస్) విశాఖపట్నం –హైదరాబాద్(గోదావరి ఎక్స్ ప్రెస్ ), విశాఖపట్నం-తిరుపతి (తిరుముల ఎక్స్ ప్రెస్ ),మరియు విశాఖపట్నం- గుంటూరు (సింహాద్రి ఎక్స్ ప్రెస్ ) లు ఆగుతాయి..ప్రశాంతి,జన్మభూమి,లింక్,రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లకు కూడా ఇక్కడ హాల్ట్ ఇవ్వాలని ప్రజలు చిరకాలం గా కోరుతున్నప్పటికి,ఇక్కడ ప్రజా ప్రతినిధులు గట్టి ప్రయత్నం చేయక పోవుట వలన ఆ కోరిక నెరవేరుట లేదు.స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం ఉన్నప్పటికీ, రిజర్వేషన్ కొరకు ప్రత్యెక కౌంటర్ కాని ప్రయాణీకులు విశ్రాంతి గది కాని ట్రైన్ల రాక,పోకలను తెలుపు డిజిటల్ బోర్డ్ కాని,బోగీలు నిలుచు సమాచారము తెలుపు స్తంభాలుగాని లేవు..
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్ కాంప్లెక్స్ ఊరి మధ్య యలమంచిలి మెయిన్ రోడ్డును ఆనుకోని ఉన్నది. విశాఖపట్నం నుండి మెట్రో బస్సులు ప్రవేశ పెట్టిన తర్వాత అనకాపల్లి మీదుగా, స్టీల్ ప్లాంట్ మీదుగా యలమంచిలికి ప్రతి 15 నిమషాలకు బస్సు కలదు. కాని రాజమండ్రి,కాకినాడ వెళ్ళు ఎక్స్ ప్రెస్ బస్సులన్నీ యలమంచిలి పట్టణం లోకి రాకుండా జాతీయ రహదారి మీదుగాపోవు చున్నందు వలన విజయవాడ వైపు వెళ్ళు ప్రయాణీకులు ఇక్కట్లకు గురియగుచున్నారు.

11. దేవాలయాలు

వీరబద్రస్వామి ఆలయ గోపురం

IMG_20150923_084852

వీరభద్రస్వామి ఆలయం: యలమంచిలిలో గల ప్రాచీన దేవాలయాలలో వీరభద్రస్వామి దేవాలయం ఒకటి . క్రీ.శ. 15 వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని. చాళుక్య రాజులు గాని యాదవరాజులు గాని నిర్మించి ఉంటారని భావించ బడుచున్నది. ఈ శైవక్షేత్రం లో వీరభద్రస్వామి ఐదు అడుగుగుల ఎత్తుగల విగ్రహ రూపం లో దర్శనమిస్తారు. ఎత్తయిన ఆలయ గాలి గోపురం గ్రామమంతా కనిపిస్తుంది. గాలి గోపురం క్రింద బ్రహ్మి,వరాహ, గణేశ, మహిషాసురమర్దని, కుమారస్వామి, సదాశివుని రాతి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయంలో భద్రకాళి, కుమారస్వాములకు వేరు గదులున్నాయి. ఆలయ ప్రహారి గోడ పై చెక్కబడిన వివిధ శిల్పాలు అనేక శాశనాలు సందర్శకులను ఆకట్టుకొంటాయి

వేణుగోపాలస్వామి ఆలయం : యలమంచిలిలోగల వీరన్న కొండ తూర్పు భాగాన ఈ ఆలయాన్నికూడా 11 శతాబ్దపు చాళుక్యుల రాజులే నిర్మించారని భావించబడుతోంది.శ్రీ వేణుగోపాలస్వామి సంతాన వరప్రదాత గా ప్రసిద్దుడు.ప్రతిసంవత్సరం భీష్మఏకాదశి రోజున ప్రత్యెక పూజలు జరుగుతాయి
శ్రీ రామలింగేశ్వరాలయం: ఇది క్రీ.శ 1810 లో నిర్మిచబడినది. ఆలయం లో గల సుబ్రహ్మణ్య స్వామి కి పూజలు చేస్తే నాగదోష నివారణ జరుతుందని నమ్మకం.
శ్రీ సీతారామరామస్వామి దేవాలయం; కొత్తపేట లో గల ఈ ఆలయం 1810 లో నిర్మించబడినది.శ్రీరామనవమి రోజున ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇదిగాక పాతవీధి లో 1835 లో నిర్మించిన మరొక రామస్వామి కోవెల కలదు.
కనకమహాలక్ష్మి అమ్మవారిఆలయం: యలమంచిలి ధర్మవరం లో 75 సంవత్సరాల క్రిందట వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు యలమంచిలి ప్రజల ఆరాధ్య దైవం.తన తమ్ముడు అనారోగ్యానికి గురికావడం తొ విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారికి , గ్రామానికి చెందిన కొఠారు అప్పలరాజు మ్రొక్కుకొన్నారు.అతడి ఆరోగ్యం బాగుపడడం తొ ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు.ప్రతిసంవత్సరం మార్గశిరమాసంలో స్త్రీలు అమ్మవార్కి విశేష పూజలు చేస్తారు. జనవరి 19 వ తేదీన సాంస్క్రుతిక కార్యక్రమాలతో అమ్మవారి తీర్ధము వైభవం గా జరుగుతుంది.
భూలోకమాంబ గుడి :తీగల రావిచెట్టు దగ్గర నున్న ఈ అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం దీపావళి అమావాస్య నుండి నాగుల చవితి వరకు ఉత్సవాలు జరుగుతాయి.ఆ ఇదు రోజులూ భూలోకమాబ గుడినుండి పాత వీధిలోగల సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వరకు,భారీసెట్టింగులు, విద్యత్ తోరణాల కాంతులతో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
రామచంద్రమ్మ అమ్మవారి గుడి (యలమంచిలి ధర్మవరం): ఈ గుడి వద్ద మే నెలలో ప్రతి రెండు సంవత్సరాల కొక సారి ‘మెరుపుల’ పండగ నిర్వహిస్తారు.
శివ-పార్వతుల విగ్రహాలు ; యలమంచిలి మెయిన్ రోడ్డు కొమ్మయ్య గుండం వద్ద ఆకర్షణీయమైన భారీ సైజు శివ-పార్వతుల విగ్రహాలను విశ్రాంత పోలీసు సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీ కరణం నాగరాజు గారు 5 లక్షల రూపాయలను వెచ్చింఛి ఏర్పాటు చేసారు.ఇవి పట్టణానికి అదనపు శోభనిచ్చాయి.
భక్తులు ఎక్కువ సందర్శించే గుడులులో బస్సు స్టాండ్ దగ్గరకల షిర్డీ సాయిబాబా గుడి, ఆజనేయస్వామి గుడి మరియు కొత్తపేట శివాలయం. ఇంకా దిమిలి రోడ్డులో వైశ్యులు కొలిచే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, త్రిమూర్తులవారి ఆలయం,నూకాంబికా అమ్మవారి గుడి, ,పద్మశాలీల ఆరాధ్యదైవం భావనారుషి స్వామి గుడి(యలమంచిలి ధర్మవం),గవరలు కొలిచే గౌరిపరమేశ్వరఆలయం ,విశ్వబ్రాహ్మణులు పూజించే కామాక్షి అమ్మవారి ఆలయం ప్రసిద్దిచెందినది

ఆంధ్రా బాప్టిస్ట్ చర్చ్– కాకివాని వీధి:-ఈ చర్చ్ యలమంచిలి లొ సుదీర్ఘ చరిత్ర ను కలిగి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటు కొన్నది.కెనడా నుంచి 1874లో మిస్టర్ టింపనీ,మిస్టర్ మెక్లారిన్ అనే ఇద్దరు మిషనరీలు భారతదేశానికి వచ్చారు.వారు కాకినాడ కేంద్రంగా ఉంటూ ,అన్ని జిల్లాల లో చర్చ్ లు నిర్మించాలని తలపెట్టారు.ఇందులో భాగంగా1889 లో మిషనరీని స్తాపించారు.1906 లో కొద్దిమంది క్రైస్తవవిశ్వాసులతొ చిన్న పాకలో ప్రార్దనామందిరాన్ని ఎర్పాటు చేసారు.1907లో చర్చ్ నిర్మాణం చేపట్టి పూర్తి చేసారు.దీనిని 2001లో ఆధునీకరించారు.పెద్దస్టేజు,ఆధునిక వాయిద్యపరికరాలు,వాహనాలు నిలుపుటకు పెద్ద స్తలం ఎర్పాటు చేసారు.ప్రతి ఆదివారం పేదలకు సంక్షేమకార్యక్రమాలు.చేపడుతున్నారు.కెనడాదేశస్తులు ఏర్పాటు చెసిన ఈ చర్చ్ అంచలంచలు గా ఎదిగి ప్రస్తుతం ఒకే సారి 1000 ప్రార్దనలు చేసుకొనే స్తాయి కలిగి ఉన్నది.

12. చూడతగిన ప్రదేశాలు

పంచదార్ల ధర్మలింగేశ్వరాలయం

DSC08477

నిత్యమూ ప్రవహిచే ఐదునీటి ధారలు
DSC08480
: యలమంచిలి కి 10 కి.మీ. దూరం నున్న పంచదార్ల గ్రామంలో చారిత్రిక విశిష్టత కల అతి ప్రాచీన శైవక్షేత్రం ధర్మలింగేశ్వరాలయం కలదు. ఇక్కడ ఎల్లవేళలా భూగర్భం నుంచి పైకి వచ్చే ఐదు నీటి ధారలు (పంచ ధారలు) భక్తులకు కనువిందు కలిగిస్తాయి. ఇక్కడ స్వయం భూయుక్తమైన లింగం ఉండేదని కాల గతిలో అది మరుగున పడగా నారదుని సూచన మేరకు యమధర్మరాజు తన కుష్టువ్యాధి నివారణ నిమిత్తం మరొక వర్ధమాన లింగాన్ని ఇక్కడ ప్రతిష్టించేడని యమధర్మరాజు చే పునఃప్రతిస్టించ బడిన లింగం కనుక ధర్మలింగేశ్వర ఆలయంఅని పేరు వచ్చినట్టు స్థల పురాణం. ఇక్కడ పురాతన శివలింగాన్ని సముద్రగుప్తుని కాలంలో దేవరాష్ట్రాన్ని పాలించే కుభేరుడు ప్రతిష్టించాడని చరిత్రకారుల భావన. ఈ క్షేత్రంలో ముందుగా బయట మనకు కనిపించేది ’రాధామాధవ స్వామి’ నిలయం మరియు ఒక మండపం. ఈ మండపాన్ని హరినరేంద్రుడు క్రీ.శ..1538 లో నిర్మించాడు. ఆలయానికి దక్షిణ దిశలో తటాకం ఉన్నది. నీటి ధారలన్నీ దీనిలో కలుస్తాయి. ఈ తటాకాన్ని, తూర్పుదిశ లో నున్న ఆస్థాన మండపాన్ని చాళుక్య నృసింహదేవుని భార్య వీరాంబికచే నిర్మితమయ్యాయి. ఇక్కడ ఆలయ సమూహంలో విశ్వేశ్వరస్వామి ఆలయం, అనేక లింగాకృతులు, దేవతామూర్తుల విగ్రహాలు, నందీశ్వర విగ్రహాలు, శిధిల శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ ప్రధానమైన ధర్మలింగేశ్వరాలయం, అన్ని ఆలయాల కన్న ఎత్తులో నున్నది. గర్భగుడి లోపల నున్న మండపం క్రి.శ.1432 లో కుమార ఎర్రమనాయకునిచే నిర్మించ బడినదని, దేవుని కళ్యాణ ఉత్సవాల కై నిర్మించబడ్డ మండపం 1407 లో యలమంచిలి విశ్వేశ్వర దేవుని చే నిర్మిచబడినదని శాసనాలు తెలియచేస్తున్నాయి.. ఆలయాన్ని పురాతన రక్షిత కట్టడంగా గుర్తిస్తూ పురావస్తు శాఖ వారు పెట్టిన బోర్డు ఇక్కడ ఉన్నది. కార్తీక మాసం, శివరాత్రి, విజయదశమి రోజుల్లో ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కళకళ లాడుతోంది.

ఉపమాక వెంకన్న : ఉత్తరాంధ్రవాసుల ఆరాధ్య దైవమైన ‘ ఉపమాక వెంకన్న’ ‘గా పిలువ బడే వేంకటేశ్వరస్వామి ఆలయం యలమంచిలి కి 20 కి.మీ.దూరంలో కల ఉపమాక గ్రామం లో వెలిసింది. ఈ దేవాలయం తిరుపతి వెంకేశ్వరస్వామి దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఈ క్షేత్రం క్రీ..శ. ఆరవ శతాబ్దంలో వెలిసినట్లు తెలస్తుంది. వెంకటేశ్వర స్వామి వెలసిన పర్వతాన్ని గరుడాద్రి పర్వతమని పిలుస్తారు. గరుక్మంతుడు, విష్ణుమూర్తిని ఎల్లవేళలా తన వీపు పై కూర్చుండునట్లు వరం కోరగా, దక్షిణ సముద్ర తీరమందు నీవు కొండగా ఆవిర్భవిస్తే, తిరుపతి నుండి వచ్చి నీ పై అవతరించి పూజలందుకొంటానని విష్ణుమూర్తి తెలపగా గరుక్మంతుడు గరుడాద్రి పర్వతంగా వెలిశాడని స్థలపురాణం. ఇక్కడ ఆలయంలో స్వామి గుర్రం పై కూర్చున్నట్టు లక్ష్మిదేవి క్రింద వెలసినట్లు దర్శనమిస్తారు. కొండ దిగువన విశాలమైన మరొక ఆలయంలో శ్రీ పద్మావతి సమేత వెంకేశ్వరస్వామి దర్సనమిస్తాడు. ఆలయాన్ని ఆనుకొని రెండు పుష్కరుణులు క్షేత్రానికి ప్రత్రేక శోభను చేకూర్చుతున్నాయి. ఎత్తయిన పర్వతం, సుందరమైన ఆలయ బేడామండపం, ఇతర కట్టడాలు ఆనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటి చెపుతాయి. ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి .ప్రస్తుతం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనం లో ఆలయం నడుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవస్తానం అభివృద్ధి భాద్యత తీసుకొన్నారు.

కొండకర్ల ఆవ :

DSC08470
యలమంచిలికి ప్రక్కన ఉన్న అచ్యుతాపురం మండలం లో సహజసిద్దంగా ఏర్పడిన మంచినీటి సరస్సు’ కొండకర్ల ఆవ.’ ఇది రాష్ట్రంలో కొల్లేరు సరస్సు తర్వాత రెండవ పెద్ద మంచినీటి సరస్సు. ఒక వైపు కొండలు, వేరొక వైపు కొబ్బరిచెట్లు ఆవకు ప్రత్యేక అందాన్ని చేకూర్చుతున్నాయి. సరస్సు లోని వివిధ రకాల నీటి మొక్కలు, రకరకాల పక్షులు, ప్రకృతివీక్షకులకు కనువిందు కలగజేస్తాయి. నవంబరు, డిసెంబరు నెలల లో సైబీరియా మొదలగు అనేక దేశాల నుండి పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. అందమైన విదేశీ పక్షులు సందర్శకులను ఆకట్టుకొంటాయి. ఈ సరస్సు అందానికి ముగ్ధులైన ఫ్రెంచి వారు ఆవకు సమీపంలో ‘ప్రెంచ్ భవనాన్ని’నిర్మించారు. స్వాతంత్ర్యం రాకముందు విజయనగరం మహారాజులు వారాంతరపు విడిది గా ( holiday resort) ఇక్కడకు వచ్చేవారు. ఆవలో దోనె షికారు ఎంతో ఉషారుగా ఉంటుంది. ప్రకృతి రమణీయత నవంబరు నుండి ఫిబ్రవరి వరకు బాగుంటుంది. ఆవకు దగ్గర లో నున్న చూచికొండ గ్రామం వరకు రోడ్డు సౌకర్యం ఉన్నది.ఆవకు గిగువన వాడ్రాపల్లి గ్రామం ఉన్నది ఆవ లో కొంతభాగం ఆక్రమణలకు గురిఅయింది. ఇక్కడ పర్యాటక శాఖవారి అధితి గృహాలు గాని, లాడ్జీలు గాని లేవు. కొందరు గృహస్థులు తమ ఇళ్లలో వసతిసౌకర్యం కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖవారు శ్రద్ధ తీసుకొని రవాణసౌకర్యం, వసతి గృహాల నిర్మాణం వంటి ఏర్పాట్లు చేస్తే ఇది మంచి పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చెందుతుంది.

లక్కబొమ్మల ఏటికొప్పాక :

Koppaka Toys

యలమంచిలి కి 20 కి.మీ.దూరంలో వరాహనది ఎడమ ఒడ్డున ఉన్న గ్రామం ఏటికొప్పాక. ఈ గ్రామజనాభా 12000. బొమ్మల తయారీలోఆంధ్రప్రదేశ్ లోకొండపల్లి తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రామం ఏటికొప్పాక. ఈ గ్రామానికి కొయ్యబొమ్మల తయారీ లో200 సం.ల చరిత్ర ఉన్నది. స్థానిక హస్తకళా నిపుణులు దగ్గరలో నున్న కొండలలో దొరికే ‘ అంకుడుకర్ర ‘అనే మెత్తని కర్రను ముక్కలుగా నరికి ఎండబెట్టి, శుభ్రంచేసి చేతి అడ్డలపై (ఒక పెద్ద చక్రానికి, దానికి కొంతదూరం లో ఒకచిన్నచక్రాన్నిఉంచి రెండింటికి ఒక బెల్టు బిగించి పెద్దచక్రాన్ని ఒక వ్యక్తి త్రిప్పుతుంటే, కళాకారుడు చిన్న చక్రానికి కొయ్య బిగించి చిత్రిక పట్టే సాధనం) ఉలి, బాడిత వంటి సాధారణ పనిముట్లతో కర్రముక్కలను చిత్రికపట్టి, నునుపుగా చేసి, పిల్లలు ఆడుకొనే బొంగరాలు, గిలకలు, లక్కపిడతలు మొదలగు ఆట బొమ్మలు చేసి వాటికి వివిధ లక్క రంగులు పట్టించి స్థానిక సంతలలోఅమ్మేవారు. కాని ఈ లక్క బొమ్మలకు ప్రాచుర్యం కలిగించిన వ్యక్తి విజయనగరానికి చెందిన పద్మనాభరాజు. ఈయన ఈ గ్రామానికొచ్చి 1911 లో లక్కబొమ్మల తో వ్యాపారం మొదలు పెట్టారు. అతని తర్వాత ఆయన వారసుడు చిట్టిరాజు హస్త కళాకారులను సంఘటిత పరచి కొత్త డిజైన్లతో రకరకాల బొమ్మలు చేయించి అమ్మేవారు.ప్రస్తుతం ఈతని మేనల్లుడు చింతలపాటి వెంకటపతి రాజు ఏటికొప్పాక కొయ్యబొమ్మలకు ప్రపంచఖ్యాతి తేవాలనే ఉద్దేశం తో స్థానిక కళాకారులతో పద్మావతి అసోసియేషన్ అనే హస్తకళాకారుల సహకార సంఘాన్ని 1984 లోస్థాపించి, వారికి ఆంధ్రా యూనివర్సిటి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫేషన్ టెక్నాలజీ వంటి సంస్థల సహకారం తో కొత్త డిజైన్లు చేయడం లక్కలో రసాయినిక రంగుల మిశ్రమాలు కలపడం మొదలగు మెళుకువలు నేర్పుతున్నారు..వివిధ ప్రాంతాల హస్తకళా నిపుణులను రప్పించి ఇక్కడ వారికి శిక్షణనివ్వడం, ఇక్కడ వారిని దేశం లో వివిధ హస్తకళాప్రదర్శనలకు తీసుకువెళ్ళడం వంటివి చేస్తున్నారు. ఆకర్షణీయమైన రంగులలతో, వివిధ ఆక్రుతలతో తయారయ్యే కొయ్యబొమ్మలు మనల్ని ఎంతగానో ఆకట్టుకొంటాయి. వినాయకుడు, వెంకటేశ్వరస్వామి మొదలగు దేవతామూర్తుల బొమ్మలు, కొంగలు, చిలకలు మొ|| గు పక్షులు, కుందేళ్ళు,గాజులస్టాండు ,పెన్ను స్టాండు, లక్కపిడతలు, గిలిగిచ్చికాయలు, చదరంగపు పావులు, భరెణలు ,తల్లి-పిల్ల, బజాజ్ స్కూటర్ మొ|| బొమ్మలు రాష్ట్రంలోని లేపాక్షి ఎంపోరియం, దేశంలోని అనేక హస్తకళా కేంద్రాలకు, అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్సు మొ|| విదేశాలకు ఎగుమతి అవుతాయి. కళాకారులు అనేకజాతీయ బహుమతులు గెలుచుకొన్నారు. ఇతర ప్రాంతాల హస్తకళా నిపుణులు బస చేయడానికి గెస్ట్ హౌస్ ఉన్నది. ప్రస్తుతం అంకుడు చెట్లు కనుమరుగు అవుతుండడంవల్ల ఈ వృత్తిపై ఆధారపడి జీవించే 200 మంది ఆందోళన చెందుతున్నారు. చింతపల్లి అడవులలో అంకుడు చెట్లు పెంచాలని వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను కోరుతున్నారు.

భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ :

BCT
బి.వి.పరమేశ్వరరావు
గ్రామీణ భారతం స్వయంపోషకత్వం తో స్వయంపాలన సాధించడమే స్వరాజ్ లక్ష్యం గా గాంధీజీ పేర్కొన్నారు . అటువంటి ఆశయం తో, దేశం లో గత 40 సం. లు గా గ్రామీణ వికాశానికై పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్తల లో ప్రముఖ సంస్త గా గుర్తింపు పొందిన భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ ( బి.సి.టి ) యలమంచిలి దగ్గరలో నున్న హరిపురం గ్రామంలో నున్నది. దిమిలి గ్రామానికి చెందిన శ్రీ భాగవతుల వెంకట పరమేశ్వర రావు అమెరికా లోని పెన్సిల్వేనియా యూనివెర్సిటీ నుండి అణుభౌతిక శాస్త్రం లో పి.హెచ్.డి. డిగ్రీ పొందిన తర్వాత తన గ్రామానికొచ్చి అక్కడ గ్రామీణ పేదరికాన్ని,అవిద్యను చూసి చలించిపోయారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ సంస్థ తమ సంస్తలో అణు శాస్ర్తవేత్తగా చేరమని ఆహ్వానించినా చేరకుండా గ్రామీణాభివృద్దికి అంకితమయ్యారు. దిమిలి గ్రామం లో హైస్కూలు ఏర్పాటు చేయడం లో సఫలమైన శ్రీ పరమేశ్వర రావు, అదే ప్రేరణతో 1973 లో భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్తను స్తాపించారు .వ్యవసాయం, స్త్రీల స్వావలంభన,కుటీరపరిశ్రమలు, విద్య ,ఆరోగ్యం, వికలాంగుల పునరావాసము మొదలగు ఆశయాలతో ట్రస్ట్ కార్యాచరణ కు దిగింది. బి.సి.టి వారి దృష్టిలో ఉపయోగించని భూమేకాని ఉపయోగపడని భూమంటూ ( waste land ) ఉండదు.ఆ విషయం నిరూపించడానికి పంచదార్ల గ్రామం లోని ఎటువంటి చెట్టూ చేమా లేని, రాతి మయమయిన 50 ఎకరాల కొండ వాలును లీజుకు తీసుకొని 3 సం.లలో 100 రకాల వృక్ష జాతులను పెంచి చక్కటి బొటానికల్ గార్డెన్ గా తీర్చి దిద్దారు.

దానిని స్పూర్తిగా తీసుకొని ,వీరి సహకారం తో, దగ్గర గ్రామాల రైతులు వృదాగా వదిలేసిన ఐదు వేల ఎకరాల బంజరుభూములను సస్యశ్యామలం గా తీర్చి దిద్దుకొన్నారు. 1995 లో ఇండియన్ కౌన్సిసిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ సంస్థ తమ ‘కృషి విజ్ఞ్యాన కేంద్రాన్ని ‘ఇక్కడ ఏర్పాటు చేసి రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులలో శిక్షణ, సలహాలు, పరిశోధనలు చేస్తున్నారు. గ్రామీణ నిరుపేద స్త్రీలు ఇంటిపనులకే పరిమితమవడాన్ని గమనించి వారి స్వావలంబన కై అనేక పధకాలు ప్రవేశపెట్టారు.కోళ్ళపెంపకం, పాడిపశువులుపెంపకం, విస్తరాకులు కుట్టడం, అప్పడాలు,పచ్చళ్ళు తయారుచెయ్యడం,కొయ్యబొమ్మలు చేయడం వంటి పనులలో తర్ఫీదునిచ్చి వారికి స్వయం ఉపాధి పధకాలను కల్పిస్తున్నారు. అందుకు కావాల్సిన స్వల్ప పెట్టుబడిని అప్పుగాఇచ్చి,తిరిగి వాయదాల పద్దతిలో అప్పుతీర్చుతూ,సపాదించిన దానిలో కొంత పొదుపు చేయించే’ పొదుపు పధకం’ ద్వారా తమపెట్టుబడిని తామే సమకూర్చుకో గలిగే స్వయం సహాయక బృందాలుగా వారిని తీర్చి దిద్దేరు. ఈ పొదుపుపధకం ప్రపంచ బ్యాంక్ ను కూడా ఆకర్షించినది .డ్వాక్రా వంటిపధకాలు ఇటువంటి పధకాల నుండి రూపుదిద్దుకోన్నవే.
విద్యారంగం లో వెనుకబాటుతనాన్ని తొలగిచడానికి గ్రామీణ ప్రాంతాలలో వందకు పైగా ఆయనిత విద్యాకేంద్రాలుప్రారభించేరు. ఆయనితవిద్యారంగం లో వీరి కృషిని గమనించి కేంద్రపభుత్వపు జాతీయ సాక్షరతా మిషన్ ,విశాఖజిల్లా లో ఏడు వందల రాత్రిబడులు నిర్వహించే బాధ్యత బి.సి.టి. కిఅప్పగించారు. వీరు 72 ప్రయోగాత్మక పాటశాలలు నడుపుతున్నారు. సాధారణ విద్యతో పాటు వృత్తివిద్య ఆవశ్యకత ఎంతైనా ఉందని,వీరు వృత్తివిద్యా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసారు. పంచదార్ల లో మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహిస్తున్నారు.ఆరోగ్యరంగంలో నాటు మంత్రసానులకుశిక్షణఇచ్చిప్రసూతిమరణాలను అరికట్టగలిగారు..యలమంచిలి,హరిపురం,దిమిలి గ్రామాలలో ఆసుపత్రులను నడుపుతున్నారు. వికలాంగుల పునరావాసానికి కూడా కృషి చేస్తున్నారు.వీరు నడిపే వికలాంగుల పునరావాస శిక్షణా కేంద్రంలో వ్యవసాయం, టైలరింగ్ ,కాగితపు సంచులు చేయుట తదితర వృత్తులలో శిక్షణనిచ్చి వారికి వైకల్యాన్ని జయంచడమెలాగో నేర్పుతున్నారు. గ్రామీణవికాశానికై వీరు చేస్తున్న ప్రయోగాలను పరిశీలించేందుకు దేశ ,విదేశాల నుండి అనేకమంది ఔత్యాహికులు బి.సి.టి.ని సందర్శిస్తారు.ఈయన 9.6.2019 న విశాఖపట్నం లొ మరణించారు.

సాగరతీరం రేవుపోలవరం

IMG_20160117_172018

యలమంచిలి కి హైవే మీదుగా 15 కి.మీ.దూరం లో రేవుపోలవరంవద్ద విశాలమైన,సుందరమైన సాగర తీరం ఉన్నది.ఎత్తైన ఇసుక తిన్నెలు,సముద్రం లోపలకి వేసిన ఫిషింగ్ హార్బర్ జెట్టి, సముద్ర తీరం దగ్గరలో కొబ్బరి,సరుగుడు తోటలు, మరొక వైపు సముద్రం లో చిన్నబోటు లతో చేపలను వేటాడే మత్యకారులు తొ సందర్శకులను ఆకట్టుకొనే విధం గా ఆహ్లాదకరం గా ఉంటుందీ తీరం. సముద్ర తీరాన ముత్యాలమ్మ ,బంగారమ్మ గుడులతోబాటు భౌద్ధ అవశేషాలు కూడా ఉన్నాయి. తీరాన్న అనుకొని ఉన్న కొండ పై లక్ష్మీమాధవస్వామి ఆలయం ఉంది. కొండపై ఆకర్షణీయమైన శివ పార్వతుల విగ్రహాలను నిర్మించారు. ఈతీరంలో శివరాత్రి,మాఘ పౌర్ణమి రోజులలో వేలాది మందికి భక్తుల సముద్ర స్నానమాచరిస్తారు. రోజూ ఈ బీచ్ కి వచ్చే సందర్శకుల తోనూ , కార్తీకమాసం లో నెలంతా పిక్నిక్ బృందాలతో సందడిగా ఉంటుంది.

13.చారిత్రిక గ్రామం దిమిలి

Dimili
శతాబ్దాల తరబడి విశాఖజిల్లా లో ఎత్తైన ఆలయగోపురాలు,ఉన్నత విధ్యావంతులు ఆడర్శభావాలుకల జనావళితొ, యలమంచిలికి దగ్గరలోనున్న చారిత్రికప్రాధాన్యత గల గ్రామం దిమిలి.
కళింగదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజుల శాసనాలవల్లయలమంచిలికి రెండున్నర మైళ్ళ దూరంలో ‘దివ్వెల’ అనే ప్రాచీన ఓడరేవు కలదని బంగాళాఖాతంలో ప్రయాణం చేసే ఓడల రాక పోకలకు గుర్తు తెలియడం కోసం ఇక్కడ పెద్ద దీపస్తంభాలుండేవని ఇందు మూలంగాగానే ఆగ్రామానికి ‘దివ్వెల’ అనే పేరు వచ్చి కాలక్రమేణా ఆపేరు దిమిలి గా నామాంతరం చెందింది. ఆనాడు సముద్రం ఈ గ్రామం వరకు వుండేదని చెప్పడానికి ఈ గ్రామానికి చేరువలోఉన్న ‘తెరువుపల్లి’ గ్రామంలో గల రత్నాకరస్వామి దేవాలయం ఒక నిదర్శనం.సముద్రయానం చేసే ప్రయాణీకుల ఓడలకు తెరవు(దారి)చూపించి ఆశ్రయమిచ్చేది కనుకనే ఆగ్రామానికి తెరువుపల్లి అనేపేరు వచ్చింది.సముద్రయానానికి ముందు వర్తకులు రత్నాకరస్వామిని పూజించి బయలుదేరేవారు.దిమిలి లో ‘నగ్నేశ్వరస్వామి’ ఆలయం దానికి కొద్దిదూరంలో వల్లభానారాయణస్వామి దేవాలయం ఉన్నది.వీటిని వీరుశివ కేశవుల ఆలయా లుగా భావిస్తారు..ఈ స్థల పురాణం గురించి ఎటువంటి వివరణ ఇచ్చినా, ఈ నగ్నేశ్వర స్వామి ఆలయం ఒకనాటి ‘ దిగంబర జైనస్వామి’ ఆలయమని ప్రఖ్యాత పరిశో ధకులు ఆరుద్ర భావిస్తున్నారు. నగ్నేస్వరస్వామి, వల్లభనారాయణస్వామి దేవాలయాల స్తంభాలమీద పాళీ భాషలో లిఖించబడ్డ అనేక చారిత్రిక విషయాలున్నాయి.చారిత్రిక పరిశోధకులు వాటిని గ్రంధస్తం చేసి, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర సెంట్రల్ లైబ్రరీ చారిత్రిక విభాగంలో విశాఖజిల్లా చరిత్రలో పొందుపరిచారు.
దిమిలి ద్రావిడ భ్రాహ్మణ అగ్రహారం. ఇప్పటికి సుమారు 700 సంవత్సరాల క్రితం వింధ్య పర్వతాలను దాటి తమిళనాడు కావేరి తీరానికి, అక్కడనుంచి కొంతమంది గోదావరి ప్రాంతానికి వలసవచ్చి ఆంధ్రులుగా మారిన వైదిక బ్రాహ్మణ సముదాయం గా వీరిని గుర్తించవచ్చు.వీరిలో ముఖ్యమైన తెగలు మూడున్నాయి .ఒకటి పేరూరి ద్రావిడులు.వీరు పెద్ద ద్రావిడులు.రెండు:దిమిలి ద్రావిడులు, మూడు:ఆరామ ద్రావిడులు. దిమిలి ద్రావిడులు, ఆరామ ద్రావిడులు చిన్నద్రావిడులు.అందుకు కారణం గోదావరి దాటితే అగ్నిహోత్రాలారిపోతాయని ,అట్లు ఆరిపోవడం వల్ల శిష్టత్వానికి నిగ్గుతగ్గుతుందని, నదిని దాటకుండా బ్రాహ్మణత్వానికి భంగం వాటిల్లకుండా పేరూరు లో ఉండిపోయినవారు పెద్దద్రావిడులు. ఆరామం లో నివాసమేర్పరచుకున్నావారు ఆరామ ద్రావిడులు. ఎలమంచిలి ప్రాంతం లో దిమిలి లో కాపురం ఏర్పరుచుకన్నవారు దిమిలి ద్రావిడులు.అదే పేరు ఇప్పటికి ఆ శాఖకు నిలిచిపోయింది.
గ్రామాన్ని ఆనుకొని ప్రహించే నది శారదానది.నడదికిరుప్రక్కల గ్రామంలో సుమారు మూడువందల ఏబైకి పైగా బ్రాహ్మణగడపలుండేవి. నిత్యంవేధఘోషతొ ,యజ్ఞయాగాది క్రతువులతో,వేదశాస్త్రాలలో నిస్ట్నాతులైన అనేకమంది పండితులతో నిండి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కళకళ లాడుతూ ఉండేది,వేధాధ్యయనానికి వచ్చిన విద్యార్ధులకు రోజుకు ఒక ఇంట్లో భోజనసడుదుపాయం చేస్తే ఒక విద్యార్ధికి వేసిన ఇంట్లో విస్తరి మళ్ళీ వేయడానికి ఒక సంవత్సరకాలం పట్టేదట. అపరకాళిదాసుగాను,కవిగురువు,సమస్తాగమ సర్వతంత్ర గాను పేరుపొందిన పూడిపెద్ది లింగమూర్తి ,డాక్టర్.బి.వి.నాద్, మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగంశ్రీనివాసరావు) ,ఆరుద్ర(భాగవతుల శంకర శాస్త్రి) ,శ్రీరంగం నారాయణ బాబు, లు దిమిలి ద్రావిడులే.
కొంతకాలం క్రిందట ఒరిస్సా నుండి శిష్టకరణాలనే తెగవారీ గ్రామానికి తరలివచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకొన్నారు.వీరు సంస్క్రుతాంధ్రభాషలలోను, మంత్రతంత్రాలలోనూ మంచి దిట్టలు. దిమిలి ద్రావిడులు,శిష్టకరణాల వారు ఉచ్చస్థితి లో ఉన్నప్పుడు గ్రామం దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేది.
1820 సం.లో విజయనగర సంస్థానాధీశులకు ఈ గ్రామ జమిందారైన “ భాగవతుల “వారు సామంతులుగా ఉండి సంస్థానానికికట్టవలసిన కప్పం చెల్లించకపోవడం వల్ల జమిందారీ రద్దయి ,గ్రామం తిరిగి సంస్థానంలో కలిసిపోయింది.
తెలుగు లో తొలి యాత్రాగ్రంధమైన(travelogue) ఏనుగుల వీరాస్వామయ్య1831సం.లో తన’ కాశీయాత్ర’ గ్రంధం లో కాశీ నుండి గంజాం మీదుగా చెన్నపట్నానికి తిరుగు ప్రయాణం లో తాను చూసిన ప్రదేశాలను గురించి గ్రంధస్తం చేస్తూ 23 వ ప్రకరణలో “……..14తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 7 కోసులదూరములో నుండే కసంకోట అనేవూరు 6 గంటలకు చేరినాను. దారిలో అనకాపల్లి యనే మజలీవూరు వున్నది……….కసంకోట యనే వూరు గొప్పదేను. అన్ని పదార్ధాలు దొరికేపాటి అంగళ్ళు కలవు.భ్రాహ్మణ యిండ్లలో వంట,భోజజము కాచేసుకుని వొక గంటకు బయలుదేరి యిక్కడికి యేడుకోసులదూరములో నుండే యలమంచిలి యనే వూరు 7 గంటలకు చెరినాను.
నేటి మధ్యాహాన్నము దారిలో వ్యాఘ్రభయాలుకూడా కద్దు. యిది మజలీవూరు అయినప్పటికిన్ని దారి వొత్తి వొకకోసు దూరములో వుండే దివ్యల అనే గ్రామ నివాసి యయిన భాగవతుల కిత్తన్న ఎదురుగా వచ్చి తన వూరికి రమ్మని ప్రార్దించినందున ఆ వూరు 7 గంటలకు ప్రవేశించి ఆ రాత్రి ఆ మరునాడు శుక్రవారము వర్షం ప్రతిభందముచేత నిలిచినాము. యీ వూరు 100 యిండ్ల అగ్రహారము.అందరు ఉపపన్నులు అయినప్పటికిన్ని వొక యతి శాపము చేత పెంకుటిండ్లు కట్టక పూరియింద్లలో కాపురము చేయుచున్నారు. యీ వూళ్ళో వుండే బ్రాహ్మణులందరు వేదపారంగతులు.కిత్తయ్య యనే వారు జమీన్ దారుడున్ను , మంచి సాంప్రదాయికుడున్ను. యీ వూళ్ళో అంగళ్ళు కలవు. అన్ని పదార్దాలు దొరుకును.
16 తేది వుదయాత్పూర్వమున 4 గంటలకు లేచి యిక్కడకి 5 కోసుల దూరములో నుండే నక్కపల్లి వుపమాకా యనే వూళ్ళు 9 గంటలకు చెరినాను. ………..” అని ఏనుగుల వీరాస్వామయ్య వ్రాసారు.
దిమిలి కళాపోషణ లోను కళాశిక్షణలోనూ అందెవేసిన కళాకారులుదేవారు.రంగస్థలనాటకాలు ప్రదర్శించబడే తొలిరోజులనుంచి నాతకరంగం లో ఈ గ్రామానికొక ప్రత్యెక స్థానం ఉండేది.అరవై సంవత్సరాల క్రితం వరకు జిల్లాలోని ఇతర గ్రామాల,పట్టణాలలో ఉండే ఔత్సాహికనాటక బృందాలు ఈగ్రామానికొచ్చి ఇక్కడ నటకులతో కలిసి ప్రదర్శనలిచ్చేవారు.
1915సం.లో ఉద్యోగరీత్యా దిమిలి లో ఉండే పురుషోత్తమపురం వాసి శ్రీ గన్నంరాజు జోగారావు మాస్టారు 25 పుస్తకాలతో ఒకమిద్దె ఇంట్లో స్థాపించ ‘భారతీగ్రంధాలయం’ 1957 నాటికి విశాలమైన రెండు గదులు అన్నిసడుపాయాలతొ కూడిన భవనాన్ని ప్రజల సహకారంతొ నిర్మిచుకొని అనేక పత్రికల, ఐదువేలపుస్తకాలతో పరిపూర్ణత పొందింది.ఈ గ్రంధాలయం దిమిలి ప్రజలకు విజ్ఞానాన్నిఅందించడమే గాక శ్రీ జోగారావు మాస్టారు గ్రామం లో అనేకమంది యువకులను చైతన్యపరిచి వారి పురోభివృద్దికి బాటలు వేసిన ఆదర్శ ఉపాధ్యాయులు. 1970 సం.నుంచి ఈ గ్రంధాలయం విశాఖపట్నం జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నది.
భారత స్వాతంత్రసమరం లో జాతిపిత గాంధీజీ పిలుపునందుకొని ఆనాటి గ్రామయువకులనేకమంది కొదమసింహాల్లా స్వరాజ్యసమరం లోకిదూకారు. విశాఖజిల్లా నలుమూలనుంచి సత్యాగ్రహులందరు వచ్చి ఈ గ్రామమందే ఉప్పు సత్యాగ్రహం లోనూ,ఇతర సత్యాగ్రహాలలోనూ పాల్గొన్నారు.శారదానది ఇసుకతిన్నెలమీద రెపరెపలాడే త్రివర్ణపతాకాలను ప్రతిష్టించి సత్యాగ్రహ శిభిరాలను నడిపారు.మిస్సుల వీర వెంకట సత్యనారాయణ (చిరంజీవి),శానాపతి అప్పలనాయుడు, అనే దేవుళ్ళు, ఎళ్ళాయి నారాయణరావు, డబ్బీరు శచీపతిరావు,శిష్ట్లా లింగమ్మ ,శిష్ట్లా కామేశ్వరరావు,శిష్ట్లా రామదాసు మొదలైన ఆనాటి యువతీ యువకులు ఉద్యమం లో పాల్గొని గ్రామప్రజలో ఉద్రేకాన్ని, నూతనోత్సాహాన్నికలిగించారు.పసికందులతో సహా స్వాతంత్రోధ్యమంలోపాల్గొన్న కుటుంబాలెన్నో ఉన్నాయి యీ గ్రామంలో.స్వాతంత్రసముపార్జన కొరకు లాఠీ దెబ్బలుతిని,తమ సర్వస్వం త్యాగం చేసి జైలు జీవితాలకు అంకితమై, ఎన్నోకష్టనష్టాలనెదుర్కొని ,బ్రిటిష్ పాలకులను గజగజలాడించి ,దేశచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మరపురాని మధుర ఘట్టాలను సంతరించుకొని “ఆంధ్రాబార్డోలీ”పేరు గాంచిందీగ్రామం.
ఇక్కడ 1896లో ప్రాధమిక పాఠశాల ప్రారంభిచబడింది.అద1918 సం.లో ప్రాధమికోన్నత పాఠశాలగా మార్పు చెందింది. 1967 లో అమెరికా నుండి తిరిగివచ్చిన డాక్టర్ భాగవతుల పరమేశ్వరరావు హైస్కూల్ స్థాపనకు నడుంబిగించి గ్రామస్తుల సహకారం,శ్రమదానంతొ అధునాతన వసతులున్న ఎనిమిది గదులతో ‘ భాగవతుల సోమన్నహైస్కూల్’ ను ఏర్పాటు చేసారు.దీనినిర్మాణానికి ఆనాటి గవర్నర్ కండూభాయ్ దేశాయ్ గారు ముఖ్య మంత్రి పి.వి.నరసింహారావు గారు కొంత గ్రాంట్ అందచేసారు. ఇది మోడల్ హైస్కూల్ గా పది సంవత్సరాలు కొనసాగింది. 1971లో మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి గారు స్వయంగా ఈగ్రామానికి వచ్చి పాఠశాలను తిలకించారు. దీని ఆర్ధిక భారం మోయలేక గ్రామస్తులు జిల్లా పరిషత్ వారికి అప్పగించారు.
విశాఖ జిల్లాలో తొలి గ్రామీణ సహకార పరపతి సంఘాలో ఒకటిగా ,ఇక్కడ 1920 సం.లో ఒక సహకార సంఘం ప్రారంభించబడింది. adi1956 లో విస్తృత సహకార పరపతి సంఘం గా రూపొందింది.
రాజకీయంగా చైతన్యవంతమైనగ్రామం కావడం వల్ల నియోజకవర్గ రాజకీయాలోకూడా ఈ గ్రామం కీలక పాత్ర పోషిస్తున్నది.ఇంతవరకు శాసన సభకు జరిగిన ఎన్నికలలో ఈగ్రామవాసులు, 1951 సం.లో కృషికార్ లోక్ పార్టీ తరఫున శ్రీ పప్పల బాపినీడు ,1967 లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా శ్రీ నగిరెడ్డి సత్యనారాయణ,తెలుగు దేశం పార్టీ తరుపున 1985,1989,1994,1999 సం.లలో నాలుగు సార్లు శ్రీ పప్పల చలపతి రావు లు శాసనసభ ఎన్నికలో ఘన విజయం సాధించారు. 2004 లోక్ సభ ఎన్నికలో శ్రీ పప్పల చలపతి రావు పార్లమెంట్ సభ్యునిగా గెలిచారు.2015 లో శ్రీ పప్పల చలపతిరావు గారు శాసన మండలి సభ్యునిగా ఎన్నికైనారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 సం.లో గ్రామపంచాయితీ ఏర్పడింది. గ్రామస్తులు స్వయంకృషితో ఈనాడు ఒక ఆదర్సప్రాయమైన ఉన్నత పాటశాల,మంచినీటి కోనేరు,చక్కని రోడ్డులు, ఇంకా అనేకకార్యక్రమాలు చేపట్టి,పొదుపు ఉద్యమంలో ఆదర్శప్రాయ మైనదిగా రాష్ట్రగవర్నర్ ప్రశంసలు పొంది ,గత చరిత్రను స్మరించుకొంటూ భవిష్యత్తుకు వెలుగుబాటలు దిద్దుకుంటూ ,నూతనోత్సాహంతొ పిలుస్తున్న కాలంతొ ముందుకు నడస్తున్నారీ గామస్తులు.

14.ఈ ప్రాంతపు ప్రముఖులు

Gurajada
మహాకవి గురజాడ అప్పారావు;

దేశమును ప్రేమించు మన్న
మంచి అన్నది పెంచుమన్నా;
వొట్టి మాటలు కట్టిపెట్టోయి
గట్టి మేల్ తలపెట్ట వోయి !
వంటి గొప్ప దేశభక్తి గీతాన్ని, అభ్యుదయకవితలను ‘ముత్యాలసరాలు’గా గుచ్చిఆంద్రదేశానికి అందించి, బాల్య వివాహాలులాంటి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ ‘కన్యాశుల్కం’వంటి సాటిలేని మేటి నాటకాన్ని ,దిద్దుబాటు, మీపెరేమిటి వంటి కదానికలతో వ్యవహారిక భాషోద్యమానికి పాటుపడిన నవయుగ కవితా వైతాళికుడు,సంఘ సంస్కర్త ,హేతువాది, అయిన మహాకవి గురజాడ వేంకట అప్పారావు యలమంచిలి తాలూకా ఎస్..రాయవరం గ్రామం లో 1862 సెప్టెంబర్ 21 వ తేదిన మతామహుల ఇంట జన్మించారు. తండ్రి పేరు రామదాసు,తల్లి పేరు కౌసల్యమ్మ. గురజాడ వారి బాల్యం కొంతకాలం ఎస్.రాయవరం లో గడిచింది. ఇక్కడ గురజాడ పేరిట ఓ వేదిక,కూడలిలో విగ్రహం నెలకొల్పారు. ప్రతి ఏటా గురజాడ జయంతి,వర్దంతి వేడుకలను ఎస్.రాయవరం ప్రజలు గురజాడ ఫౌండేషన్ ఆద్వర్యం లో ఘనంగా నిర్వహిస్తారు.యలమంచిలి ప్రబుత్వ డిగ్రీ కళాశాలకు ఈ మహనీయుని పేరు పెట్టి ప్రజలు తమ గౌరవాభిమానాలను చాటు కొన్నారు.

గొబ్బూరి వెంకట రాఘవానందరావు : యలమంచిలి వాసియైన శ్రీ గొబ్బూరి వారు సంస్కృతాంధ్ర,ఆంగ్లభాషలో పండితులు. విజయనగరం లో విద్యనభ్యసించి,అనకాపల్లి మునిసిపల్ హైస్కూలు సైన్స్ టీచర్ గా పనిచేసిన వీరు మద్రాసు ఆంధ్రసభ 1918 సంవత్సరం లో ‘ఆంద్రవచన రచనా దశా పరిణామము’ అనేవ్యాస పరీక్షలో స్వర్ణపతకం గెలుచుకొని 1923లో ‘ఆంధ్ర గద్య వాజ్మయ చరిత్ర’ అనే గ్రంధాన్నిరచిచారు.ఇది తెలుగులో వచన వాజ్మయం పై వెలువడిన తొలిగ్రంధం.దీనిని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,హైదరాబాద్ వారు 2002 లో పునర్ముద్రించేరు. ’జ్యోతిర్వేదం’ , ‘ స్క్రిప్చర్ ఆఫ్ ది హెవెన్స్ ‘ అనేవి వీరి ఇతర రచనలు.
ఆచార్య బర్రే రామచంద్రరావు :బి.ఆర్. గా సుప్రసిద్దులైన బర్రే రామచంద్ర రావు సుప్రసిద్ద భౌతిక శాస్త్రవేత్త .రోదసీ రంగ పరిశోధకులు.ఈయన 1922 యలమంచిలి లో ఒక మత్యకార కుటుంబం లో జన్మించారు.1945 లో ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఎస్సీ ఫిజిక్స్ పట్టా తీసుకొని ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త డా.సూరి భగవంతం నేతృత్వంలో ‘అల్ట్రాసోనిక్ కిరణాలు-వాటి పయనం’ అనే అంశంపై పరిశోధన చేసి 1949 లో డాక్టరేట్ పట్టాను అందుకొన్నారు.ఆయన ‘అయినోమండలం,రోదసిరంగాల లో పలు పరిశోధనలు చేసి పలు గ్రంధాలు రచించారు. ఈయన యు.జి.సి. వైస్ చైర్మన్ గా రెండు పర్యాయాలు(1976 నుంచి 1982వరకు )వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమి అభివృద్దికి కృషి చేసారు.శ్రీమతి ఇందిరా గాంధి చే రాజ్య సభకు నియమించబడ్డారు. 1965లో ప్రతిష్టాత్మక శాంతిస్వరూప్ భాట్నగర్ అవార్డ్ అందుకొన్నారు.

గొల్లకోట బుచ్చి రామ శర్మ: ఈయన యలమంచిలి లో 20.2.1916 లో జన్మిచారు.తండ్రిపేరు గొల్లకోట సోమయాజి.ఈయన ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు లో ఎమ్మేస్సీ చదివి, యూనివర్సిటీ ఆఫ్ విన్ కిన్ సన్ నుండి పి.హెచ్డీ చేసారు.ఈయన బ్రైట్ కంపెనీ వారి రాప్టోకస్ లో బయో కెమిస్ట్ గాచేరి అనేక పదవులు పొందారు.1949 లో రాయల్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోషిప్ అందుకొని జీవరసాయన శాస్త్రం ,పౌష్టికాహారం, ఫార్మాస్యూటికల్ రంగాలలో అనేక పరిశోధనలు చేసారు.ఈయన 1970 లో పి.సి రాయ్ అవార్డ్, 1979 లో ప్రోఫెసర్ ఎం.సి.స్కపో మెమోరియల్ అవార్డ్,1986 లో ఎం.సి.ఖొరానా మెమోరియల్ లెక్చరర్షిప్ మొదలగు పలు గౌరవ మన్ననలు పొందారు.
దండు విశ్వేశ్వర రాజు : ఈయన యలమంచిలి తాలూకా ఎస్.రాయవరం దగ్గర లింగరాజుపాలెం గ్రామం నందు 1943లో జన్మించి, కాకినాడ ఇంజినీరింగ్ కాలేజి లో బి.ఈ,వరంగల్ లో ఎం. టెక్ చదివి 1968 లో ఇస్రో లో శాస్త్రవేత్త గా ప్రవేశించి భారతీయ తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట ‘ప్రయోగ సమయంలో యువశాస్త్రవేత్తాగా గుర్తింపు పొందారు.తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ లోను,సేటలైట్ ఎర్త్ స్టేషన్ అధిపతిగాపనిచేసి 1992 లో పదవీవిరమణ చేసారు.
శ్రీ బుర్రా వెంకటప్పయ్య : యలమంచిలి తాలూకా దార్లపూడి గ్రామంలో జన్మించి,అర్ధ శాస్త్రం లో నిపుణులైన వీరు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిప్యూటి గవర్నర్ గా పనిచేసిన సుప్రసిద్ద ఆర్ధికవేత్త.
ఆడారి వీరునాయుడు:ఈయన గ్రామ సర్పంచ్ గా మూడు దశాబ్దాలు పనిచేశారు.ఈయన స్మృతి చిహ్నం ‘శతకంపట్టు వీధి’లో నేటికి ఉన్నది.నేటి విశాఖ డైరీ చైర్మన్ శ్రీ ఆడారి తులసీరావు వీరి మనుమలు.
డబ్బీరు భారతీ రావు : దిమిలి లో జన్మించి ,అనేక రైతు ఉధ్యమాలలో పాల్గొని రైతాంగ సమస్యల పై పోరాడారు.ఈయన కృషికర్ లోక్ పార్టీ లోను, ప్రొఫెసర్ ఎన్.జి. రంగా ,సర్దార్ గౌతు లచ్చన్నల వంటి స్వాతంత్రసమరయోదుల తోనూ పనిచేసిన విస్వార్ధ రాజకీయవేత్త.మాజీ ప్రధాని చరణ్ సింగ్ నకు స్నేహితులు.
శ్రీ తమ్మిశెట్టి రామారావు :ఈయన జర్నలిస్ట్ మరియు కధారచయత.ఈయన వ్రాసిన పలు కధలు,యువ,జ్యోతి వంటి పత్రికలో ప్రచురితమయ్యాయి.
శ్రీమతి గౌడు జోగామాంబ : వీరి జన్మ స్థానము యలమంచిలి. ఈమె తల్లిదండ్రులు మోడేకుర్తి వెంకట రత్నము సోమయాజులు.ఈమెకు 16 వ ఏటనే భర్త మరణించగా వైరాగ్యభావమును పొంది 1995 సం.లో రాధాకృష్ణసమాజమను పేరుతో పలు ప్రాంతాలలో ఆద్యాత్మిక కేంద్రాలను నెలకొల్పి ,భగవద్గీత సారాంశము,భక్తిప్రవత్తి, వైరాగ్య సందీపని వంటి ఆధ్యాత్మిక గ్రంధాలు వ్రాసారు.
దిమిలి పొడుగు మనిషి : దిమిలి పొడుగు మనిషిగా పేరుపొందిన దిమిలి గ్రామానికి చెందిన సురమళ్ళ సంజీవరావు మరణించి 20 సంవత్సరాలయినా ‘ రంగ వెళ్లి పోయానే నారాయణమ్మ” లాంటి హాస్య పాటలు, ‘ఒరే అప్పారావు’ లాంటి హాస్య డైలాగులు ఇప్పటికి మైకుల్లో మారుమ్రోగుతుంటాయి.ఆయన నాలుగు దశాబ్దాల పాటు ,మన రాష్ట్రంతోపాటు,ఒరిస్సా,బెంగాల్ లలో అనేక హాస్యప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల నుర్రూతలూగించేరు.
వీసం సన్యాసినాయుడు: సైతారుపేట కు చెందిన సన్యాసినాయుడు 1962,1972 లలో యలమంచిలి నియోజకవర్గ శాసన సభ్యునిగా ఎన్నికై, విజయభాస్కరరెడ్డి మంత్రివర్గం లో సహకారశాఖా మంత్రి గా పనిచేశారు.
డాక్టర్.బి.వి.పరమేశ్వరరావు: గ్రామీణాభివృద్ధి కై పాటుపడుతున్న అత్యున్నత స్వచ్ఛంద సంస్థ అయిన భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు.స్వగ్రామం దిమిలి.ఈయన విశాఖ ఎ.వి.ఎన్ కాలేజిలో డిగ్రీ,ఆంధ్రా యూనివర్సిటీ లో పిజి,1967లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి అణు భౌతిక శాత్రం లో డాక్టరేట్ పొందారు.ఈయన కు అణుశాస్త్రవేత్తగా ఉగ్యోగ అవకాశాలు వచ్చినా వాటిని వదులుకొని పంచదార్ల వద్ద ‘భాగవతుల చారిటబుల్ ట్రస్ట్’ అను స్వచ్చంద సంస్థ ను1976లో స్తాపించి గ్రామీణుల జీవితాలు మెరుగు పరచడం కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు.1988 సంవత్సరం లో ది వీక్ వారపత్రిక ‘ మేన్ అఫ్ ది ఇయర్’ గా వీరిని ఎంపిక చేసింది . నేషనల్ లిటరసీ మిషన్ ,నేషనల్ వేస్ట్ లాండ్ డవలప్మెంట్, అల్ ఇండియా ఖాది అండ్ విలేజ్ డవలప్మెంట్, నేషనల్ ఇన్స్తిటూట్ అఫ్ రూరల్ డవలప్ మెంట్ మొదలగు సంస్థలో సభ్యులు గాపనిచేశారు.
పప్పల చలపతి రావు:

Pappala

దిమిలికి చెందిన చలపతిరావు 1985 నుండి 1999 వరకు జరిగిన ఎన్నికలలో నాలుగుధపాలుగా తెలుగుదేశం ఎమ్మెల్యే గా గెలిచి చరిత్ర సృష్టించారు.,2004 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా అనకాపల్లి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్,తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వంటి పలు పదవులలంకరించారు.ఈయన హయాములో నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసారు. యలమంచిలికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ,అర్.టి.సి.బస్ కాప్లేక్స్,30 పడకల కమ్యూనిటీ హాస్పటల్ ,గురప్పసత్రం లో టి.టి.డి కళ్యాణమండపం నిర్మాణాలు జరిగాయి. వరహానదిలో సోమిదేవపల్లి వద్ద గొట్టపు బావులు తవ్వి పంపింగ్ ద్వారా మంచినీటి ని పంపి ,ఇక్కడవాటర్ టాంకులు నిర్మించి ,కుళాయలద్వారా నీటిని సరఫరా చేసి యలమంచిలి త్రాగునీటి సమస్యను కొంతవరకు పరిష్కరించేరు. రు.5.6 కోట్లు మంజూరు చేయించి శారదా నదిపై కొత్తూరు వద్ద హైలెవెల్ బ్రిడ్జి నిర్మించేరు. 3 ప్రపంచబ్యాంక్ నిధులతో నియోజవర్గం లో అనేక గ్రామాలలో తారు రోడ్లు,గోకివాడ,కొత్తూరు, పెదపల్లి వాటర్ స్కీముల నిర్మాణాలు జరిగాయి. ఈయనకు మంత్రిపదవి అనేక పర్యాయాలు త్రుటిలో తప్పిపోయినా ,ఈయన నిస్వార్ధ రాజకీయాలకు గుర్తింపు గా 2015 లో ఎం.ఎల్ సి పదవి ఈయనని వరించింది.ప్రస్తుతం తెలుదేశం జిల్లా అధ్యక్షుని గా వున్నారు.
శ్రీ ఆడారి తులసీరావు: యలమంచిలి చెందిన తులసీరావు గ్రామ సర్పంచ్ మూడు దశాబ్దాలు పనిచే చేసి, 1985 సం.నుండి విశాఖ కోపరేటివ్ డైరీ చైర్మన్ గా వ్యవహరిస్తూ,విశాఖ డైరీని రాష్ట్రం లో అగ్రగామి డైరీగా అభివృద్ధి పరచి,పాడిరైతుల సంక్షేమానికి అనేక పధకాలుఅమలుచేస్తున్నారు. తెలుగు దేశంపార్టీ ఆవిర్భావంనుండి జిల్లా లో ముఖ్య నాయకుడే గాక పార్టీ అధ్యక్షుని గా చాలా కాలం గా పనిచేస్తున్నారు.గత అర్ధ శతాబ్దం పైగా గ్రామ పంచాయతీ వీరి కుటంభీకుల ఏలుబడిలోనే ఉన్నాది.
శ్రీ రంగా చిన వెంకట స్వామి (రంగాపెద్ద): ఈయన వైశ్యప్రముఖులు మరియు సర్దార్ గౌతు లచ్చన్న గారి శిష్యులు.ఈయన దాతృత్వం వల్ల శ్రీ వీరభద్ర స్వామి ,వేణుగోపాలస్వామి, ,కన్యకాపరమేశ్వరి అమ్మ వారి ఆలయాలు పునరుద్దరణ జరిగాయి.ఈయన వైశ్య కుల సంక్షేమానికి పాటుపడడం తో పాటు యలమంచిలి దిమిలి రోడ్డు కూడలి లో అమజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రతిష్టాపన,శ్రీ వాసవీ కల్యాణమండప నిర్మాణం, స్మశాన వాటిక పునర్నిర్మాణం వంటి అనేక ధార్మిక కార్యక్రమాలలోను, యలమంచిలి పౌర సేవాసంఘ కార్యక్రమాలలోను నిర్మాణాత్మక పాత్ర వహించారు.

15.సమస్యలు

యలమచిలి మునిసిపాలిటి సమస్యల వలయం లో కొట్టుమిట్టాడుతున్నది.ప్రజలులో పేదరికం,నిరుద్యోగం,నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నది. వ్యవసాయం వర్షాలమీదే ఆధార పడడం వల్ల పంటలకు గేరంటీ లేదు. పశుగ్రాసపు కొరత ఉన్నది. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు.తగిన రవాణా ,నిల్వ సదుపాయం లేకపోవడం వల్ల కూరగాయల రైతులు నష్ట పోతున్నారు.
యలమంచిలికి సమీపం లోనున్న అచ్యుతాపురం,నక్కపల్లి వంటి గ్రామాలకు అనేక పరిశ్రమలు వచ్చినా ఇక్కడ అటువంటి ఛాయలేమీ లేవు. ప్రజలకు ఎటువంటి ఉపాది వనరులు అందుబాటులోలేవు.
ఎలమంచిలి కన్నా పెద్దవి,వ్యవసాయ,వాణిజ్యపరంగా ముందుండే పాయకరావుపేట ,చోడవరం గ్రామాలను మునిసిపాలిటీలుగా మార్చకుండా రాజకీయకారణాలవల్ల చుట్టుప్రక్క గ్రామాలను విలీనం చేసి యలమంచిలి మేజర్ పంచాయితీని మునిసిపాలిటీ గా మార్చడంవల్ల అభివృద్ధి లో ఎటువంటి మార్పులేదు కాని ఇంటి పన్నులు విపరీతం గా పెంచబడ్డాయి. విలీనగ్రామాల ప్రజలు ’ వెలుగు’ ‘150 రోజుల ఉపాధి హామీ’ వంటి పధకాలను కోల్పోయారు.విశాఖపట్నం జిల్లా లో విశాఖపట్నం మినహా మిగతావన్నీ వెనుకబడిన ప్రాంతాలే.
పట్టణం లో త్రాగునీరు,పారిశుధ్య సమస్యలు మెరుగుపడలేదు. ప్రతి ఇంటికి మంచినీటిసరఫరా కు తగిన నీటి నిల్వ టాంకులు గాని ,నీటి వనరులుగానిలేవు.శుద్ధి చేయని మంచినీరు వీధి కుళాయల ద్వారా రోజూ ఒక గంట మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు.పారిశుధ్య పనులకు పూర్తి సిబ్బంది,వాహనాలు లేవు. మురుగు నీటి కాల్వల నిర్వహణ అధ్వాన్నం. మునిసిపాలిటీ అయిన తర్వాత పారిశుద్యం పై ప్రజల సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు.కొత్తగా ఏర్పడుతున్న కాలనీలకు వీధులగాని,ఎటువంటి సౌకర్యాల కల్పనా లేకపోయినా ఇటీవల ఇంటిపన్నుల వడ్డన భారీగా జరిగింది.
ఆవులు,పందులు నిత్యం సంచరించే కూరగాయల మార్కెట్,చేపల మార్కెట్ ల నిర్వాణ గురిచి చెప్పనవసరం లేదు. గత ఎమ్మెల్యే ‘రైతు బజార్’ ఏర్పాటు చేసినా పాతకూరగాయల వర్తకులే అక్కడకూడా ప్రవేశించి దాన్ని మూతపడేటట్టు చేసారు.
వర్షాకాలంలో యానాద్రి కాలనీ,శేషుగెడ్డ వల్ల అయోధ్యాపురికాలనీ ముంపుకు గురిఅవుతున్నాయి.పట్టణం లో తగిన విధ్యా, వైద్య సదుపాయాలులేవు.బాలికల జునియర్ కాలేజి అవసరం ఎంతైనా ఉన్నది.
పార్కులు గాని,ప్రత్యెక ఆట స్థలాలుగానిలేవు. రిటైర్ అయిన ఉద్యోగులకు,వయో వృద్దులకు రైల్వే ప్లాట్ ఫారంమే సేదతీరే పార్క్. గ్రామాన్ని పచ్చదనం తొ నింపడం కోసం ఒకప్పుడు ప్రభుత్వ హైస్కూల్ లో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పనిచేసిన శ్రీ ముక్కామల తాండవ కృష్ణ, విశ్రాంతఉపాధ్యాయులు శ్రీ పుల్లా వెంకటరావు లు స్వచ్చందంగా వీధులలో చెట్లు నాటి అవి పెరిగేందుకు తగిన ఏర్పాట్లు చేసారు. ఈమధ్య కాలం లో విశ్రాంత ఐ.ఏ.ఎస్.ఆఫీసర్ శ్రీ ఐ.ఎస్.రావు గారు.ఇంజినీర్ శ్రీ కోదాటి శేషగిరి రావు గార్ల నాయకత్వం లో ఎలమంచిలి పౌర సేవాసంఘం వారు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు.ఊరిలో ఉండే బహిరంగ సాంస్కృతిక వేదిక ‘ఘంటసాల కళామందిరం’ హూద్హూద్ తుఫానుకు కూలిపోయినా పట్టించుకొనే నాధుడు లేదు. ఒకప్పుడు గ్రామం లోఉండే కొన్ని స్వచ్చంద సంస్థలు పరిసగ్రామాలో సేవా కార్యక్రమాలు చేపట్టేవి.
పట్టణం లో వీధికుక్కల,కోతుల బెడద విపరీతంగా ఉంది.కోతులు ఇళ్ళలోకి జొరబడి బీభత్సం సృష్టించి రోజూ అనేకమందిని గాయ పరుస్తున్నాయి. వీటిని అరికట్టే చర్యలేమీలేవు. మెయిన్ రోడ్డుమీద ఒక సులబ్ తరహా పబ్లిక్ టాయిలెట్ కట్టినా దానిని నిరుపయోగంగా ఉంచారు.
ఎలమంచిలి రైల్వే స్టేషన్ ‘బి’ గ్రేడ్ స్టేషన్ అయినప్పటికీ గత ఇరవై సంవత్సరాలుగా ఏవక్క ట్రైన్ కు కొత్తగా హల్ట్ ఇవ్వకపోవడం వల్ల సాయింత్రం ఇదు దాటిన తర్వాత విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ లేదు.అదే విధంగా చెన్నై వెళ్ళాడానికి ధన్బాద్- అలెప్పి మినహా మరొక ట్రైన్ లేదు. జన్మభూమి,రత్నాచల్,ప్రశాంతి,లింక్ ఎక్ష్ప్ర్ప్రెస్ ల హాల్ట్ కోసం ప్రజలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రజాప్రతినిధుల నిర్లిప్తత వల్ల అట్టి ప్రయత్నాలు ఫలించుట లేదు .
ఈసమస్యలన్నింటిని ప్రజల సహకారం తో స్థానిక ఎం.ఎల్.ఎ., ఎం.పి., మనిసిపల్ చైర్మన్ మరియు ఇతరలు ప్రజాప్రతినిధులు పరిష్కరించవలసిఉన్నది.

==$$$$==

ఉపకరించిన గ్రంధాలు,పత్రికలు,వెబ్ సైట్లు
1.ఆచార్య కొల్లూరి సూర్యనారాయణ. డా.ఆరుద్ర ముందుమాట తొ ‘పురాతన శైవక్షేత్రం – పంచదారల ‘యలమంచిలి :భాగవతుల ట్రస్ట్,1988
2.కోరుమిల్లి సుబ్బారావు. ప్రశస్తి, శ్రీ కోరుమిల్లి వీరభద్రరావు స్మారక సంస్క్రుతిక విధ్యా ట్రస్ట్; యలమంచిలి
3.పప్పల సూర్యనారాయణ.దిమిలి గ్రామ చరిత్ర ,భాగవతుల సోమన్న జెడ్.పి.హైస్కూల్ వార్షిక సంచిక;దిమిలి
4.ఏనుగుల వీరాస్వామయ్య. కాశీ యాత్ర, ఒరియంట్ లాంగ్మెన్ ;మద్రాస్
5.విజ్ఞాన సర్వస్వము –తెలుగు సంస్కృతి-మొదటిభాగము, దేశము-చరిత్ర, తెలుగు విశ్వవిద్యాలయం.హైదరాబాద్,1990
6.సమాజశాస్త్రము –భారతీయ సమాజము.డా.బి.ఆర్ .అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ,హైదెరాబాద్,2010
7.ఎస్.ఎ.విద్యాసాగర్ .పల్లెనుమింగిన పెట్టుబడి.గ్రామీణ ఆర్ధికం –ఒక పరిశీలన, పీకాక్ బుక్స్:హైదరాబాద్,2013
8.కాటమరాజు కధలు-చారిత్రకత మరియు కావ్యాలంకారచూడామణి-చారిత్రాకాంశములు. భారతి సాహిత్య మాసపత్రిక.సెప్టెంబర్ ,1988
8. శ్రీరంగం నారాయణ బాబు.పాలవాన నాటిక,ఆంధ్రపత్రిక వికారి ఉగాది సంచిక ,1959-60
9.ప్రజాశక్తి దినపత్రిక ప్రత్యెక సంచిక,30.11.2005
10.ఈనాడు ఆదివారం,22.8.2010
11.ఆంద్రప్రదేశ్ దర్శని. విశాలంధ్ర ప్రచురణలు,విజయవాడ
12. Bhavans History. The Age of Imperial Kanoj

13.విశాఖపట్నం డిస్ట్రిక్ట్- వెబ్ సైట్
14.కొండకర్ల ఆవ – వెబ్ సైట్
15.ఏటికొప్పాక – వెబ్ సైట్
16.భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ – వెబ్ సైట్
17.యలమంచిలి తహసిల్దార్.,ఎం.డి.ఓ ఆఫీసు వారు అందించిన డేటా.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.